Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Friday, July 22, 2011

మర్డోక్‌ మీడియా - నేరస్త జర్నలిజం

మీడియా సామ్రాజ్యానికి రారాజు వంటి వాడు ఆస్ట్రేలియాకు చెందిన రూపర్ట్‌ మర్డోక్‌. న్యూస్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ ద్వారా అన్ని ఖండాలలో పత్రికలు, టీవీ ఛానల్స్‌తో తన ఆర్థిక ప్రాభవాన్ని పెంచుకొనేందుకు ఎంతకైనా తెగించే ఒక దుష్టశక్తిగా పేరు తెచ్చుకున్నాడు. దానిలో భాగంగానే పలు తరగతులవారి ఫోన్లను దొంగచాటుగా విని ఆ సమాచారంతో వార్తలు ప్రచురించటం, ఇతరత్రా వినియోగించుకొని సొమ్ముచేసుకున్న పెద్ద కుంభకోణంలో మర్డోక్‌ కుటుంబం ఇరుక్కుంది. ఇప్పటివరకు సూత్రధారులను వదలి పాత్రధారులుగా ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని నడిపించిన సంపాదకులు రెబెగా బ్రూక్స్‌, లెస్‌ హింటన్‌ తమ మర్డోక్‌ వ్యాపార సామ్రాజ్యంలో తమ బాధ్యతలకు రాజీనామా చేశారు. తొమ్మిది సంవత్సరాల క్రితం అపహరణ, హత్యకు గురైన 13 సంవత్సరాల బాలిక చివరిగా ఇచ్చిన సమాచారం, ఇతర అంశాలను ఆమె ఫోన్‌ బాక్సునుంచి తొలగించిన న్యూస్‌ ఆఫ్‌ దివరల్డ్‌ పత్రిక జర్నలిస్టులు అమె తప్పిపోయింది తప్ప మరణించలేదనే అభిప్రాయం కలిగించారు. వివిధ తరగతులనుంచి వస్తున్న వత్తిళ్లు, తన వ్యాపార సంస్థల వాటాల ధరలు స్టాక్‌మార్కెట్లో పడిపోతుండటంతో మర్డోక్‌ శుక్రవారం నాడు ఆ బాలిక ఇంటికి వెళ్లి తమ సిబ్బంది చేసిన తప్పిదానికి క్షమాపణలు కోరాడు. పత్రికల్లో విచారం వెలిబుచ్చుతూ పేజీలకు పేజీల ప్రకటనలు ఇచ్చాడు. లేబర్‌ పార్టీ మాజీ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ కూడా మర్డోక్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు బలయ్యాడు. తనను పదవి నుంచి తప్పించటానికి పేరు మోసిన క్రిమినల్స్‌ను వినియోగించి సండే టైమ్స్‌ పత్రిక తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించిందని స్వయంగా చెప్పాడు. తమకు అవసరమైన సమాచారం ఇవ్వని వారికి లంచం ఇవ్వటం,లొంగనివారిని బ్లాక్‌ మెయిల్‌, వేధించటం మర్డోక్‌ వ్యవహార శైలి.
బ్రిటన్‌కు చెందిన న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రిక మూసివేత. తన ఆధీనంలోని పత్రికలు అక్రమాలకు పాల్పడితే సహించను అవసరం అయితే శాశ్వతంగా మూసివేస్తా అని గొప్పలు చెప్పుకొనేందుకే. ప్రపంచంలో ఎంతటి పెద్ద పత్రిక,రేడియో స్టేషన్‌, టీవీ ఛానల్‌ అయినా కొనుగోలు చేయగలిగిన మర్డోక్‌ కుటుంబానికి ఒక పత్రికను మూత వేయటం పెద్ద లెక్కలోది కాదు. కానీ దీనివల్ల తప్పు చేయని జర్నలిస్టులు, సిబ్బంది కూడా వీధిలో పడ్డారు.
రాణీగారి ప్రతిపక్షం, అధికార పక్షం అనేది బ్రిటన్‌లో ఒక సామెత. అలాగే అధికార పక్షాన్ని వ్యతిరేకించటమే తన విధానం అని చెప్పుకొనే ఈ పెద్దమనిషి నిజానికి ఎక్కడ అధికారం ఉంటే దానితోనే ఉండి తన పబ్బం గడుపుకుంటాడు. అమెరికాలో టీవీ ఛానల్‌ను నడపాలంటే యజమాని అమెరికా పౌరుడై ఉండాలి. దాంతో అక్కడ పాగా వేసేందుకు 1985లో అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్నాడు. అమెరికాలో అతి పెద్ద ధనికుల్లో 38వ స్థానం(2010) ఆక్రమించాడు. మర్డోక్‌ మీడియా కుంభకోణంపై పార్లమెంటరీ కమిటీ విచారణకు హాజరు కావాలని బ్రిటన్‌ కోరింది. ప్రభుత్వం అన్నీ అవాస్తవాలు చెబుతోంది. విచారణకు రావాలో లేదో ఇంకా నిర్ణయించుకోలేదని పొగరుబోతుగా సమాధాన మిచ్చాడు.
