Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Tuesday, January 7, 2014

 అమెరికా - అణు ఒప్పందం - క్రయోజనిక్ ఇంజన్

మనకు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోవడం వెనుకా, అణు రియాక్టర్లు ఇవ్వడం వెనుకా కూడా అమెరికా ప్రయోజనాలు దాగున్నాయిగానీ, భారత్‌ ప్రయోజనాలు లేవు. ఇద్దరికీ పరస్పర ప్రయోజనాలు అనేవి రెండు దేశాల సంబంధాల్లో లేవు. భారత్‌కు క్రయోజనిక్‌ పరిజ్ఞానం అందిస్తే పదేళ్ల ముందే ఇస్రో ఉపగ్రహ వాణిజ్య రంగంలో అమెరికా కంపెనీలతో పోటీపడేది. అంతరిక్ష పరిశోధనలోనూ, రాకెట్‌ పరిజ్ఞానంలోనూ ఇతర అగ్రరాజ్యాలకు భారత్‌ సవాలుగా మారేది. దాన్ని అడ్డుకోవడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. అమెరికా సృష్టించిన అడ్డంకులను అధిగమించి ముందుకుపోయిన మన శాస్త్రవేత్తల కృషికి నేడు దేశమంతా జేజేలు పలుకుతోంది.




