Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Friday, October 8, 2010

1948 సెప్టెంబరు 17 కొన్ని వక్రీకరణలు

'నలుగురు గుడ్డివారు - ఏనుగు' కథలో ప్రతిగుడ్డివాడూ ఏనుగును తనకు అర్థమైనరీతిలో వర్ణించినట్లుగానే ఆనాడు తెలంగాణా గడ్డపై సాగిన ఆ మహాపోరాటాన్ని ఈనాటి రాజకీయపార్టీలు తలో విధంగా వ్యాఖ్యానించటం మనం చూస్తున్నాం. ఎవరు ఏవిధంగా వర్ణించినా, వారి, వారి గుడ్డితనం బయటపెట్టుకోవటం తప్ప ఏనుగు, ఏనుగుగానే ఉంటుంది. అలాగే ఎవరెన్ని విధాలుగా వక్రీకరించినా, వ్యాఖ్యానించినా భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మహత్తర ఘట్టమైన తెలంగాణా సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటాన్ని ఎవరైనా మసకబార్చటమో, మరుగుపర్చటమో అసాధ్యమూ, అసంభవం.


సెప్టెంబరు 17, హైద్రాబాద్‌ సంస్థానా ధిపతి 'నైజాం రాజు' భారతసైన్యాలకు లొంగి పోయిన రోజు. అప్పటివరకూ స్వతంత్ర సంస్థా నంగా ఉన్న ఈ ప్రాంతం ఇండియాలో కలిసిపో యిన రోజు. ఆరోజు తెలంగాణా విమోచన దినమా, విలీనదినమా, విద్రోహదినమా అనే వాద, వివాదాలతో వివిధ రాజకీయపార్టీల, వ్యక్తుల అభిప్రాయాలతో ఇటీవల మీడియా హౌరెత్తింది. ఆ దినాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు నిర్వహించారు. ప్రజాస్వామ్య రాజ్యంలో ఎవరి దినాలు వాళ్లు జరుపుకోవటానికీ, ప్రతి విషయంపైనా తమ అభిప్రాయాలు వెల్లడించ డానికీ ఎవరికైనా హక్కు ఉంటుంది. ఇందుకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండా ల్సిన అవసరం లేదు. అయితే తమ రాజకీయ అవసరాలకోసం, సంకుచిత ప్రయోజనాలకోసం చారిత్రక వాస్తవాలను వక్రీకరించబూనుకోవటం మాత్రం సమర్థనీయం కాదు. 'సాక్షి' ఇంకా కొన్ని పత్రికల్లో ఇటీవల ప్రచురితమైన, కొందరి వ్యాసాలలో ఇలాంటి వక్రీకరణలు, అసత్యవ్యక్తీ కరణలతో పాటు, ఆనాటి పోరాటానికి నాయ కత్వం వహించిన కమ్యూనిస్టులపై నిరా ధారమైన నిందారోపణలనేకం చేయబడ్డాయి.

1948 సెప్టెంబరులో జరిగిన ఘటనలను వివిధ పార్టీలు, వ్యక్తులు పలువిధాలుగా చిత్రించి, వ్యాఖ్యానించటంలోని మర్మమేమిటో ముందుగా పరిశీలించటం అవసరం. సెప్టెం బరు 17ను 'విమోచనదినం'గా భావించి ఉత్సవాలు జరపాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) పిలుపిచ్చింది. ఈపిలుపును బట్టి, మన దేశంలోని ఫ్యూడల్‌ సంస్థానాలు రద్దుకావాలనీ, ప్రజాస్వామ్య పాలనలోకి రావాలనీ అందువల్ల ఆ సంస్థానాలన్నీ ఇండియన్‌ యూనియన్‌లో విలీనంకావటం