Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Tuesday, August 9, 2011

స్కాములోరి సామ్రాజ్యాలు




స్వాములమని ఇంకా మాట్లాడితే సాక్షాత్‌ భగవత్‌ స్వరూపులమని తమకు తామే ముద్ర వేసుకుని పూజా పీఠాలధిష్టిస్తున్నారు. సొంత సామ్రాజ్యాలు సృష్టించుకుంటున్నారు. అమాయకుల నమ్మకాలతో ఆటలాడుకుంటున్న ఇలాంటి ఆషాడభూతుల అసలుసిసలు అవతారాలు ఒక్కొక్కటే బట్టబయలవుతున్నాయి. నిత్యానందుని అత్యానంద రహస్యాలు ఆమూలాగ్రం వెల్లడై అతగాడు అత్తగారింటిని సందర్శించవలసిన గతి పట్టింది. వచ్చాక మళ్లీ భక్తాభినేత్రి రంజితతో కలసి రసవత్తర గురు పూర్ణిమ దృశ్యంలో దర్శనమివ్వడం వేరే సంగతి. అంతకు ముందే కల్కి భగవానుని కళంకిత గాధలు వెలుగు చూశాయి. అంతు తెలియని మానసిక స్థితిలో అపసవ్య అవస్థలో అమాయకులెందరో ఆ సాలెగూడులో చిక్కిన ఉదంతాలు టీవీలలో ప్రసారమయ్యాయి. వీటన్నిటినీ మించి బాబాలకు బాబాగా దేవేంద్ర వైభవంలో మునిగితేలిన పుట్టపర్తి సాయిబాబా జబ్బుపట్టి ఆస్పత్రి పాలవడం, ఆశ్రమంలోని అపార సంపదలు తరలిపోవడంపైన భక్త జనాలే గగ్గోలు పెట్టారు గాని ఏలిన వారు వేలు కదల్చలేదు. బాబా అవసానదశ నుంచి అంత్యక్రియల వరకూ కూడా ఆ విచారం కన్నా వివాదమే ప్రధానమైపోయింది. బయటివారి సంగతి అటుంచి బాబా బంధువర్గాలు కూడా గగ్గోలు పెడుతుంటే సర్కారు వారు మాత్రం ఆఖరు వరకూ మీన మేషాలు లెక్కించి అంతా అయిపోయాక రంగంలోకి దిగామనిపించారు. అక్కడ గూడుపుఠానీ జరుగుతుందని భక్తులు కూడా వాపోక తప్పలేదు. భక్తి కొద్దీ వారు ఇదంతా బాబాకు సంబంధం లేదని అనుకోవచ్చు. అంతటి వ్యక్తి ఆంతరంగికులను అమాయకంగా ఎంచుకుంటాడా అని ఆలోచించలేకపోవచ్చు. కాని అదే అసలైన ప్రశ్న. ఏతావాతా తేలేదొక్కటే! స్వీయ సామ్రాజ్యాలను తలపించే స్వామీజీల ఆశ్రమాలు అనేక రకాల అవాంఛనీయ శక్తులకు, అవినీతిపరులకు ఆశ్రయాలుగా మారుతున్నాయి. చెదురుమదురుగా గాక అన్ని చోట్లా అందరి విషయంలో ఇదే తంతు. స్వాములకూ స్కాములకూ అవినాభావ సంబంధం ఎవరూ కాదనలేని సత్యం. ఒకప్పుడు హేతువాదులు లేదా నాస్తికులు, కాదంటే కమ్యూనిస్టులు మాత్రమే చెప్పే విషయాలు ఇప్పుడు మీడియాలో రోజూ పుంఖానుపుంఖాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు స్వాముల స్కాముల లీలా విలాసాలు మచ్చుకు కొన్ని...
