Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Monday, April 4, 2011

భక్తి ఉద్యమం

ప్రపంచీకరణ యుగంలో ప్రజలలో భక్తి మరీ పెరిగిపోవడం భౌతిక వాదులకు ఆందోళన కలిగించే విషయం. అయితే ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలి. ప్రపంచీకరణ విధానాల వల్ల సంపద కేంద్రీకరణ జరుగుతోంది. ఇంకోవైపు పేదరికం పెరిగిపోతోంది. మధ్య తరగతిలో సైతం ఆదాయాలు పెరుగుతున్నట్టే కనపడినప్పటికీ, అభద్రతా భావం పెరుగుతోంది. కుటుంబ సంబంధాలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతున్నది.ఇటువంటి దశలో ప్రజలను కదిలించే బలమైన ఉద్యమాలు నిర్మింపబడితే, ప్రజలలో విశ్వాసం పాదుకొల్పగలిగితే ఫలితాలు వేరుగా ఉంటాయి. కాని ప్రగతి శీల, కమ్యూనిస్టు ఉద్యమాలకు చారిత్రకంగా ఏర్పడిన బలహీనతలు, పరిమితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తి భావాలు, మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయి.
కలవారినేగాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా
''నడిరేయి ఏజాములో'' అన్న పాట రంగుల రాట్నం సినిమాలోని తెలుగునాట అంద రికీ సుపరిచితమే. ఆ పాటలోని పై చరణంలో భావం చాలా లోతైనది. ప్రజలు ఎందువలన దేవుడివైపు చూస్తారు? ఎందుకు కొలుస్తారు? ఎందుకు నమ్ముతారు? అన్నది ముఖ్యమైన అంశం. ప్రజలకున్న విశ్వాసం సరైనదా, కాదా అన్న భాగాన్ని మాత్రమే మనం తర్కించుకుంటే సరిపోదు. అటువంటి తర్కం, చర్చ భావవా దానికి, భౌతిక వాదానికి మధ్యన దీర్ఘకాలంగా కొనసాగుతున్న తాత్విక యుద్ధంలోకి మనను లాగుతుంది. ఆటువంటి యుద్ధమూ అవసరమే. మార్క్సు, ఆ తర్వాత లెనిన్‌ ఆ యుద్ధాన్ని చాలా ఉన్నత స్థాయిలో నడిపారు. గతి తార్కిక భౌతికవాదం ఆధునిక సమాజపు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని స్వీకరించి భావవాదంపై విజయం సాధించింది.
అయినప్పటికీ ప్రజలలో భక్తి విశ్వాసాలు తరగడం లేదు. భౌతికవాద ప్రచారంతో ప్రజల తాత్విక విశ్వాసాలను మార్చడానికి ప్రగతి వాదులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ యుద్ధం కొనసాగవలసిందే. మరి మనం ఎప్పుడు భావవాదంపై స్పష్టంగా విజయం సాధించగలుగుతాం అన్నది ప్రశ్న. దీనికి మార్క్స్‌ స్పష్టంగా పరిష్కారం చూపాడు. ప్రజలు ఎందుకు దేవుడి వైపు చూస్తారు? అన్నది పరిశీలించాడు.
మనిషికి కష్టాలు ఎదురైనపుడు, అవస రాలు తీరనపుడు, కోరుకున్నది పొందలేనే మోనన్న బెంగ పెరిగినపుడు అతడిలోని నిస్సహా యత, బలహీనత, దౌర్బల్యం బైటపడతాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడి వైపు చూస్తాడు, ప్రార్థిస్తాడు, కొలుస్తాడు, మొక్కుతాడు. మనిషిని ఆ విధంగా దైవం వైపుకి నెట్టడంలో భౌతిక పరిస్థితిదే ప్రధానమైన పాత్ర. కాబట్టి ఆ పరిస్థితులను మార్చేందుకు మనం ప్రయత్నిం చాలి ఆన్నాడు మార్క్స్‌. అంటే ఏమిటి? ఆ మనిషి భౌతిక అవసరాలను తీర్చగలిగే ప్రయ త్నం చేయాలి. సమస్యల పరిష్కారానికి ప్రయ త్నించాలి. ఆ క్రమంలో అతడికి మన ఉద్యమంపైన విశ్వాసం కల్పించాలి. తన నిస్స హాయతా భావాన్ని క్రమంగా అతడు అధిగమిం చేలా చేయాలి.