సరైందనే వైఖరిని ఆపార్టీ కలిగి ఉందని భావించవచ్చా? అలా భావించే అవ కాశం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే హైద్రా బాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం గావ టాన్ని మాత్రం 'విమోచన'గా చెబుతున్నా, మరో స్వతంత్రసంస్థానమైన జమ్మూ-కాశ్మీర్‌ ఇండియా లో చేరాలని ఈ 'కాషాయసైన్యం' ఆనాడు డిమాండ్‌ చేయలేదు. పైగా కాశ్మీర్‌ స్వతంత్ర రాజ్యంగానే ఉండాలని ఆనాటి బిజెపి అవతా రం 'రామరాజ్య పరిషత్‌' డిమాండ్‌ చేస్తూ వచ్చింది. వీరి ఈ విన్యాసాలకు మతరాజకీ యాలే కారణం. కాశ్మీర్‌లో ఉన్నది హిందూ రాజు గాబట్టి స్వతంత్రంగా ఉండాలి. ఇక్కడ హైద్రాబాద్‌లో ఉన్నది 'ముస్లిం' రాజు గాబట్టి అతని రాజ్యాన్ని ఇండియాలో కలిపేయాలనే ద్వంద్వవైఖరిని వీళ్లు చేబట్టారు. అందువల్ల బిజెపి శక్తులు ఆనాటినుండి కూడా మత ప్రాతిప దికపైన, ముస్లింవ్యతిరేక దృష్టితో మాత్రమే వ్యవహరిస్తున్నారనేది వాస్తవం. అలాగే ఈనాటి వారి 'విమోచన' పిలుపుల్లో కూడా అలాంటి ప్రయోజనాలే దాగి ఉన్నాయనేది గమనించటం అవసరం. మరోవైపు ప్రత్యేక తెలంగాణావాదులు ఈ సమస్యను తమకోణంలోంచి వక్రీకరించటానికి ప్రయత్నిస్తున్నారు. వారు విచిత్రంగా ఒకవైపు విమోచనదినం అంటూనే, మరోవైపు నైజాం నవాబును కీర్తిస్తున్నారు. ఇంకోవైపు కొందరు తెలంగాణావాదులు, నక్సలైట్లలో కొందరు ఈ రోజును 'విద్రోహ దినం' అంటున్నారు. టి.ఆర్‌. యస్‌ అధినేత చంద్రశేఖర్‌రావే స్వయం గా నైజాం నవాబు చాలా గొప్పపాలకుడనీ, అతని హయాంలో ఈ ప్రాంతం చాలా అభివృద్ది సాధించిందనీ ఆకాశానికెత్తి మరీ పొగిడాడు. ఆయన నైజాం పాలకుడ్ని ఈ విధంగా కీర్తించటంపట్ల అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆయన ఏ మాత్రం వెనక్కుతగ్గకుండా 'నైజాం నవాబు గొప్పపాలకుడని ఒక్కసారికాదు. వందసార్లు అంటాను' అని తన వైఖరిని బల్లగు ద్దిమరీ చెప్పాడు. మరి అంత గొప్పపాలకుడైన 'నిజాం' పాలన అంతం కావాలని టి.ఆర్‌.యస్‌ ఎలా కోరుతుంది? ఆ పాలన అంతమైన రోజును 'విమోచనదినం'గా ఎలా జరుపు తుంది? ఆ పార్టీకి ఇలాంటి తర్క,వితర్కాలు సుతరా మూ తలకెక్కవు. ముస్లింలలో సానుకూల వైఖరి సాదించవచ్చనే సంకుచితమైన అశతోనే ఈ విధంగా నైజాంనవాబుపైన వారు పొగడ్తలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రజలందరి ఆకాంక్ష లనూ, సెంటిమెంట్లనూ వాడుకోవటానికి 'విమోచన' పేరుతో ఉత్సవాలు జరుపుతున్నారు. తమ ఈ వంచనాశిల్పాన్ని ప్రజలు గ్రహించలేరనే వారి నమ్మకం.