70, 80 ఏళ్ల కిందటి వరకూ ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాల అధిపతులూ, రామకృష్ణమఠాలు నిర్వహించే స్వాములు లాంటి కొద్దిమంది ధర్మ ప్రచారకులుండేవారు. వారు కూడా దైవభక్తినీ, ధర్మాచరణను మాత్రమే బోధించేవారు. కానీ ఈనాడు అనేక పీఠాలూ మఠాలే కాదు, అనేకమంది కలియుగ దేవుళ్లు అవతారమెత్తి ధార్మిక జీవనాన్ని శాసిస్తుండడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. విచిత్రమేంటంటే 12,96,000 సంవత్సరాల కాలపరిమితి గల త్రేతాయుగంలో రామావతారమొక్కటే ధరించినట్లుగా పేర్కొనబడింది. పరశురాముడు కూడా శ్రీరాముడు జన్మించిన తర్వాత తన అవతార అవసరం తీరిందంటాడని రామాయణంలో చెప్పబడింది. 8,64,000 సంవత్సరాల కాల పరిమితిగల ద్వాపరయుగంలో కృష్ణావతారమొక్కటే చెప్పబడింది. కలియుగంలో కూడా ఐదు వేల సంవత్సరాలలో ఒక్క దేవుడూ అవతరించలేదు కానీ గత 150 ఏళ్లలో అనేక దేవుళ్లు జన్మించారనీ, వాళ్లు భక్తులకు మోక్షసామ్రాజ్యాన్ని కాక, భక్తుల క్షణిక బాధలూ, తాత్కాలిక సమస్యలూ తీర్చారనీ ప్రచారం జరుగుతుండడం ఈ శతాబ్ది ప్రత్యేకతగా గుర్తింపు పొందుతోంది.
కోవూరు నుంచి జెవివి వరకూ

70 లలో అబ్రహాం టి.కోవూరు అనే శ్రీలంక హేతువాద డాక్టరు సత్యసాయిబాబాను తన ముందు మహిమలు నిరూపించవలసిందిగా సవాలు చేశాడు. కాని బాబా స్పందించలేదు. ప్రభుత్వాలూ ప్రశ్నించలేదు. క్రమేణా టీవీ మీడియా వచ్చిన తర్వాత బాబా మహిమలు మానేసి దాన ధర్మాలు మొదలెట్టారు. అది కూడా ప్రజా ధనమే మరి. ఇటీవల చాలా కాలంగా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు మహిమల బండారం బయటపెడుతున్నారు. బాబాలు, స్వాములు చేసేవన్నీ మరింత బాగా చేసి చూపిస్తూ ఇదంతా హస్త లాఘవమేనని నిరూపిస్తున్నారు. దురదృష్టం ఏమంటే వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు.
పరంపర.. తామర తంపర
వీరిలో షిర్దీసాయిబాబా వారసులుగా చెప్పుకుంటున్న పుట్టపర్తి సత్య సాయిబాబా, పెనుగొండ కాళేశ్వర్‌, కర్నూలు బాలసాయి బాబా మరియు దత్తాత్రేయుని అపరావతారంగా చెప్పబడుతున్న గణపతి సచ్చిదానంద స్వామి, విష్ణుమూర్తి పదవ అవతారంగా తనను తాను ప్రకటించుకున్న కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌, కృష్ణుని అవతారంగా చెప్పుకుంటున్న స్వామి సుందర చైతన్య, ప్రకాశం జిల్లా రామదూత స్వామి... ఇలా అనేకమంది ''భగవత్‌ అవతారమూర్తులు'' మన రాష్ట్రంలోనే అవతరించడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. వీరందరూ అతి సామాన్య, పేద కుటుంబాల్లో జన్మించారు. కానీ ప్రస్తుతం వేల కోట్ల రూపాయల ఆస్తులతో సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలా అనేక నేరారోపణలు వీరిమీదున్నాయి. చాలావరకు నిరూపితమయ్యాయి కూడా. కొన్ని నేరాలను తమ పరపతితో విచారణ స్థాయిలోనే తొక్కేయగలిగారు. వీరు భగవంతుని అవతారమూర్తులని పిలుద్దామా? అంటే కొన్ని దశాబ్దాల కాలంలోనే ఈ విశాల భూగ్రహంపై ఇంతమంది అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్న ఉదయిస్తుంది. అదీగాక వీరందరూ జీవించి ఉన్న సమయంలోనే ధర్మ సంస్థాపన జరగకపోగా నేరాల తీవ్రత, నేరస్థుల చిట్టా రోజురోజుకీ పెరుగుతోంది. మరి వీరి అవతార ప్రయోజనమేంటి? పోనీ స్వాములు, యోగులు, సన్యాసులు అనుకుందామా అంటే డబ్బు, బంగారం, ఆస్తులున్న సన్యాసులను చూస్తేనే మహా పాపమనీ, ఆ పాపం పోగొట్టుకోడానికి కట్టుకున్న బట్టలతోనే స్నానం చేయాలనీ ''యాజ్ఞవల్క్య స్మృతి'' వంటి స్మృతులు ఘోషిస్తున్నాయి. కాబట్టి వీరు సన్యాసులూ కారు. వీరి ''లీల''లను కొన్నింటిని పరిశీలిద్దాం.