ఇటువంటి కృషి లేకుండా కేవలం తాత్వి కంగా అతడి ఆలోచనను మార్చాలన్న దానికే పరిమితం అయితే మార్పురాదు.
ఇక్కడ మనం పరిశీలించాల్సిన అంశం మరొకటుంది. మనిషికి కష్టాలు, పేదరికం, దుర్భలత్వం, నిస్సహాయత -వీటన్నింటినీ కలిగిం చేది దోపిడీ వ్యవస్థే. అదే వ్యవస్థ అతడిని దైవం వైపు చూసి సాగిలపడి ప్రార్థించి వేడుకునేలా చేస్తుంది. అలా ప్రజలు సాగిలపడుతున్నంత కాలమూ ఈ దోపిడీ వ్యస్థకు మనుగడ ఉంటు ంది. అందుకే పాలకవర్గాలు తమకనుకూలమైన తాత్విక భావాల వ్యాప్తిని ఎప్పుడూ ప్రోత్స హిస్తాయి.
తన అద్వైత సిద్థాంతాన్ని పాలకవర్గ ప్రయోజనాలకు దన్నుగా నిలబెట్టాడు శంక రుడు.(ఈ విషయాన్ని గత రెండు వ్యాసాలలో వివరంగా ముచ్చటించుకున్నాం). ఐతే ఈ ప్రపంచం మిథ్య అన్న అతడి సిద్థాంతం కష్టాల్లో పీకలలోతు కూరుకు పోయిన సామాన్య ప్రజానీ కానికి ఏమాత్రమూ ఊరట కలిగించలేక పోయింది. ఆకలి, పేదరికం, ఆనారోగ్యం -వీటిలో బాధపడే వాడి దగ్గరకిపోయి ''ఒరే! ఆకలి, పేదరికం, అనారోగ్యం అంతా మిథ్య'' అంటే వాడికి ఊరట ఎలా కలుగుతుంది? దేశ మంతటా తిరిగి తన పాండిత్యంతో, వాదనాపటి మతో మేధావులనందరినీ శంకరుడు ఓడించగలి గాడు. కాని ''నాకు ఎవరు దిక్కు?'' అని ఎదురు చూసే పేదవాడికి అద్వైతం సరైన పరిష్కారం చూపలేకపోయింది.
''మనం వత్తిడిలో, బాధలలో ఉన్నపుడు మనకు ఊరట కలిగించలేని తత్వవేత్తల సిద్థాంతాలు కేవలం మేధోపరమైన పెడవాదనలే తప్ప పెద్దగా ప్రాధాన్యత నివ్వవలసిన ఆలో చనలు కావు'', ''కష్టాలలో మునిగి వుండే భక్తులు భగవంతుడి నిరంతర సాన్నిహిత్యాన్ని వాంఛి స్తారు. ఈ అంశానికి శంకరుని అద్వైతం ఏమాత్రమూ న్యాయం చేయలేకపోయింది.'' అన్నారు డా|| రాధాకృష్ణన్‌.
ఈ నేపథ్యంలో భక్తి ఉద్యమం బలంగా ముందుకు వచ్చింది. భక్తితో పూజిస్తే దేవుడు చేయూతనిచ్చి ఆదుకుంటాడని చెప్పింది. ఈ ప్రపంచమంతా మిథ్య అని చెప్పిన అద్వైతానికి భిన్నంగా ఈ ప్రపంచమంతా వాస్తవమేననీ, అది ఈశ్వరమయమనీ చెప్పింది. భూమిపై పాపం పెరిగిపోయినపుడు భగవంతుడే స్వయం గా ఏదోఒక అవతారంలో దిగి వచ్చి ప్రజలను ఆదుకుంటాడనీ, దుష్టుల్ని శిక్షిస్తాడనీ చెప్పింది. ప్రపంచాన్ని సృష్టించడమేగాక మనకి సన్నిహి తుడైన స్నేహితుడిగా మార్గదర్శిగా దేవుడు ఉంటాడని చెప్పింది.