ఇక 'సాక్షి' పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసం విషయానికివస్తే, ఆ వ్యాసకర్త కమ్యూ నిస్టులపైన అనేక ఆధారాలులేని అభాండాలు వేసారు. హైద్రాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉండాలనే వైఖరిని కమ్యూనిస్టులు తీసుకున్నా రనేది ఆయన ఒక ఆరోపణ. ఆనాడు హైద్రా బాద్‌సిటీకి సంబంధించిన ఒకరిద్దరు నాయకులు పార్టీ వైఖరికి విరుద్ధంగా ప్రకటనలు చేసారు. వాటిని పార్టీ వెంటనే ఖండించింది. పార్టీ ఖండించిన విషయాన్ని మరుగుపర్చి హైద్రాబాద్‌ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉండాలని కమ్యూని స్టులు ప్రకటించారని వక్రీకరించటం, విమర్శిం చటం ద్వారా ఆయన ఏమి సాధించదలిచారో తెలియదు. అలాగే కలకత్తా మహాసభలో అలాంటి తీర్మానమే చేసారని చెప్పటం, రజా కార్లతో కమ్యూనిస్టులు కుమ్మక్కయ్యారని అభూత కల్పనలు సృష్టించి చెప్పటం ఆయనకే చెల్లింది. ఇవన్నీ ఆయన పక్షపాత పరిశీలనకు, కమ్యూనిస్టు వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనాలు. భూమికోసం, భుక్తికోసం, వెట్టినుండి విముక్తికోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకోసం, నైజాంఫ్యూడల్‌ పాలనను తుదముట్టించేందుకు, సర్వంఒడ్డి పోరాడింది ఆనాటి కమ్యూనిస్టులనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అంతెందుకు, కమ్యూ నిస్టులను ఇన్ని శాపనార్థాలు పెట్టిన ఈ వ్యాసకర్తే తన వ్యాసంలోనే మరోచోట తెలంగాణా సాయుధపోరాటంద్వారా 10లక్షల ఎకరాల భూ స్వాముల భూమి పేదలకు పంచిపెట్టబడిందనీ, ఈ పోరాటంలో 4,000 మంది వీరులు చని పోయారనీ, నెహ్రూసైన్యాలు ప్రవేశించాక అప్పటివరకూ పట్టణాలు పట్టిన భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు తిరిగి గ్రామాలు చేరి పేదలకు పంచిన భూములు మళ్లీ స్వాధీనం చేసుకున్నారనీ చెప్పక తప్పలేదు. మరి ఆ సాయుధపోరాటం ఎవరి ఆధ్యర్యంలో జరిగింది? కమ్యూనిస్టుల నాయకత్వంలో కాదా? ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? నైజాంకూ, అతని రజాకార్‌ సైన్యానికీ వ్యతిరేకంగా కాదా? లక్షల ఎకరాల భూములు పంచి, పటేల్‌, పట్వారీ, భూస్వాములు, జాగీర్‌ దార్ల జాతినంతా పట్టణాలు పట్టించిన ఆ మహౌద్యమం, గ్రామ గ్రామానా సకల వర్గా లనూ, వర్ణాలనూ ఏకం చేసిన అతిగొప్ప ప్రజా ఉద్యమం కాదా?

కమ్యూనిస్టులను చంపటానికి, పేదల చేతి లోని లక్షలాది ఎకరాల భూమిని తిరిగి భూస్వా ములు స్వాధీనం చేసుకోవటానికి కారణమైన నెహ్రూసైన్యాలరాకను, తెలంగాణా విమోచనగా కమ్యూనిస్టులు ఎలా జరుపుతా రనేది ఆయన లేవనెత్తిన మరో సందేహం. నైజాం ప్రభుత్వ పతనం అంటే అది నెహ్రూ సైన్యాల గొప్పదనమే అనుకునే అపోహనుండే అలాంటి పొరపాటు సూత్రీకరణ ముందు కొస్తున్నది. నెహ్రూసైన్యాల రాకను బేషరతుగా, కమ్యూనిస్టులు ఏనాడూ స్వాగతించక పోవట మేగాక, ఆ సైన్యంరాక ప్రధాన ఉద్దేశం కమ్యూనిస్టుల సాయుధ పోరాటాన్ని అణచివేయ టమేననీ, నైజాంను లొంగదీయటంవారి రెండవ ప్రాధాన్యమేననీ మార్క్సిస్టులు ఎల్లపుడూ భావించారు. నైజాం లొంగిపోవటం 4రోజుల లోనే పూర్తికావటం, అయినా మరో 3 సంవత్స రాలపాటు ఆ సైన్యా లు ఇక్కడే తిష్టవేసి వేలాదిమంది కమ్యూనిస్టు పోరాటయోధులను కాల్చిచంపటం, ప్రజలపై ఎన్నో అకృత్యాలు, అఘాయిత్యాలు జరపడాన్ని బట్టే మార్క్సిస్టుల అంచనా ఎంత సరైనదో రుజువయింది. నైజాం లొంగిపోవటం నెహ్రూ సైన్యాల మూడురోజుల కృషిఫలితమనీ, హైద్రాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌ లో విలీనంగావటం వారి విజయం మాత్రమే ననీ అనుకుంటే అంతకంటే చారిత్రక వక్రీకరణ మరొకటి ఉండబోదు. సంస్థాన ప్రజల తీవ్రమైన ఆకాంక్ష, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన సాయుధపోరాటం సాధించిన విజయంగా దానిని అర్థంచేసు కోవాలి. ప్రజలం దరూ కోరుకున్నట్లుగానే హైద్రాబాద్‌ సంస్థానం ఆరోజు ఇండియన్‌ యూనియన్‌లో విలీన మైందిగాబట్టి దానిని 'విలీనదినం' అని చెప్పటంలోనూ, సుదీర్ఘ ఫ్యూడల్‌పాలన నుండి విముక్తి పొందిందిగాబట్టి ఆరోజును 'విమోచన దినం' అనటంలోనూ ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. అయితే ఆ విమోచనను 'వర్గవి మోచన'గా కమ్యూనిస్టులు ఎంతమాత్రం భావించరు. దాన్ని ఫ్యూడల్‌ పాలననుండి, నిరంకుశ రాచరికం నుండి మాత్రమే విమోచ నగా అర్థం చేసుకోవాలి.

