Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Tuesday, August 2, 2011

గాడిద-ఏనుగు పోరు

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంగా మారినట్లు ప్రపంచ ధనిక దేశాల విన్యాసాలున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని అమెరికాలోని పాలక ప్రతిపక్షాల బడ్జెట్‌కోత, దేశ రుణపరిమితిపై వేస్తున్న ఎత్తులు జిత్తులు చివరకు ప్రపంచంలో దేనికి దారితీస్తాయో తెలియని అయోమయంలోకి నెడుతున్నాయి. చిత్రమేమంటే అవసరం లేని ఆయుధాలు కొని ఐరోపాలోని పేద దేశమైన గ్రీస్‌ దివాళా తీస్తే ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్న అమెరికా కూడా ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు ప్రపంచ దేశాలన్నింటికీ పొదుపు చర్యలు తీసుకోవాలని బోధించే అమెరికా ఇప్పుడు తమ అప్పు భారాన్ని తగ్గించుకొనేందుకు ఎలాంటి పొదుపు చర్యలు తీసుకోవాలో తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతోంది. ఆగస్టు రెండవ తేదీలోగా ఈ సమస్యపై ఏదో ఒక పరిష్కారానికి రాని పక్షంలో ప్రభుత్వ బిల్లు చెల్లింపులు నిలిచిపోతాయి. ఈ స్థితిని చూసి యూరోపియన్లు దివాళాకు సిద్దంగా ఉన్న మా పోర్చుగల్‌కు అమెరికాకు తేడా ఏంటట అని జోకులు వేస్తున్నారు. అనేక ఇతర దేశాలపై ప్రభావం చూపుతుందన్న జ్ఞానం, బాధ్యత లేకుండా అమెరికాలోని గాడిద-ఏనుగు(రిపబ్లికన్‌-డెమోక్రటిక్‌ పార్టీల గుర్తులు) దెబ్బలాడుకుంటున్నాయని చైనా వార్తా సంస్థ సిన్హువా ఘాటుగా స్పందించింది. రుణ ఊబిలో అమెరికా కూరుకుపోతే చైనా, ఇతర దేశాలు ఎందుకు అంతగా ఆందోళనకు గురికావాలని ఎవరైనా అడగవచ్చు. ఒకనాడు ప్రపంచంపై పెత్తనం చలాయించిన బ్రిటీష్‌ పౌండు స్థానాన్ని అమెరికన్‌ డాలర్‌ ఆక్రమించింది. దాంతో డాలర్‌పే పరమాత్మ అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇప్పుడా ఆ డాలరే ఆరు దశాబ్దాలలో తొలిసారిగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నపుడు డాలర్లను కలిగి ఉన్నవారికి,దానిపై ఆధారపడిన వారికి ఆందోళన లేకుండా ఎలా ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే అధికంగా చైనా ఇప్పుడు 1.16లక్షల కోట్ల డాలర్లతో అమెరికన్‌ బాండ్లు కొనుగోలు చేసింది. ఒక వేళ తన కరెన్సీ విలువను అమెరికా తగ్గించినా, బరితెగించి దివాలా ప్రకటించినా మునిగిపోయేది ప్రపంచమే. సంక్షోభ ఊబిలో మునిగి ఉన్న తమను రక్షిస్తుందని భావిస్తున్న అమెరికాయే రుణ ఊబిలో దిగబడితే తమ గతేం కానని ఐరోపా యూనియన్‌ దేశాలు బావురుమంటున్నాయి. ప్రపంచ ద్రవ్య మార్కెట్ల పట్ల తమకూ బాధ్యత ఉందన్న స్పృహతో అమెరికన్‌ రాజకీయ పక్షాలు వ్యవహరించాలని జర్మన్‌ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు చేజేతులా తాను సృష్టించిన సంక్షోభానికి తాను బలౌతూ ప్రపంచాన్ని కూడా బలితీసుకుంటున్న అమెరికాలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. సకల రోగాలున్న రోగికి ఒకదానికి మందిస్తే మరొక రుగ్మతకు దారి తీస్తుందన్న మాదిరి పరిస్థితి తయారైంది. ఇప్పుడున్న ఉద్దీపన పథకాలు, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రుణభారం పెరుగుతుంది. దాన్ని అదుపులో ఉంచటానికి ఉద్దీపన, సంక్షేమ పథకాలకు కోతపెడితే ఇప్పుడున్న ఒకశాతం అభివృద్ధి రేటు మైనస్‌లో పడుతుంది. దీనిలో ఏది జరిగినా అధికారంలో ఉన్న బరాక్‌ ఒబామా రెండవసారి ఎన్నికయ్యే అవకాశం ఉండదు. ధనికుల రాయితీలు తగ్గించకుండా సంక్షేమ పథకాలపై కోత పెట్టించటం ద్వారా ఒబామాను ప్రజలనుంచి దూరం చేసి తాము గద్దెనెక్కాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు చూస్తున్నారు. అందుకోసం రెండుపార్టీలు గత నెల రోజులుగా ఆడుతున్న చెలగాటం ప్రపంచానికి ప్రాణసంకటంగా మారుతోంది. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్న ప్రతిపక్ష రిపబ్లికన్లు ఆమోదించిన ఒక ఫార్ములా తీర్మానాన్ని 24 గంటలలోపే డెమొక్రాట్లు మెజారిటీ ఉన్న సెనేట్‌ తోసి పుచ్చింది. రెండు సభలలోనూ కొందరు రిపబ్లికన్లు అధికార పార్టీతో చేతులు కలిపారు.