భక్తి ఉద్యమంలో ముఖ్య పాత్ర విశిష్టాద్వైత సిద్థాంత కర్త రామానుజుడిది. ఆయన క్రీ.శ.1027లో శ్రీ పెరంబుదూర్‌(తమిళనాడు) లో జన్మించాడు. శ్రీరంగం కేంద్రంగా చేసుకుని తన కృషిని కొనసాగించాడు. బ్రహ్మసూత్రా లపైనా, భగవద్గీతపైనా భాష్యాలు రచించాడు. ఇవి ఆనాటి పండితుల ఆమోదాన్ని పొందాయి. రామానుజుడి గురించిన ఒక కథ బాగా ప్రచా రం పొందింది.
రామానుజుడు తన గురువు వద్ద మంత్రోపదేశం పొందాడు. గురువుగారు రామా నుజుడి చెవిలో ''ఓం నమో నారాయణాయ'' అన్న మంత్రం చెప్పి దానిని రోజూ జపించ మన్నాడు. అలా చేస్తే ఏమౌతుంది? అని రామానుజుడు అడిగాడు. మోక్షం లభిస్తుందని గురువు చెప్పాడు. అయితే ఈ మంత్రం ఇంకెవరికీ తన అనుమతి లేకుండా చెప్పవద్ద న్నాడు. అలా చేస్తే నరకానికి పోతావని బెదిరిం చాడు. రామానుజుడు తిన్నగా కోవెల గోపురం ఎక్కి బైటనున్న ప్రజలందరినీ దగ్గరకు రమ్మని వారందరిచేత నారాయణ మంత్రం చెప్పిం చాడు. గురువు ఎందుకిలా చేశావని కేకలేశాడు. అప్పుడు రామానుజుడు ''గురువు గారూ..! నారాయణ మంత్రం జపించడంవల్ల వారంతా మోక్షం పొందుతారు గదా, అందుకే అలా చెప్పేను అని సమాధానమిచ్చాడు. ''ఈ మంత్రాన్ని నా అనుమతి లేకుండా ఇంకెవ్వరికీ చెప్పవద్దని ఆదేశించాను గదా! చెప్తే నువ్వు నరకానికి పోతావని కూడా హెచ్చరించేను కదా'' అని అన్నాడు గురువు. ''నేనొక్కడినే నరకానికి పోతే నేం? ఇన్ని వందల, వేల మంది మోక్షం పొందుతారు గదా'' అని రామానుజుడు జవా బిచ్చాడు.
దేవుడిని కోవెలలో బంధించి ఆగ్రవర్ణాలకే దేవాలయ ప్రవేశాన్ని అనుమతించి శూద్రులనూ, నిమ్న కులాల వారినీ దేవాలయాలలోకి రానివ్వ కుండా చేసిన అగ్రవర్ణ పెత్తనం సాగుతున్న ఆ రోజుల్లో కుల వ్యవస్థ కట్టుబాట్లను ధిక్కరించి దేవుడిని సామాన్య ప్రజలకు చేరువగా చేయడానికి రామానుజుడు పూనుకున్నాడు.
భక్తి ఉద్యమంలో వైష్ణవ మతానిది ముఖ్యమైన పాత్ర. వేదాలలో 'భగ' అన్న దేవుడి ప్రస్తావన ఉంది. శుభం జరిగేలా ఆశీర్వదించే దేవుడు ఇతగాడు. మహాభారతంలో భాగవత మతం ప్రస్తావన ఉంది. ఈ మతమే వైదిక దేవతలలో ఒకడైన విష్ణువును ప్రధాన దేవతగా ముందుకు తెచ్చింది. విష్ణుపురాణం, హరివంశం విష్ణువు ప్రాధాన్యతను మరింత పెంచి వేశాయి. క్రీ.శ.900 నాటి భాగవత పురాణం కృష్ణుడిని విష్ణువు అవతారంగా చిత్రీకరించింది. కృష్ణు డికీ, గోపికలకూ ఉన్న సంబంధాన్ని ప్రేమోద్వేగ, భావావేశ రూపంలోని భక్తి భావంగా చూపింది. పురుషుడి స్థానంలో కృష్ణుడిని, అతడిని భక్తితో ప్రేమతో సేవించుకునే సేవిక స్థానంలో భక్తులనూ చూపింది.