నైజాంను లొంగదీయటమొక్కటే కాదు. ఇంకా అనేక విజయాలను తెలంగాణా సాయుధపోరాటం సాధించింది. ప్రధానంగా వరంగల్‌ (ఈనాటి ఖమ్మం కలిపి), నల్లగొండ జిల్లాల ప్రాంతంలో 16వేల చదరపుమైళ్ల విస్తీర్ణంలో విముక్తి ప్రాంతం ఏర్పడింది. సుమారు 3వేల గ్రామాలలో గ్రామప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భూస్వాముల మిగులు భూములు 10 లక్షల ఎకరాలు పేదలకు పంచబడింది. తాతల, తండ్రులనుండి వస్తున్న అక్రమబాకీలు, వడ్డీలు రద్దుచేయబడ్డాయి. అరణ్యప్రాంతం మొత్తం కోయ, లంబాడీ ప్రజలు ఫారెస్టు అధికారుల పీడననుండి రక్షించబడ్డారు. 13వేల మంది పేద యువకులు సాయుధసైన్యంలో స్వచ్చందంగా చేరారు. ఈ పోరాటం తెలుగు ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందంటే పోరాట విరమణ తర్వాత పార్టీపై జరిగిన అన్ని దుష్ప్రచారాలనూ, పార్టీలో అనైక్యతనూ ఎదుర్కొంటూనే 1952 సాధారణ ఎన్నికలలో ఈనాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో మొత్తం 85 మంది శాసనసభ్యులూ, 19 మంది పార్లమెంటు సభ్యులూ కమ్యూనిస్టుపార్టీ తరఫున ఎన్నిక య్యారు. పార్లమెంటులో కమ్యూనిస్టుపార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రభుత్వం అయిష్టంగానో, అరకొరగానో అయినా వివిధ వ్యవసాయ సంస్కరణలు తేవటానికీ, భూసమస్య ముఖ్యమైన ఎజండాగా దేశంలో రూపొంద టానికీ తెలంగాణా పోరాటమే మూలం. కేంద్రప్రభుత్వం వివిధ సంస్థానాధీశులతో లోపాయికారీ ఒప్పందాలకు రాకుండా ఈ పోరాటం నిలువరించింది. సంస్థానాలను ఇండియన్‌యూనియన్‌లో విలీనం చేయటాన్ని వేగిరపర్చింది. భాషా ప్రయుక్తరాష్ట్రాల ఏర్పాటులో ఈ పోరాటం ప్రముఖ పాత్ర నిర్వహించింది. ఈ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టులు ప్రాణాలు బలియిచ్చారు. 10వేలమందికి పైగా జైళ్ళపాలయ్యారు. కనీసం 50వేలమంది నిర్భంధాలకు, చిత్రహింసలకు గురయ్యారు. ప్రజలపై లాఠీచార్జీలు, దాడులేగాక కోట్లవిలువజేసే ఆస్తులు ధ్వంసం చేయబడ టమో, లూటీచేయబడటమో జరిగింది. దాదాపు 50వేల మంది సాయుధసైన్యాన్ని దించారు. 1947-48లో జరిగిన పాకిస్తాన్‌ వ్యతిరేక పోరాటంలో ఖర్చుపెట్టినదానికంటే ఎక్కువగా తెలంగాణాలో జరిగిన ఫ్యూడల్‌ వ్యతి రేక పోరాటాన్ని అణచటానికి కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఆ 'వీరతెలంగాణా' పోరాటాన్ని, నేటి 'వేరుతెలంగాణా' ప్రయోజనాలకోసం కించపర్చ టం విజ్ఞులు చేయదగిన పనికాదు.