కర్నూలు బాలసాయిబాబా ఈయన మొదట్లో రికార్డింగ్‌ డ్యాన్సర్‌. బాలసాయిగా అవతారమెత్తాక ఈయన ఆస్తి వందల కోట్లలోకి చేరింది. ఈయన నడిపే స్కూళ్లలో ఉచితంగా చదువు చెప్తారని ప్రచారం. కానీ పిల్లల నుండి 40 వేల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తారు. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కోర్టు ఇతన్ని భూ కబ్జాదారునిగా నిర్థారించింది. చెక్‌ పవర్‌ తన దగ్గరే అట్టిపెట్టుకున్న ''భగవాన్‌'' ఈయన.

 కాళేశ్వర్400 గదులతో కూడిన అన్ని వసతులూ ఉన్న బ్రహ్మాండమైన ఆశ్రమం ఈయనది. ఈ ఆశ్రమంలోని సిబ్బంది జీతాల ఖర్చే నెలకు పది లక్షల రూపాయలుంది. ఒక భక్తురాలి పట్ల అమర్యాదగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. 2005లో పెళ్లి చేసుకున్నాడు. ఆస్తుల విలువ కొన్ని కోట్ల రూపాయలు

 సుందర చైతన్యానంద స్వామి స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం. చిన్నతనంలో కనీసం సైకిల్‌ కూడా లేని పరిస్థితి నుండి ఈనాడు అనేక ఎ.సి కార్లున్న పరిస్థితికి ఎదిగిపోయాడు. కబ్జాల్లో చెయ్యి తిరిగినవాడు. దళితుల గుడిసెలను కూడా వదిలిపెట్టని కబ్జావీరుడు. ధవళేశ్వరంలో ఆ కబ్జాను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అఖిల పక్ష కమిటీ కార్యకర్తలను గూండాలతో కొట్టించే ప్రయత్నం చేశాడు. ఉపన్యాసాలు చేసేటప్పుడు నెమలి పింఛం పెట్టుకుని భక్తులు తనని శ్రీకృష్ణావతారుడుగా భావించాలంటాడు. భక్తులతో ఒకసారి బంగారు కిరీటం పెట్టించుకుని, బంగారు మురళిని బహుమతిగా అందుకున్నాడు. అయితే ద్వాపరయుగ కృష్ణుడికీ, సుందర చైతన్యానందుడికీ గల ప్రధానమైన తేడా ఏమిటంటే శ్రీకృష్ణుడ్ని ఎంత బంగారంతోనైనా సత్యభామ తూచలేకపోయింది. ఒకే ఒక్క తులసిదళంతో అది సాధ్యమైంది. కానీ మన అపర శ్రీకృష్ణుడు భక్తులకు ఒక్కో తులసిదళం ఇచ్చి వెయ్యి రూపాయలు వసూలు చేశాడు. ఇలా కొన్ని వేల తులసిదళాలు భక్తులకిచ్చి కొన్ని లక్షల రూపాయలు ఆర్జించాడు

 గణపతి సచ్చిదానంద ఈయన పాద దర్శనానికి వెయ్యి రూపాయలు, పాద పూజకు కనీసం 20 వేలు, గృహ ప్రవేశానికి వస్తే మినిమమ్‌ 50 వేలు, అమెరికాలోనైతే పాద పూజకు వేల డాలర్లు వసూలు చేశాడు. ఒక దశలో తన పాదుకలను పంపి ఫీజు వసూలు చేశాడు. ఈయన ప్రస్తుత ఆస్తి వెయ్యికోట్లు.



కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌ ఈయన తనను తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కిగా ప్రకటించుకున్నాడు. ఈయన దర్శనానికి ఐదు వందల రూపాయలు, దీక్షకు 50 వేలు, పాదం చూస్తే వెయ్యి రూపాయలు, పాద పూజకు ఐదు వేలు, మాట్లాడేందుకు వేలకు వేలు వసూలు చేశాడు. మూలమంత్రం అంటూ ఒక మంత్రాన్ని సృష్టించి దాన్ని లాకెట్‌లో పొదిగి, ఆ లాకెట్‌ని భారతీయులకు 50 వేలు, విదేశీయులకు లక్ష రూపాయలకు అమ్మాడు. చిత్తూరు జిల్లా, వరదయ్యపాలెం మండలం, బత్తలవల్లం గ్రామంలో మూడు వందల కోట్ల రూపాయలతో గోల్డెన్‌ టెంపుల్‌ నిర్మించాడు. ప్రస్తుత ఆస్తి విలువ వేల కోట్లలో ఉంది. ఈ ఆశ్రమంలో స్వామీజీ ఇచ్చే ద్రవం తాగిన ఆశ్రమవాసులు అచేతనావస్తలో అయోమయంగా మాట్లాడుతున్న దృశ్యాలు టీవీలలో ప్రసారమై ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈయన భూములు విపరీతంగా ఆక్రమించుకోవడంతో భూ పోరాటాలు కూడా జరిగాయి.అయితే ఇప్పటికీ దీనిపై ప్రభుత్వ చర్య శూన్యం.

రామదూత స్వామి ఈయన ఆశ్రమం నెల్లూరు ప్రకాశం మధ్య ఉంది. ఈయన భూకబ్జాదారుడని స్థానిక తహసీల్దారు కలెక్టరుకు నివేదిక పంపించాడు కూడా. అయినా నాటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, నాటి డిజిపి అరవిందరావు ఈయనను దర్శించి పాదాభివందనాలు, సాష్టాంగ నమస్కారాలు చేయడం ఎవరికీ అంతుచిక్కని విషయం.
సర్కార్ల సహకారం!
అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నా ఆశ్రమాల అధిపతులు శిష్య పరివారంతో సహా వైభోగంలో తులతూగడానికి ప్రభుత్వాధినేతలు పాలక వర్గ ప్రముఖుల కుమ్మక్కు ప్రధాన కారణం. చిన్నాచితకా నేరాలకే అమితమైన ప్రచారం ఇచ్చే ప్రభుత్వం, పోలీసులు ఈ బాబాలు, స్వాముల సామ్రాజ్యాల జోలికి పోరు. సాయిబాబా ఆశ్రమంలో అయిదు హత్యలు జరిగినా దానిపై అధికారిక దర్యాప్తు గాని విచారణ గాని లేకపోగా రాజ్యాధినేతగా వున్న శంకర్‌ దయాళ్‌ శర్మ అది చిన్న విషయమని తేల్చేశారు! బాబా ఆరోగ్యపరిస్థితిపై అనేక ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి తటపటాయించింది. వెళ్లిన మంత్రులు ట్రస్టు నిర్వాహకులకే వంత పాడారు తప్ప తమ వంతు బాధ్యత నిర్వహించలేదు. ఇప్పుడు అనివార్యంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టం జరిగే పోయింది. లోగడ నగ సన్యాసిని మంగమ్మవ్వ ఓ హత్య కేసులో జైలు పాలైంది. తమిళనాడులో ప్రేమానంద అనే స్వామి కూడా అంతే. అమెరికా వెళ్లిన స్వామి రజనీష్‌ (ఓషో) అక్కడి పోలీసుల దాడి తట్టుకోలేక ఇక్కడకు పరుగెత్తుకొచ్చాడు. నీళ్ల స్వాములు, నిమ్మకాయల స్వాములు, వుమ్మేసే స్వాములు... ఎందరెందరో జన విజ్ఞాన వేదిక ధాటికి చిత్తయిపోయారు. ఈ బడా స్వాములు అలా చిక్కకుండా తప్పించుకోవడానికి కారణం ప్రభుత్వ అండదండలే. పాలక వర్గ ప్రముఖులు పనులు జరిపించుకోవడానికి ఈ ఆశ్రమాలను ఉపయోగించుకుంటారు. అక్కడ చట్టాలు పని చేయకుండా అడ్డుకుంటారు. ఇప్పుడు దేశంలో నల్లడబ్బు గురించి ఇంత చర్చ జరుగుతున్నది గాని బాబా ఆశ్రమంలో గుట్టలు పడిన