నిజంగా అమెరికా అంత ప్రమాదంలో ఉందా? అలాంటపుడు ఇప్పటికీ అది ప్రపంచ అగ్రరాజ్యంగా ఎందుకుంటోందని కొందరికి సందేహం రావచ్చు. సంక్షోభం, సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్థికంగా, మిలిటరీ, రాజకీయంగా అమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యంగానే ఉంది. దాని ఆధిపత్యానికి ముప్పుతెచ్చే సమస్యల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. అందువల్లనే గాడిద-ఏనుగు పార్టీలు రెండూ కూడా ఎంతసేపటికీ సామాన్యుల సంక్షేమ పథకాలకు ఏమేరకు కోతపెట్టాలనే దానిపై కీచులాడుకుంటున్నాయి తప్ప ఆఫ్ఘన్‌, ఇరాక్‌, లిబియాలపై దాడులు, దురాక్రమణలకు, ప్రపంచంలో ఇతర చోట్ల అగ్గి రాజేసేందుకు చేస్తున్న మిలిటరీ ఖర్చు తగ్గించటం గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు. రానున్న పది సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు కోత పెట్టి పొదుపు చేయాలని చూస్తున్న మొత్తం కంటే యుద్ధ ఖర్చు రెండింతలుంది. పోనీ ఆ యుద్ధం ద్వారా ఏమైనా సాధించిందా అంటే తన కంపెనీల ఆయుధాలు అమ్ముకోవటం, చవకగా ఇరాక్‌ నుంచి చమురును కొట్టేయటం తప్ప సామాన్య అమెరికన్లకు ఒరిగిందేమీ లేదు. ఉగ్రవాదంపై పోరు పేరుతో ఆప్ఘనిస్తాన్‌లో చేస్తున్న దాడులు ఉగ్రవాద ప్రమాదాన్ని మరింత పెంచాయే తప్ప తగ్గించలేకపోయాయని ఒసామా బిన్‌లాడెన్‌ హత్యానంతర పరిణామాలు కూడా స్పష్టం చేశాయి. అన్నమైతే నేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లు అమెరికా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాలు తలెత్తిన ప్రతిసారీ నష్టపోయింది సామాన్యులు తప్ప కార్పొరేట్‌ కంపెనీలు కాదు. తాజా సంక్షోభంలో అమెరికాలో దాదాపు 50లక్షల మంది తమ కొంపాగోడు కోల్పోయారు తప్ప వారికి అప్పులిచ్చి తిప్పలకు గురిచేసిన బ్యాంకర్లు లక్షల కోట్ల డాలర్ల ప్రభుత్వ ఉద్దీపన పథకాలతో అపరిమిత లాభాలు ఆర్జించారు. వారికి సంక్షోభం వరంలా పరిణమించింది. ఇప్పుడు కూడా అలాంటి వారే రెండుపార్టీల వెనుక చేరి సామాన్యుల నెత్తిన శఠగోపం పెట్టించేందుకు చక్రం తిప్పుతున్నారు.
సోమవారంలోగా సమస్య పరిష్కారంగాకపోతే అమెరికాలో ఏమౌతుంది? చికాగో నగరంలో వచ్చే గురువారం నాడు అట్టహాసంగా తన 50వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకొనేందుకు అధ్యక్షుడు ఒబామా సిద్ధం అవుతున్నాడు. నిజంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అలా చేస్తారా? గడువులోగా తాను చెప్పిన విధంగా పార్లమెంట్‌ రాజీకి రాకపోతే రాజ్యాంగంలోని పద్నాల్గవ సవరణ కత్తిని ఉపయోగించేందుకు సిద్ధం అవుతున్నాడు. దాని ప్రకారం ప్రభుత్వ రుణ పరిమితిపై అధ్యక్షుడి నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు. ఎన్నికలలో రుణాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొనేందుకు ప్రతిపక్ష రిపబ్లికన్లు ఒబామాను ఆ స్థితికి నెడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం సహకరించని కారణంగా కత్తి ఝళిపించక తప్పలేదని ఒబామా కూడా ఎన్నికల్లో చెప్పుకుంటాడని వేరే చెప్పనవసరం లేదు. ఏమైనా అమెరికాలోని అధికార,ప్రతిపక్షపార్టీలు రెండూ కలిసి సామాన్య అమెరికన్లు, ప్రపంచ దేశాలను కష్టాల పాల్జేస్తున్నాయి.
article From : prajasakti daily

No comments:

Post a Comment