కమ్యూనిస్టులు ఈ పోరాట వార్షికోత్స వాలు జరపటాన్ని విమర్శించేవారు ఒక విష యం ఆలోచించాలి. తెలంగాణా సాయుధ పోరాటం నాటికి, ఇంకాపుట్టని పార్టీలు, పుట్టినా పోరాటాన్ని పుట్టిముంచ ప్రయత్నించిన పార్టీలు కూడా ఆ పోరాటం పేరుతో, రకరకాల సందడి సృష్టిస్తున్న నేపథ్యంలో ఆనాటి ఆ మహా పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూ నిస్టులు నాటి పోరాట విజయాలను ప్రజలలో కీర్తించటానికి పూనుకుంటే, ఇంకా మిగిలిఉన్న పోరాట కర్తవ్యాలను సాధిస్తామని ప్రతిన బూనితే తప్పెలా అవుతుంది? నాటి పోరా టానికి గర్వకారణమైన వారసులుగా ప్రకటించు కోవటానికి కమ్యూనిస్టులకు తప్ప హక్కెవరి కుంటుంది?

నైజాం వ్యతిరేక పోరాటం నడిపిన, నాయ కత్వం వహించిన కమ్యూనిస్టులను నిందించ టంతో ఆగకుండా ఆ వ్యాసకర్త మరింత ముందుకెళ్లి నైజాంనే సమర్థించటానికి పూను కున్నాడు. ఆయన తన వ్యాసంలో ఒకచోట ఇలా అంటాడు ''సెప్టెంబరు 17 పరాయి పాలనకు పునాది. ఎందుకంటే అప్పటివరకూ హైద్రాబాద్‌ రాజ్యం (తెలంగాణాతో సహా) ఇక్కడపుట్టి, ఇక్కడి ప్రజలతో మమేకమైన వారిపాలనలో ఉండింది''. ఈ మాట ఆయన అసలు నైజాన్ని బయటపెడుతోంది. ఈ విధంగా నిజాంపాలనను ప్రజలతో మమేకమైన పాలనగా చెప్పటం అంటే ఈ వ్యాసకర్త తెలంగాణా ప్రజలను అతికిరాతకంగా దోపిడీ, పీడనలకు గురిచేసిన, నిరంకుశ 'నిజాం' నికృష్టపాలనను నిస్సిగ్గుగా బలపరచటం కాదా? ఇది తెలంగాణా ప్రజలను అవమానించటం కాదా? తెలంగాణా ప్రజలపట్ల ఇంత చులకన భావం ఉన్నవారు, ప్రత్యేకరాష్ట్రం సాధించి ఈ ప్రజలనేదో ఉద్ధరిస్తామని చెప్పబూనటం మోసపూరితం. ఒకవైపు నైజాంను కీర్తిస్తూ, మరోవైపు 'విమోచనదినం' అంటూ కార్యక్ర మాలకు పిలుపులిచ్చిన టి.ఆర్‌.యస్‌ నాయకుడు కె.సి.ఆర్‌ చివరికి ఈ గందరగోళంలో ఏం చేయాలో పాలుపోలేదేమో, సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణాభవన్‌లో జరిగిన విమోచన కార్యక్రమంలో ఆక్కడే ఉండికూడా పాల్గొనలేదు. బహుశా ఆవిధంగా 'నిజాం'పట్ల తన భక్తిని మరోసారి ప్రదర్శించి ఉంటారు.