సంపద ఎవరిదనే దానిపై మాత్రం సమాచారం లేదు. దేశ విదేశీయులు ఇష్టానుసారం సంచరించే అలాంటి చోట సంఘ వ్యతిరేక శక్తులు తలదాచుకునే అవకాశాలను ఎవరూ తోసి పుచ్చలేరు. ఆధ్యాత్మికంగా ప్రతిష్టాత్మకమైన కంచి ఆశ్రమ స్వామి జయేంద్ర సరస్వతి అరెస్టు సందర్భంలో వినవచ్చిన కథనాలు కంపరం పుట్టించాయి. ఏదో కారణంతో జయలలిత ప్రభుత్వం నాడు అంత కఠినంగా వ్యవహరించింది గాని అది అరుదైన ఘటన. ఆమెకు స్వయంగా చాలా మూఢత్వం వుంది. అవినీతి వ్యవహారాలతో నిన్న గద్దె దిగిన యెడ్యూరప్ప ముందు స్వామీజీనే సందర్శించారు. నెల్లూరు జిల్లాలోని రామదూత ఆశ్రమానికి కూడా ఆయన తరచూ వస్తుంటారు. తులాభార చక్రవర్తిగా పేరొందిన మన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా బాబాలు స్వాముల చుట్టూ తిరుగుతుండే వారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, పోలీసులు, శాస్త్రజ్ఞులు ఆఖరుకు అత్యున్నత నేతలుగా వుండాల్సిన ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు కూడా రాజ్యాంగ విలువలను కాలదన్ని బాబాల ముందు మోకరిల్లుతుంటే సామాన్య ప్రజలు వారి చుట్టూ చేరడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ప్రజల చైతన్యాన్ని మొద్దుబార్చి పోరాటాల్లోకి రాకుండా చేసేందుకు కర్మ సిద్ధాంతం లాగే బాబాలు కూడా బాగా ఉపయోగపడతారు గనకే పాలకులు వారిని నెత్తిన పెట్టుకుంటారు. ఆపైన తమ అక్రమాలకూ ఉపయోగించుకుంటారు. ప్రశ్నించేవారిని ప్రోత్సహించకపోగా అణగదొక్కుతారు. అంతర్జాతీయ శక్తులు కూడా ఆ విషయంలో వెనకబడవు. వెరసి ఇదొక విష వలయం అంటే తప్పు కాదు.
పుట్టపర్తి సాయిబాబా తనకు తాను భగవంతునిగా ప్రకటించుకున్న ఈ బాబా చనిపోయిన తర్వాత, ఈయన నెలకొల్పిన ట్రస్టు సభ్యులు, బాబా డబ్బునుగానీ, బంగారాన్ని గానీ ముట్టుకునేవారు కాదనీ, విరాళాలన్నీ చెక్కుల రూపంలో ఉంటాయనీ, డబ్బు స్వీకరిస్తే రసీదు ఇచ్చేవారనీ ప్రకటించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన బెడ్‌రూంలో దాదాపు క్వింటాల్‌ (వంద కేజీలు) బంగారం, కోట్ల రూపాయల నగదు కనిపించింది. ట్రస్ట్‌ సభ్యులు రసీదులు లేని, కోట్లాది రూపాయల బంగారం, నగదు అక్కడ ఎందుకు ఉందనే ప్రశ్నకు జవాబు చెప్ప లేదు. మీడియా కూడా సత్యసాయి నివాస గృహం నుండి అక్రమంగా తరలిపోతున్న ధనాన్ని ఎవరు బయటికి పంపారనే విషయం పైనే కేంద్రీకరించింది కానీ, అసలు సాయి నివాసంలో ఎందుకుందనే విషయంపై దృష్టి సారించలేదు.
అంతేకాదు, రిజర్వ్‌ బ్యాంకు సూత్రాల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల వద్ద బంగారం ఎక్కడ్నుండి వచ్చిందనే వివరాలు, రసీదులు లేకుండా కిలోలు, క్వింటాళ్ల లెక్కన బంగారం ఉండకూడదు. కానీ వంద కేజీల బరువున్న సుందర చైతన్యానంద బంగారంతో తులాభారం తూగినా, పుట్టపర్తి సత్యసాయిబాబా వద్ద దాదాపు క్వింటాల్‌ బంగారం లెక్కల్లో లేనిది ఉన్నా రిజర్వ్‌ బ్యాంకు కానీ, ప్రభుత్వం కానీ ఎంక్వయిరీ చేయించిన దాఖలాలు లేవు. అంటే ఈ స్వాములూ, బాబాల ఆశ్రమాలు వారి స్వంత సామ్రాజ్యాలా? వారి నెవరూ సోదా చేయకూడదా?