నిజానికి ఈ కుంభకోణంలో మర్డోక్‌ను రక్షించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తన శక్తి కొలదీ ప్రయత్నిస్తోందంటే అతిశయోక్తి కాదు. దానిలో భాగమే పార్లమెంటరీ విచారణ తతంగం. ఆపేరుతో అక్రమాల వివరాలను ధ్వంసం చేసేందుకు వ్యవధి ఇవ్వటమే. బ్రిటన్‌లో మూతవేసిన న్యూస్‌ ఆఫ్‌ది వరల్డ్‌ పత్రిక ఫోన్ల ట్యాపింగ్‌లో పేరు మోసింది. గత తొమ్మిది సంవత్సరాలుగా దాని అనుచిత కార్యకలాపాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులు, పోలీసు అధికారులు, చివరకు ఇతర పత్రికల జర్నలిస్టుల ఫోన్‌ సంభాషణలను కూడా అక్రమంగా వింటూ మర్డోక్‌ సేవలో తరిస్తున్నది. అలాంటి దానిని ఇప్పుడు ఆకస్మికంగా మూసివేయటం వెనుక కూడా పెద్ద కుంభకోణమే ఉంది. రెండు సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వారికి 16 లక్షల పౌండ్ల నష్టపరిహారం చెల్లించి న్యూస్‌ ఆఫ్‌ది వరల్డ్‌ కేసుల నుంచి బయట పడింది. ఇప్పుడు దాని పాత కేసులన్నీ బయటకు వచ్చేట్లుగా ఉన్నాయి. అదే జరిగితే కేసులు కోర్టుల్లో పోరాడగలిగిన వివిధ రంగాల ప్రముఖులు కనీసం మూడువేల మంది ఉంటారని అంచనా. అదే జరిగితే వందల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని తప్పించుకొనేందుకే పత్రిక మూత. కుంభకోణం వివరాలు బయటకు వచ్చిన తరువాత ముందుగా ఎవరైనా ఆధారాలను ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకుంటారు. మర్డోక్‌ యంత్రాంగం ఫోన్‌ ట్యాపింగ్‌ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు గత కొద్ది రోజులుగా కంప్యూటర్లనుంచి సమాచారం మొత్తాన్ని తొలగిస్తున్నది.కొన్ని కోట్ల ఇమెయిల్స్‌, ఇతర సమాచారాన్ని ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు.
బ్రిటన్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికాలో కూడా అదే తరహా అక్రమాలకు పాల్పడినట్లు బయటపడింది. న్యూయార్క్‌ నగరంలోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాల ఫోన్‌ నంబర్లను సేకరించి వారి సంభాషణలను దొంగచాటుగా విన్నట్లు వచ్చిన ఫిర్యాదులపై అక్కడి ఎఫ్‌బిఐ విచారణకు ఆదేశించింది.
'మర్డోక్‌ ఎల్లపుడూ అధికార పక్షం వైపే ఉండాలని కోరుకుంటాడు. అతనెప్పుడూ ఓడిపోయిన వారితో ఉండాలని కోరుకోడు' అని అతని జీవిత చరిత్రను రాసిన విలియమ్‌ షాక్రాస్‌ పేర్కొన్నాడు. తనతో పాటు పత్రికలో రాతలు కూడా ఎటుతిరిగితే అటే తిరగాలని ఆదేశించటంతో 'ది ఆస్ట్రేలియన్‌' అనే పత్రిక జర్నలిస్టులు నిరసనగా సమ్మెకు దిగారు. సమ్మెకు దిగిన వారు ఎర్ర జెండాలు పట్టుకున్న కిరాయి వ్యక్తులని మర్డోక్‌ నిందించాడు. అమెరికాలో న్యూయార్క్‌ పోస్ట్‌ అనే పత్రికను కొనుగోలు చేసినపుడు కూడా ఇలాగే జరిగింది. లండన్‌లోని తన పత్రికల్లో సిబ్బంది తాను చెప్పినట్లు వినాలి తప్ప చట్టాలు గిట్టాలు అంటే కుదరవని ప్రకటించిన నిరంకుశుడు మర్డోక్‌. ముద్రణా విభాగ కార్మికులను దెబ్బతీసేందుకు రహస్యంగా ఒక ముద్రణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ యూనియన్‌లేకుండా చూశాడు. రెగ్యులర్‌ ప్రెస్‌ కార్మికులు సమ్మెకు పూనుకోవటంతో వాటిని మూసివేసి ఆరువేల మందిని ఇంటికి పంపి యూనియన్‌లేని ప్రెస్‌ ద్వారా పత్రికలను ముద్రించాడు.
మర్డోక్‌ మద్దతు కోసం పాకులాడటంలో లేబర్‌, టోరీ పార్టీలకు తేడాలేదు. అందుకే అధికారంలో ఉన్న టోరీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ కుంభకోణ తీవ్రతను తగ్గించేందుకు తన వంతు పాత్రను పోషిస్తున్నాడు.' నిజం ఏమిటంటే దీనిలో మనం అందరం ఉన్నాం, మీడియా, రాజకీయవేత్తలు, నాతో సహా అన్ని పార్టీల నాయకులు దీనికి బాధ్యులే'. అని వ్యాఖ్యానించాడు. ఇది నిజంగా హృదయంలోంచి వచ్చిందైతే వెంటనే పదవికి రాజీనామా చేసి ఉండేవాడు. పొదుపు చర్యల పేరుతో విశ్వవిద్యాలయాల ఫీజులను కామెరాన్‌ సర్కార్‌ విపరీతంగా పెంచింది. దాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు పెద్ద ఆందోళన చేశారు. వారిని పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టిన గూండాలుగా చిత్రించిన కామెరాన్‌ మర్డోక్‌ వంటి నేరగాళ్లను ప్రోత్సహించటంలో తాము కూడా ఉన్నామని చెప్పుకొనేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఇదే వర్గనీతి.

Note : article from prajasakti.daily

No comments:

Post a Comment