ఇక సెప్టెంబరు 17ను 'విద్రోహదినం' గా కొందరు నక్సలైట్లు పిలుస్తున్నారు. ఆనాటి తెలంగాణా రైతాంగసాయుధ పోరాటాన్ని ఆపివేయకుండా, కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగించాల్సి ఉండాల్సిందనీ, కానీ పార్టీ నాయకత్వం పోరాటానికి ద్రోహం చేసిందనీ వారు విశ్లేషిస్తున్నారు. ఇది పూర్తిగా అతివాద దుస్సాహసిక దృక్పథం తప్పవేరుగాదు. ఇలా భావించేవారు వాస్తవ భౌతికపరిస్థితులను పరిగణనలోకి తీసుకోవటంలో విఫలమవు తున్నారు. సెప్టెంబరు 17న నైజాం లొంగి పోయేదాకా ఉన్నపరిస్థితికి, ఆతర్వాత మారిన వర్గ బలాబలాల పరిస్థితికి గుణాత్మకమైన తేడా ఉందనే సంగతి వీళ్లు గుర్తించటంలేదు.

తెలంగాణాలో నైజాం వ్యతిరేక పోరాటం అంత ఉధృతంగా సాయుధరూపం తీసుకోవ టానికి తోడ్పడిన అంశాలను మనం జాగ్రత్తగా గమనించటం అవసరం. నైజాం నవాబు నిరంకుశత్వంలో క్రూరంగా నలిగిపోయిన ప్రజలను ఆనాడు భూమి, భుక్తి, వెట్టినుండి విముక్తికి సాగిన ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటాలు ఒకవైపు పురిగొల్పితే, మరోవైపు అగ్నికి వాయువు తోడయినట్లు దేశవ్యాప్తంగా సాగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోద్య మం తోడైంది. అలాగే 1947 అగస్టు 15 తర్వాతకూడా ఇండియాలో విలీనానికి నైజాం వ్యతిరేకంగా ఉన్నాడు గాబట్టి, భారత పాలకవర్గాలకు నైజాంకు వైరుధ్యం ఏర్పడింది. ఈ అంశం పోరాటానికి బాగా తోడ్పడింది. కాంగ్రెస్‌ను అభిమానించే ప్రజానీకం కూడా పోరాటానికి సానుకూలంగా ఉండేదానికి ఉపయోగపడింది. అంతేగాక పాలకుడు మొగ లాయీ దురాక్రమణదారుల వారసుడు గావటం, ప్రజలు అత్యధికంగా హిందూ మత అనుయాయులు గావటం వల్ల కమ్యూనిస్టుపార్టీ అన్నా, పోరాటాలన్నా ఇష్టంలేనిశక్తులు, వ్యక్తులు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. లేదా తటస్థంగా ఉన్నారు. వీరోచిత తెలంగాణా సాయుధపోరాట మహాప్రవాహంలో ఇన్ని విధాలైన అంతర్‌ప్రవాహాలు ఇమిడి ఉన్నాయనేది మరువకూడదు.

సెప్టెంబరు 17 తర్వాత ఈ పరిస్థితంతా ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్‌ అధి కారంలోకి రావటంతోనే స్వాతంత్రోద్యమ భావజాలం వెనుకపట్టుబట్టింది. లొంగిపోయిన నైజాం నవాబు, అతనితో లాలూచీపడ్డ కాంగ్రెస్‌, భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలన్నీ కలిపి ఒక వైపూ, పోరాడుతున్న రైతాంగమూ కమ్యూ నిస్టుపార్టీ మరొక వైపుగా నూతన వర్గ విభజన జరిగింది. ఇందువల్ల బలాబలాల్లో గుణా త్మకమైన మార్పులు సంభవించాయి. ఈ కారణాల వల్ల ప్రారంభంలో ఎంతో విశాల ప్రాతిపదికపై ఏర్పడ్డ 'నిజాం వ్యతిరేక ఐక్యసంఘటన' విచ్ఛిన్నమయింది. 