ఈ భగవాన్‌లు, స్వాములలో కొందరు తమ భారీ నిల్వ ధనంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నారు. కాబట్టి వారిని గౌరవించాలనీ, కీర్తించాలనీ కొందరు అంటుంటారు. ఇదే పరిస్థితి బాబాలు మన అమాయక భక్తుల విషయంలోనూ జరుగుతోంది. కబ్జాదారులు, మోసగాళ్లు.... బాబాలు, స్వాముల అవతారాలు ఎందుకు ఎత్తుతున్నారు? అన్న ప్రశ్నకు ఒక టీవీ చానల్‌ ప్రసారంలో ఒకరు ఇచ్చిన సమాధానం మీ ముందుంచుతాను.
''ఒక కొలనులో కొన్ని చేపలుండేవి. వాటిని తినడానికి ఓ కొంగ వచ్చింది. రోజల్లా ఆ నీళ్లల్లో ప్రయత్నించినా ఒక్క చేపా దానికి దొరకలేదు. అప్పుడది సమీపంలో వున్న తన గురువుగారి దగ్గరకు వెళ్లి తనకు చేపలు దొరికే మార్గం చెప్పమని అడిగింది. ఆ గురువుగారు నీవు రేపు కాషాయ వస్త్రాలు ధరించి వెళ్లు. నీ దగ్గరకే చేపలు వస్తాయి'' అని చెప్పారు. గురువు గారు చెప్పినట్టే చేసి కొంగ కడుపు నిండా చేపలను ఆరగించిందట. ఇదీ కాషాయ వస్త్రాల రహస్యం. అందుకే నిపుణులైన మోసగాళ్లు కాషాయ వస్త్రాలు ధరించి ప్రజల ముందుకు వస్తున్నారు. అమాయకులైన ప్రజలు వారి వలలో పడి తమ సర్వస్వం సమర్పించుకుంటున్నారు.
ఈ సందర్భంలో ఒక విషయం స్పష్టం చేయాలి. కాషాయం ధరించిన వాళ్లంతా మోసకారులు కాదు. ఎవరైతే సామాన్యమైన మెజీషియన్లు చేసే మేజిక్కులను తాము కూడా చేసి అవి తమ మహిమలని ప్రకటించుకుంటారో, ఎవరైతే దర్శనానికి కూడా రేట్లు నిర్ణయిస్తారో, ఎవరైతే వందల..వేల కోట్లలో ఆస్తులు సంపాదించి సన్యాస ధర్మాన్ని అతిక్రమిస్తారో, ఎవరైతే తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తాము చనిపోయే వరకు చెక్‌ పవర్‌ కూడా వదులుకోరో వారిని మోసగాళ్లగా ప్రజలు గుర్తించాలి.
మూఢత్వమే మార్కెట్‌!
ఆధునిక యుగంలో కూడా ఎందుకీ మూఢత్వం? చదువుకున్న వారు కూడా మోసకారి స్వాముల వెంట ఎందుకు పడుతున్నారు? వంటి ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి. విద్యలో విజ్ఞానాన్ని రంగరించే బదులు దేనికదిగా చెబుతూ మూఢత్వాన్ని ప్రోత్సహించే విధానాలు ఇందుకు ముఖ్య కారణం. అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ ప్రయోగించే ఉపగ్రహ నమూనాను దైవ దర్శనానికి తీసుకువెళ్లడం నిజానికి సైన్సుకే గాక రాజ్యాంగ లౌకిక స్వభావానికి కూడా విరుద్ధం. అయినా అవన్నీ షరా మామూలుగా జరిగిపోతున్నాయి. పాలకులకు ప్రజల మూఢత్వం కావాలి తప్ప చైతన్యం కాదు.దాన్ని పెంచేందుకే సహకరిస్తారు తప్ప తగ్గించేందుకు సిద్ధపడరు. ఇప్పుడు నడుస్తున్న ప్రపంచీకరణ వాస్తవంలో మార్కెట్‌తత్వంతో పాటు మత ఛాందసాన్ని కూడా ఎగదోస్తుంది. అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని గురించి తెలుసుకోకుండా స్థానికత పేరిట అంధ విశ్వాసాలలో జనం కూరుకుపోవడం వారికి చాలా అవసరం. అలాగే వారి మార్కెట్‌ సూత్రాలకు ఏదీ అతీతం కాదు గనక మూఢత్వాన్ని భక్తి విశ్వాసాలను కూడా మార్కెట్‌ సరుకుగా మార్చుకుని సొమ్ము చేసుకుంటారు. బాబాలు తమ ప్రచారం తామే చేసుకునే రోజుల నుంచి ఇప్పుడు మెగా ఈవెంట్స్‌గా జరిపే స్థితికి వచ్చారంటే అదే కారణం. ఒకప్పుడు హరేరామ హరే కృష్ణ ఉద్యమం మన దేశంలో గాక పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన సంగతి మర్చిపోరాదు. వినోదం పొందడానికి విలాసంగా గడపడానికి కూడా వారికి ఈ ఆశ్రమాలు ఉపయోగపడతాయి. విదేశీయులు వస్తే అది అదనపు ఆకర్షణగా భావించి మన దేశంలోని అమాయక ప్రజలు కూడా ఎగబడతారు.