   ఆదివారం సాయంకాలం శ్రీహరికోట నుంచి జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ జిశాట్‌ ఉపగ్రహాన్ని మోసుకుంటూ అంతరిక్షంలోకి దూసు కుపోతుంటే చూసి ఆనందిరచని భారతీయుడు ఉండడు. మన శాస్త్రవేత్తలు 20 ఏళ్లు శ్రమించి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్‌ ఇంజన్‌ ఎట్టకేలకు జయప్రదం కావడం మన అంతరిక్ష కార్యక్రమానికి పెద్ద ఊపు తెస్తుంది. దీనివల్ల శాస్త్ర-సాంకేతిక, వాణిజ్య, సైనికపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మొదటిది, రానున్న కాలంలో మన కమ్యూనికేషన్స్‌ అవసరాలకు కావలసిన ట్రాన్స్‌పాండర్స్‌ కోసం విదేశాల మీద, ముఖ్యంగా ఇప్పటిలా ఐరోపా స్పేస్‌ ఏజెన్సీ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రెండోది, మన అంతరిక్ష కార్యక్రమం ఇప్పటికన్నా విస్తరించాలంటే, అంటే మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలూ, స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం వంటి కార్యకాలాపాలకు వెళ్లాలంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ శక్తి సరిపోదు. పిఎస్‌ఎల్‌వి ఘన, ద్రవ ఇంధన ఇంజన్లతో కూడిన రాకెట్‌. జిఎస్‌ఎల్‌వికి ఈ ఇంజన్లతోబాటు అదనంగా క్రయోజనిక్‌ ఇంజన్‌ తోడవుతుంది. క్రయెజనిక్‌ ఇంజన్‌ అత్యంత శీతల స్థితిలో ఉన్న ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ వాయువులను తగు మోతాదులో కలపడం ద్వారా అంతరిక్షంలో రాకెట్‌ను వేగంగా ముందుకు తీసుకుపోయే శక్తిని సమకూరుస్తారు. ఇది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.
   క్రయోజనిక్‌ రాకెట్‌ పరిజ్ఞానం మనకు రాకుండా అడ్డుకున్న అమెరికాకు మన శాస్త్రవేత్తలు చెంపదెబ్బ కొట్టి మరీ ఈ ఘనకార్యం సాధించారని దాదాపు మీడియా అంతా రిపోర్టు చేసింది. నిజమే మనకు అమెరికా లేక ఇతర పశ్చిమ దేశాలు సహకరించి ఉంటే పదిహేనేళ్ల క్రితమే మనం ఈ తరహా రాకెట్లు ఉపయోగించేవాళ్లం. కానీ అమెరికా మనకీ క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోగా మనకు రాకుండా అడ్డుకోడానికి అన్ని విధాలా ప్రయత్నించింది. ఏ దేశమూ మనకు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోతే 1991లో మన అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' రష్యాకు చెందిన గ్లావ్‌కాస్మోస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు క్రయోజనిక్‌ రాకెట్లను సాంకేతిక పరిజ్ఞానంతో సహా మనకు అందజేయాలన్నది ఈ ఒప్పందం సారం. కానీ 1993 జులైలో రష్యన్‌ కంపెనీ ఒప్పందం నుంచి వైదొలగింది. కారణం అమెరికా విధించిన ఆంక్షలు. మనకు గనుక రష్యా క్రయోజనిక్‌ పరిజ్ఞానాన్ని అందజేస్తే క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ ఒప్పందం (ఎంటిసిఆర్‌)ను ఉల్లంఘించినట్లవుతుందని అమెరికా గగ్గోలు పెట్టి ఆంక్షలకు దిగింది. దాంతో అప్పటికే బలహీనపడిన రష్యా భారత్‌తో ఒప్పందం నుంచి వెనక్కు తగ్గింది. దాంతో ఇస్రోకి మార్గాంతరం లేక స్వంతంగా ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవలసి వచ్చింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఇటీవల మనం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పం దంతో పోల్చి పరిశీ లించాలి. అంతరిక్ష పరిశోధ నలాగే అణు పరిశోధన విష యంలో కూడా అమెరికా మనపై ఆంక్షలు పెట్టింది. వివక్షతతో కూడిన అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై భారత్‌ సంతకం చేయలేదు కాబట్టి మనకు అణు ఇంధనం, సాంకేతిక పరిజ్ఞానం రాకుండా అడ్డుకుంది. అణు ఇంధన ఎగుమతి దేశాల కూటమి ఏకమై భారత్‌కు ఎటువంటి అణు సాంకేతిక పరిజ్ఞానం రాకుండా చేశాయి. దాంతో క్రయోజనిక్‌ పరిజ్ఞానం విషయంలో మాదిరిగానే అణు సాంకేతిక పరిజ్ఞానంలో కూడా భారత శాస్త్రవేత్తలు స్వయంగా ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో భారజల అణు రియాక్టర్లు రూపొందించారు. ఫాస్ట్‌ బ్రీడర్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ పరిజ్ఞానం ద్వారా అణు వ్యర్ధాలను తిరిగి ఇంధనంగా మార్చే సైకిల్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. కల్పక్కంలోని ఇందిరా గాంధీ అణు పరిశోధనా శాల దీనికి వేదిక.
   భారత దేశంలో యురేనియం నిల్వలు తక్కువ. థోరియం నుంచి అణు ఇంధనం తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకుంటే అణు ఇంధనంలో మనం అగ్రరాజ్యంగా మారతాం. దానిపై మన దేశంలోనూ, చైనాలోనూ విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. అమెరికా ఈ రంగంలో పరిశోధనలో బాగా వెనుకబడి ఉంది. కల్పక్కంలో థోరియంను అణు ఇంధనంగా ఉపయోగించేందుకు ఒక చిన్న ప్రోటోటైపు అణు రియాక్టరును కూడా నిర్మించారు. క్రయోజనిక్‌ ఇంజన్‌ మాదిరిగానే అణు ఇంధనం, అణు పరిజ్ఞానం విషయంలో కూడా భారత్‌ స్వయం సమృద్ధి సాధించగలదన్న నమ్మకం ఏర్పడింది.