ఇక్కడ భక్తి భావం యొక్క విశిష్టత మనకు ఎంత మాత్రమూ ముఖ్యమైనది కాదు. ఈ భక్తి ఉద్యమం పోషించిన సామాజిక పాత్ర ముఖ్యం. ఆనాటి వర్ణ వివక్ష పూరిత, పురుషాధిక్య సమాజంలో శూద్రులనూ, స్త్రీలనూ దేవుడికి దూరంగా ఉంచివేశారు. భక్తి ఉద్యమం ఈ వివక్షతనూ, అణచివేతనూ సవాలు చేసి, తిరుగుబాటు చేసింది. వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఆళ్వారులు పన్నెండు మందిలో ఒక మహిళ, పలువురు శూద్రులు, ఒక రాజ కుమా రుడు ఉన్నారు. వీరు కవితా రూపంలో మతాన్ని ప్రచారం చేశారు. వీరు రచించిన కవితల సంకలనాన్ని 'నాలాయిర ప్రబంధం' అంటారు. ప్రజలందరికీ అర్థమయేలా వీరు ఆ కవితలను తమిళ భాషలో రచించారు. ఎవరైనా సరే భగవంతుడిని ఆరాధించవచ్చు. మోక్షం పొంద వచ్చు. మోక్షం అగ్రవర్ణాలకు, అందునా పురుషు లకు మాత్రమే పరిమితం కాదు అని స్పష్టం చేసింది భక్తి ఉద్యమం. కష్టాలతో, అణచివేతలతో నలిగిపోతున్న పేదలకూ, శూద్రులకూ, మహిళ లకూ భక్తి ఉద్యమం బాసటగా నిలిచింది. కులభేదాలను ఖండించింది. అందరూ దేవుని ముందు సమానమే అని చాటింది.
రామానుజుని అనంతరం వైష్ణవ మతం వడగలై(ఉత్తరాది) తెంగలై(దక్షణాది) అనే రెండు శాఖలుగా చీలిపోయింది. వడగలై శాఖ సంస్కృతానికీ, తాత్విక చర్చలకూ ప్రాధాన్యతనిస్తే తెంగలై తమిళ భాషకు ప్రాధాన్యతనిచ్చింది. వడగలై కుల విభేదాలను సమర్ధించింది. తెంగలై కుల విభేదాలను వ్యతిరేకించింది. వడగలై తెగది మర్కట కిశోర న్యాయం. అంటే కోతిపిల్ల తల్లి కోతిని గట్టిగా వదలకుండా పట్టుకున్నట్టు భక్తుడు భగవంతుడిని వదలకుండా పట్టుకోవాలి. స్వయంకృషి ద్వారా, జ్ఞాన, భక్తి మార్గాల ద్వారా భగవంతుడిని చేరుకోవాలి.
తెంగలై తెగది మార్జాల కిశోరన్యాయం. పిల్లిపిల్ల యోగక్షేమాలన్నీ తల్లి పిల్లే చూసుకున్నట్టు భగవంతుడే భక్తుల బాగోగులు చూసుకుంటాడు. భక్తులు భగవంతుని దయకోసం ప్రార్థించాలి. ఆ దయ పొందితే మోక్షం సిద్ధిస్తుంది. దైవం మీద భారం వేసి అతడిని ప్రార్థించమంటుంది తెంగలై శాఖ.