చిన్న చిన్న స్వాముల నుంచి వేలకోట్ల రూపాయలార్జించిన బడాస్వాముల వరకూ, వీరికి భక్తులెందుకు ఏర్పడుతున్నారు? కొంత మందికి మానవాతీత శక్తులుంటాయనే కథలను పసితనం నుంచి అమ్మలు, బామ్మలు, పాఠ్యపుస్తకాలు నూరిపోయడమే స్వాములను మానవాతీత వ్యక్తులుగా నమ్మడానికి ప్రధాన కారణం. పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ అవగాహనను పెంచే అంశాలే వుండడం లేదు. పైగా ఉన్నత విద్యావ్యవస్థలో జ్యోతిషం, వాస్తు వంటి అశాస్త్రీయ అంశాలు కోర్సులుగా ప్రవేశ పెట్టబడ్డాయి. దానితో ప్రజలలో అశాస్త్రీయ ఆలోచనా విధానం బాగా ముదిరిపోయింది. ''ఈశాన్య మూలన బరువు వుంటే ధన నాశం'' అని ఒక వాస్తువాది అంటే నమ్మడమే గానీ ఈశాన్య మూలన వుండే కర్రకు, మన ఇంట్లో ధనాన్ని నాశనం చేసే శక్తి ఎలా వస్తుంది? అని హేతుబద్ధంగా ఆలోచించే శక్తి నశించింది. అందుకే నిన్నటి దాకా బిందెల చిల్లులకు మాట్లు వేసుకుని బతికిన వ్యక్తి నేడు నీళ్ల స్వామి అవతారమెత్తి, ప్రజల రోగాలు పోగొట్టే శక్తిగలవాడంటే నమ్మి విద్యాధికులతో సహా నీళ్ల చెంబులతో అతని ముందు క్యూ కట్టారు. నిన్న సినిమా హాళ్ల ముందు బ్లాకులో టికెట్లు అమ్మిన వ్యక్తి నేడు బాబా అవతారమెత్తి ఆశీర్వదిస్తున్నాడంటే శిరస్సు వంచారు. కాబట్టి ఈనాడు నలుగురైదుగురు బాబాలు, స్వాముల బండారం బయటపెడితే, వారి సొంత సామ్రాజ్యాల పెరుగుదల ఆగిపోతుంది. అంతే. రేపు మరో నలుగురైదుగురు స్వాములు 'అవతరిస్తారు'. ప్రజలు వారిని అనుసరిస్తారు. వీరి 'ప్రమాదం' నుంచి ప్రజలు బయటపడాలంటే విద్యార్థి దశ నుంచే పిల్లల మనస్సులలో శాస్త్రీయ అవగాహనా బీజాలు నాటాలి. ప్రకృతి సూత్రాలకతీతంగా ఎవ్వరూ ఏ పనీ చేయలేరని వివరించాలి. అశాస్త్రీయ అంశాల బోధనను నిలిపివేయాలి.
ఒక మోసకారి బాబాదో, కబ్జాస్వామిదో బండారాన్ని సైన్సు ఉద్యమకారులు బయటపెట్టినప్పుడు, ఆ ప్రయత్నం హిందూ మతం మీద దాడిగా భావించుకొని కొందరు ఆవేశపూరితులౌతున్నారు. సైన్సుఉద్యమకారులు హిందూ మతం మీదే దాడిచేస్తారనీ, ఇతర మతాలకు చెందిన మోసగాళ్ల జోలికి పోరనీ ఆరోపిస్తున్నారు. హైదరాబాదులో ఎంతోమంది ముస్లిం మతానికి చెందిన నకిలీ బాబాలు దొరికిపోయారు. సైన్సుఉద్యమకారులు బలంగా వున్న చోట ముస్లిం, క్రిస్టియన్‌ మతాలలోని మోసగాళ్ల బండారాలను కూడా బయటపెడుతున్నారు. కింది ఉదాహరణను పరిశీలించండి.