   సరిగ్గా ఈ సమయంలో, అమెరికా-భారత్‌ అణు ఒప్పందం కుదిరింది. వామపక్షాలు అణు ఒప్పందానికి వ్యతిరేకంగా యుపిఎ-1 ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయి. మన్మోహన్‌ సింగ్‌గారు ప్రభుత్వం పడిపోయినా ఫరవాలేదు అణు ఒప్పందం కుదరాల్సిందే అన్నారు. మన యువరాజు రాహుల్‌ గాంధీ పార్లమెంటులో మొట్టమొదటిసారిగా నోరు తెరుస్తూ కళావతి కథ చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదరకపోతే ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న కళావతి ఇంట్లో కాంతులు ఎలా వస్తాయని ప్రశ్నించారు? మన అభివృద్ధికి అమెరికా అణు ఇంధనం, అణు రియాక్టర్లు అత్యవసరమని పాలక పక్షాలూ, కార్పొరేట్‌ మీడియా ఇల్లెక్కి ప్రచారం చేశాయి.
ఇక్కడ ఒక్క ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఇరవై ఏళ్లుగా భారత్‌కు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా అణు ఇంధనం, అణు రియాక్టర్లు ఇవ్వడానికి ఎందుకు ముందుకొచ్చింది. తిరగేసి చెప్పుకోవాలంటే అణు ఇంధన పరిజ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడ్డ అమెరికా క్రయోజనిక్‌ ఇంజన్‌ను ఎందుకు ఇవ్వలేదు. సరికదా ఇతరులు ఇస్తే కూడా ఎందుకు అడ్డుకున్నది? దీనికి సమాధానం చెప్పలేనంత అమాయకత్వంలో మన పాలకులు ఉన్నారా? గత ఇరవై సంవత్సరాలుగా భారత్‌-అమెరికా సంబంధాలు ఉరకలు పరుగులతో ముందుకు సాగుతుంటే, మనకు అమెరికా నుంచి అణు సరఫరాలు, సైనిక సరఫరాలు, పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా అందుతుంటే ఈ క్రయోజనిక్‌ పరిజ్ఞానం విషయంలో అమెరికా ఎందుకు ముందుకు రాలేకపోయింది?
   మనకు క్రయోజనిక్‌ పరిజ్ఞానం ఇవ్వకపోవడం వెనుకా, అణు రియాక్టర్లు ఇవ్వడం వెనుకా కూడా అమెరికా ప్రయోజనాలు దాగున్నాయిగానీ, భారత్‌ ప్రయోజనాలు లేవు. ఇద్దరికీ పరస్పర ప్రయోజనాలు అనేవి రెండు దేశాల సంబంధాల్లో లేవు. భారత్‌కు క్రయోజనిక్‌ పరిజ్ఞానం అందిస్తే పదేళ్ల ముందే ఇస్రో ఉపగ్రహ వాణిజ్య రంగంలో అమెరికా కంపెనీలతో పోటీపడేది. అంతరిక్ష పరిశోధనలోనూ, రాకెట్‌ పరిజ్ఞానంలోనూ ఇతర అగ్రరాజ్యాలకు భారత్‌ సవాలుగా మారేది. దాన్ని అడ్డుకోవడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. అమెరికా సృష్టించిన అడ్డంకులను అధిగమించి ముందుకుపోయిన మన శాస్త్రవేత్తల కృషికి నేడు దేశమంతా జేజేలు పలుకుతోంది.
కానీ అమెరికాతో అణు ఒప్పందం కుదిరిన తరువాత మన అణు పరిశోధన ఏమైంది? మన ఫాస్ట్‌బ్రీడర్‌ పరిశోధన గురించి గత ఎనిమిదేళ్లలో ఒక్క మాట కూడా పత్రికల్లో రావడం లేదెందుకు? మన పాలకులు దీని గురించి అస్సలు మాట్లాడ్డం లేదెందుకు? భారత్‌కు ఏడు లక్షల కోట్ల రూపాయల విలువైన అణు రియాక్టర్లు, ఇంధనం అమ్ముకుని లాభాలు దండుకుపోవడానికి పశ్చిమ దేశాలు ఒక దానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఒకవేళ అవి సరఫరా చేసే రియాక్టర్లలో ప్రమాదం జరిగితే దానికి తమది బాధ్యత కాదనీ, కష్టం నష్టం భారత దేశమే భరించాలనీ అవి మన చేతనే చట్టాలు చేయిస్తున్నాయి. వీటన్నిటి వెనుక అమెరికా ప్రయోజనాలున్నాయి. తన దగ్గర అణు ఇంధనం, పాతబడిన అణురియాక్టర్‌ పరిజ్ఞానం అమ్ముకోవడం అమెరికాకు అవసరం. అందుకే అది అణ్వస్త్ర నిరోధక ఒప్పందాన్ని బైపాస్‌ చేసి మనతో 123 ఒప్పందం కుదుర్చుకుంది. అనేక షరతులతో కూడిన ఒప్పందాన్ని మనపై రుద్దింది.
   అమెరికా తనకు ఏది ప్రయోజనమైతే అది చేసింది. చేస్తోంది. దానికి అమెరికా-భారత్‌ సత్సంబంధాలు అనే ముద్దుపేరు పెడుతోంది. దురదృష్టమేమంటే మన పాలకులే మనదేశానికీ, ప్రజలకూ ఏది ప్రయోజనమో అది చేయడం లేదు. విదేశీ బహుళజాతి సంస్థలు, వాటి మోచేతి నీళ్లుతాగే స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలను చూస్తోందేగానీ, మన దేశ విశాల ప్రయోజనాలను చూడ్డం లేదు. బహుళా అమెరికా వాణిజ్య ప్రయోజనాలు లేకపోయివుంటే మరికొన్నాళ్లు అణు ఆంక్షలు మనమీదుండేవి. అప్పుడు మన శాస్త్రవేత్తలు స్వంత సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసేవారు. మన్మోహన్‌ ప్రభుత్వ నిర్వాకం వల్ల మనకు నష్టదాయకమైన అణు ఒప్పందం వచ్చింది, ప్రయోజనకరమైన అణు పరిశోధనపై పాలకులు శీతకన్ను వేశారు.

Note : Article from  Prajasakti News paper 
 Wirtten By   ఎస్‌. వెంకట్రావు

No comments:

Post a Comment