భారతదేశం వ్యాప్తంగా భక్తి ఉద్యమం వివిధ రూపాలలో వ్యాపించింది. పీఠాధిపతుల నాయకత్వంలో సంఘటితంగా అగ్రవర్ణాల ఆధి పత్యంలో అద్వైతం వ్యవస్థీకరించబడింది. దానికి పూర్తి భిన్నంగా ఎక్కడికక్కడ స్థానిక సామాన్య ప్రజల చొరవతో భక్తి ఉద్యమం విస్తరించింది.
దక్షిణాదిన వైష్ణవ మతం విస్తరించినట్టే తూర్పున బెంగాల్‌ ప్రాంతంలో చైతన్యుడు క్రీ.శ.15వ శతాబ్ధంలో భక్తి ఉద్యమకారుడైనాడు. అన్ని కులాల నుండీ, అన్ని మతాల నుండీ శిష్యులను చేర్చుకున్నాడు. మొట్టమొదటగా ముస్లిం మతస్థుడిని శిష్యుడిగా స్వీకరించింది చైతన్యుడే. రాధాకృష్ణ పూజకు చైతన్యుడు ప్రాధాన్యతనిచ్చాడు. ఇతడి ప్రభావంతోటే జయదేవుడు(అష్టపదుల ఫేమ్‌) గీతగోవిందం కావ్యాన్ని రచించాడు. భక్తిని, శృంగార రూపంలో వ్యక్తపరచడం రాధాకృష్ణ పూజ లక్షణం. కాలక్రమంలో ఇది వెర్రి తలలు వేసింది. అయితే ఇటువంటి ధోరణుల కన్నా భక్తి ఉద్యమం నుండి బయలుదేరిన సంస్కరణ ధోరణులే ప్రధానం. 14వ శతాబ్ధానికి చెందిన రామానందుడు కన్యాకుబ్జంలో జీవించాడు. కుల భేదాలపై యుద్ధం ప్రకటించి సహపంక్తి భోజనాలను ప్రోత్సహించాడు. అన్ని కులాల నుండీ, మహమ్మదీయుల నుండీ శిష్యుల్ని చేర్చుకున్నాడు. కృష్ణుడి స్థానే రాముడిని దేముడిగా ముందుకు తెచ్చాడు. రామభక్తి నైతిక ప్రవర్తనతో కలగలిపి ప్రచారం చేశాడు. అప్పటకే దేశంలో ముస్లిం రాజుల పాలన స్థిరపడింది. హిందూ ముస్లింలు సహజీవనం చేయడం అనివార్యం అని, అదే సరైన మార్గమని రామానందుడు ప్రబోధించాడు. మతసహనం, అన్యమత గౌరవం అవసరమని చాటి చెప్పాడు. సంస్కృత భాషను వదిలి హిందీ భాషలో ప్రచారం చేశాడు. ఇతడి శిష్యులలో బ్రాహ్మణులతోబాటు మహమ్మదీయుడైన కబీరు, మంగలి వృత్తినాచరించే సేన, వ్యవసాయం చేసే ధన్నా, దళితుడైన రామదాసు, పద్మావతి అనే స్త్రీ ఉన్నారు. వీరంతా రామానందుని భావాలను విస్తృతంగా ప్రచారం చేశారు.
కబీరు క్రీ.శ.1398-1500 సం|| మధ్య జీవించాడు. రామ్‌-రహీమ్‌ ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ, ముస్లిం మత సామరస్యాన్ని ప్రబోధించాడు. ఓ బ్రాహ్మణుడా, వేరొక వ్యక్తి నిన్ను తాకినంత మాత్రానే మైలపడిపోయానని భావించి నువ్వు మళ్లీ స్నానం చేస్తున్నావే. ఎవరో నిన్ను తాకితేనే మైలపడ్డావంటే అతడికంటే నువ్వే బలహీనుడవై ఉన్నావని, తక్కువ స్థాయికి నిన్ను నువ్వు నెట్టుకుంటున్నావని నీకు అర్థం కాలేదా?'' అని ప్రశ్నించాడు కబీరు.