''అమెరికాలో దైవదూతగా ప్రచారం పొందిన మావియన్‌ సెలోలార్‌ బొంబాయి, మద్రాసులలో విజయవంతంగా పర్యటనలను ముగించుకొని కలకత్తాలో అడుగుపెట్టారు. ఆయన రాకకు పత్రికలలో కనీవినీ ఎరుగని ప్రచారం లభించింది. చెవుడు, మూగతనంతో బాధపడుతున్నవారిని తక్షణం నయం చేస్తాననే వాగ్దానంతో నగరంలోని పార్క్‌ సర్కస్‌ మైదానంలో ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆయన తన అసమాన వాక్చాతుర్యంతో వేలాదిమందిని ఆకట్టుకున్నారు. అయితే సైన్సుఉద్యమకారులు రంగప్రవేశం చేసి ఆయన బూటకాన్ని బట్టబయలుచేసే వరకే అదంతా సాగింది. సైన్సుఉద్యమకారులు అకస్మాత్తుగా వేదికపైకి ఎక్కి సెలోలార్‌ అప్పుడే నయం చేశానని చెబుతున్న ఒక వ్యక్తిని చుట్టుముట్టారు. తరచి తరచి ప్రశ్నించిన మీదట అతను అసలు చెవుడు లేదా మూగ కాదని తేలింది. దాంతో ఆగ్రహావేశులైన ప్రజలు సెలోలార్‌పై రాళ్లు రువ్వడంతో ఆయన వాటి నుంచి ఎలాగో తప్పించుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించి అక్కడి నుంచి పంపివేసింది.''

(లేఖా రతనాని, కవితా షెట్టి, టి.ఎన్‌.గోప కుమార్‌, సరితా రారులు ఇండియా టుడే లో వ్రాసిన వ్యాసం నుంచి)
ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, శివసేనలు బలంగా వున్న బొంబాయిలో సెలోలార్‌ బండారం బయటపడలేదు. అసలు అక్కడ ఆ ప్రయత్నమే జరగలేదు. సైన్సుఉద్యమకారులు బలంగా వున్న కలకత్తాలో అతని బండారం బయటపెట్టబడింది. మార్క్సిస్టు ప్రభుత్వం ఆ మోసగాడిని రాష్ట్రం నుంచి బయటకు పంపేసింది. ఇదీ అసలు విషయం.
భగవత్‌ స్వరూపులను విమర్శిస్తే వారి భక్తుల మనోభావాలు గాయపడతాయని ఇటీవల కొందరు అంటున్నారు. పురాణాల ప్రకారం చూసినా భగవంతుడికేే భక్తులుంటారు. భగవత్‌ స్వరూపులను అనుసరించేవారిలో చాలా మంది అమాయకంగా మోసగాళ్లను నమ్ముతున్నారు. కాబట్టి ఆ అమాయకులను ఆత్మహత్యా సదృశ్యమైన మార్గం నుంచి తప్పించి, మోసగాళ్ల బారి నుంచి బయట పడవేయడం ప్రతి ఒక్క పౌరుని కర్తవ్యం. కాబట్టి భగవత్‌ స్వరూపుల మోసాలను, కబ్జాలను బయట పెట్టడాన్ని, వారి భక్తుల మనోభావాలను గాయపరచడం కానే కాదు. రాజ్యాంగంలో 51ఎ (హెచ్‌) అధికరణం కూడా ఆ కర్తవ్యాన్ని నిర్దేశిస్తోంది. ఇన్ని భాగోతాలు బయటపడిన తర్వాతనైనా ఈ స్వాములు, బాబాలు, భగవత్‌ స్వరూపుల మాయా సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేయడం ప్రతి ఒక్క దేశ భక్తుడి బాధ్యత. అంతకు మించి ప్రభుత్వాల బాధ్యత.


***Article From Prajasakti Daily
Written By K.L.KanthaRao  http://www.prajasakti.com/




No comments:

Post a Comment