క్రీ.శ.1532లో జన్మించిన తులసీదాసు హిందీ భాషలో సామాన్య జనానికి అర్థం అయ్యే తేలిక పద్ధతిలో రామాయణాన్ని రామచరిత మానస్‌ పేరుతో రచించాడు. మత సామరస్యం, జీవకారుణ్యం, సాత్విక భక్తి వంటి భావాల వ్యాప్తికి తోడ్పడ్డాడు.
మరాఠా ప్రాంతంలో సైతం భక్తి ఉద్యమం విలసిల్లింది. క్రీ.శ.1370లో జన్మించిన నామదేవ్‌ సీతారాముల భక్తి ప్రచారం చేశాడు. విగ్రహారాధననూ, వ్రతాలనూ నిరసించి భూతదయ, సమదృష్టి నిజమైన భక్తి అలవర్చుకోమన్నాడు.
క్రీ.శ.1607లో శూద్ర కుటుంబంలో జన్మించిన తుకారాం భక్తి మార్గాన్ని విశేషంగా ప్రచారం చేశాడు. 'అభంగాలు' పేర మరాఠీ భాషలో భక్తి భావాలను ప్రచారం చేశాడు. ఆచారాలను కట్టుబాట్లను ఎదిరించాడు. మానవసేవే మాధవ సేవ అని ప్రచారం చేశాడు.
తెలుగు నాట భక్తి ఉద్యమం బలంగానే విలసిల్లింది. త్యాగయ్య, అన్నమయ్య తేట తెలుగులో చిరస్మరణీయమైన గేయాలతో అద్భుతమైన సంగీతంతో భక్తి భావాలను ప్రచారం చేశారు. భోగభాగ్యాలను, రాజుల ఆశ్రయాన్ని తిరస్కరించి ప్రజల మధ్య గడిపారు. ''మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే, ఛండాలుండేటి సరి భూమి యొకటే'' అన్న అన్నమయ్య కీర్తన లోక ప్రసిద్ధం. అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నాడు అతను. త్యాగయ్య రామ భక్తి గానం చేస్తే అన్నమయ్య వెంకటేశ్వర భక్తి ప్రచారం చేశాడు. క్షేత్రయ్య మువ్వగోపాల పదాలతో కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు.
తెలుగులో భాగవతం రచించిన బమ్మెర పోతన తన కవిత్వాన్ని రాజులకు అంకితమిచ్చేందుకు నిరాకరించాడు. తేలికపదాలతో పోతన రచించిన భాగవత పద్యాలు తెలుగునాట తెలుగు వారి నోళ్లల్లో చిరంజీవులుగా ఉన్నాయి.
బ్రహ్మనాయుడు పలనాడులో భక్తి ఉద్యమాన్ని వ్యాపింపజేయడానికి కృషి చేయడమే గాక, అన్ని కులాల వారిని ఒకే తీరున చూడాలని ప్రబోధించాడు. 17వ శతాబ్ధానికి చెందిన యోగి వేమన, కంచర్ల గోపన్న (భక్త రామదాసు) - భక్తి ఉద్యమాన్ని సాంఘిక సంస్కరణలను ప్రచారం చేశారు.
స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం అన్న పురుషాధిక్య ధోరణి మనువాదంలో బలంగా మనకు కనపడుతుంది. భక్తి ఉద్యమం దీనిని బలంగా సవాలు చేసింది. మీరాబాయి 'మొగుడే దేవుడు' అన్న మనువాదాన్ని తిరగ్గొట్టి ''దేవుడే నా మొగుడు'' అని ప్రకటించి కృష్ణుడినే భర్తగా స్వీకరించింది. అది ఆ రోజుల్లో ఒక గొప్ప, అసాధారణ తిరుగుబాటు. సక్కుబాయి ''భర్తే దేవుడి కన్నా మిన్న'' అనే పెత్తందారీ వత్తిడిని తిరస్కరించి ''నాకు దేవుడే భర్త కన్నా గొప్ప'' అని ఎదురుతిరిగింది. మన తెలుగునాట కుమ్మరి కులంలో పుట్టిన మొల్ల రామభక్తి ప్రధానంగా ''మొల్ల రాయాయణం'' రచించింది.
కుల వివక్షతపైన, పురుషాధిక్యతపైన, సాంఘిక దురాచారాలపైన తిరుగుబాటు చేయడం ఈనాటి ఆధునిక యుగంలో సైతం ఎంత కష్ట సాధ్యమో ఆయా ఉద్యమాలలో పాల్గొంటున్న వారందరికీ తెలుసు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ సోషలిస్టు సిద్థాంతం అండగా ఉన్నప్పటికీ ఇది ఆశించినంత వేగంగా, శక్తివంతంగా సాగడంలేదు. అటువంటి అండ ఏదీ లేని, సాధ్యం కాని మధ్యయుగాల కాలంలో భక్తి ఉద్యమం విస్తరించిన తీరు ఆ ఉద్యమంలోని అభ్యుదయ పార్శ్వానికి అద్దం పడుతుంది. భక్తి ఉద్యమమంతా భావవాదపు చెత్తగా పరిగణించి కొట్టి పారెయ్యడం సరైనది కాదు. అందులోని అభ్యుదయపు పార్శ్వాన్నీ, సంస్కరణ అంశాలనూ ప్రస్తుత కాలపు ప్రగతి వాదులంతా స్వీకరించి ఉద్యమ పురోగమనానికి వాడుకోవాలి.
ప్రపంచీకరణ యుగంలో ప్రజలలో భక్తి మరీ పెరిగిపోవడం భౌతిక వాదులకు ఆందోళన కలిగించే విషయం. అయితే ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలి. ప్రపంచీకరణ విధానాల వల్ల సంపద కేంద్రీకరణ జరుగు తోంది. ఇంకోవైపు పేదరికం పెరిగిపోతోంది. మధ్య తరగతిలో సైతం ఆదాయాలు పెరుగుతున్నట్టే కనపడినప్పటికీ, అభద్రతా భావం పెరుగుతోంది. ప్రైవేటు రంగం విస్తరించడం, ఉత్పత్తితో ముడిపడని, చంచలమైన ఫైనాన్సు పెట్టుబడి పాత్ర, స్పెక్యులేషన్‌ పెరిగిపోవడం మధ్యతరగతి అభద్రతకు కారణాలు. అభివృద్ధి ఏమేరకు జరిగినా అది కొన్ని సంపన్న దేశాలకూ, మన దేశంలో కొన్ని నగరాలకూ మాత్రమే పరిమితం అయిపోతోంది. వృద్ధాప్యంలో తోడుగా ఉండవలసిన సంతానం బతుకు తెరువుకోసం విదేశాలకో, దేశంలోని ప్రధాన నగరాలకో తరలిపోతున్నారు. కుటుంబ సంబంధాలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతున్నది. పేదల బతుకులెంత నికృష్టంగా తయారవుతున్నాయో అందరికీ తెలుసు. నైరాశ్యం పెరిగి లక్షలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి దశలో ప్రజలను కదిలించే బలమైన ఉద్యమాలు నిర్మింపబడితే, ప్రజలలో విశ్వాసం పాదుకొల్పగలిగితే ఫలితాలు వేరుగా ఉంటాయి. కాని ప్రగతి శీల, కమ్యూనిస్టు ఉద్యమాలకు చారిత్రకంగా ఏర్పడిన బలహీనతలు, పరిమితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తి భావాలు, మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయి.
ప్రపంచీకరణ విధానాలకు సైదోడుగా దేశంలో మత ఛాందసవాదం, మతోన్మాదం, కులతత్వం పెరిగిపోవడం మనకు కనపడుతోంది. బాబరిమసీదు వివాదం మొదలు నేటి వరకు ఎంతటి మారణ హౌమం జరిగిందో మన చూస్తున్నాం. దీనిని లౌకిక ప్రజాస్వామ్యవాదులంతా ఎదిరించి ఓడించాలి. అటువంటి కృషికి మన పూర్వకాలపు భక్తి ఉద్యమంలోని ప్రగతిశీల ధోరణులు ఎంతగానే తోడ్పడతాయి.


Note :Article form THE MARXIST PAPER  Markist Paper

by
M.V.S Sharma

No comments:

Post a Comment