50 వేల భారత ప్రభుత్వ సైన్యాల తీవ్రనిర్భందం వల్ల , రైతాంగ గెరిల్లాల సంఖ్య 2 వేలకు పడిపో యింది. మిగిలిన దళాలుకూడా ప్రజలను వదిలి, రక్షణకోసం అడవుల్లోకి వెళ్లాల్సివచ్చింది. వీటన్నింటికీ మించి ఒక పరిమిత ప్రాంతంలో భూమిహక్కు, వెట్టిచాకిరీవిముక్తి, నైజాం రాజు ఫ్యూడల్‌పాలన అంతంకావాలనే కోర్కెలతో ప్రారంభమైన పోరాటం, ఆ నియంత దిగిపో యాక కూడా కొనసాగాలనటం, కొత్తగా ఏర్పడిన 'నెహ్రూ ప్రభుత్వ' వ్యతిరేక పోరాటంగా దానిని నిర్వహించాలని చెప్పటం ఏవిధంగానూ సమర్థనీయంకాదు. నెహ్రూ పాలన కూడా దోపిడీపాలనే గాబట్టి సాయుధపోరాటం కొనసాగించాలనే వాదన అర్థంలేనిది. అప్పటివరకూ ప్యూడల్‌ దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడ్డ ప్రజలు, ఆ ఫ్యూడల్‌వ్యతిరేక పోరా టంలో పాల్గొని కొత్తగా అధికారం చేబట్టిన పెట్టుబడిదారీవర్గాలను వెంటనే వ్యతిరేకిస్తారను కోవటం, అలా వ్యతిరేకించాలని ఆశించటం 'నేలవిడిచి సాము చేయటం' తప్ప మరోటిగాదు. కొత్త ప్రభుత్వం కూడా దోపిడీ దార్లదే గాబట్టి ప్రజలు పోరాటం కొనసాగించటానికి సంసిద్ధ మవుతారనే వాదన పిడివాదం తప్ప వాస్తవ పరిశీలన నుండి ఉద్భవించిందిగాదు. అలా గయితే సమాజ పరిణామం ఇంత సుదీర్ఘకాలం జరిగేదేకాదు. ఫ్యూడల్‌ దోపిడీ రూపం నుండి పెట్టుబడిదారీ దోపిడీ రూపంలోకి పాలన ప్రవేశించినపుడు తాముపోరాడిన దోపిడీ పోయినందుకు ప్రజలు పండగ చేసుకుంటారు తప్ప మళ్లీ దోపిడీయే ఉందిగదా అని 'వెంటనే' బాధపడి తిరగబడరు. ఆ కొత్తరూపం ప్రజలు భరించేదిగా ఉండటమేగాక, ఉత్పత్తి శక్తులు వేగంగా పెరిగే అవకాశంవల్ల ప్రజలకు కొంతకాలంపాటు అభివృద్ధికరంగా కూడా ఉంటుంది. ఈ అంశాన్ని అర్థంచేసుకోవటంలోని వైఫల్యమే తెలంగాణా పోరాట విరమణ విషయంలో నక్సలైట్లు తప్పుడుపాఠాలు తీయటానికి ప్రధానకారణం.

ఈ పొరపాటు అవగాహన ఈనాటి నక్సలైట్లనేగాకుండా ఆనాడు కొంతకాలం పాటు మొత్తంపార్టీనే ఆవహించింది. నెహ్రూప్రభుత్వ వ్యతిరేకపోరాటంగా అతివాద నినాదాలిచ్చి పార్టీ నష్టపోయింది. అనతికాలంలోనే ఆ తప్పు తెలుసుకుని, సాధించిన భూములు, హక్కులు నిలుపుకునేందుకు సరైన నినాదాలతో సాయుధ పోరాటాన్ని కొనసాగించటం జరిగింది. అయితే పార్టీలో ఏర్పడిన భేదాభిప్రాయాలు, అనైక్యత ఆ పోరాటానికి సరైన ముగింపునివ్వటంలో ఆటంకంగా మారటంవల్ల విజయాలను దృఢ పర్చుకోవటంలో కొన్ని వైఫల్యాలు సంభ వించాయి. ఏమైనా 'నలుగురు గుడ్డివారు - ఏనుగు' కథలో ప్రతిగుడ్డివాడూ ఏనుగును తనకు అర్థమైనరీతిలో వర్ణించినట్లుగానే ఆనాడు తెలంగాణా గడ్డపై సాగిన ఆ మహాపోరాటాన్ని ఈనాటి రాజకీయపార్టీలు తలో విధంగా వ్యాఖ్యానించటం మనం చూస్తున్నాం. ఎవరు ఏవిధంగా వర్ణించినా, వారి, వారి గుడ్డితనం బయటపెట్టుకోవటం తప్ప ఏనుగు, ఏనుగుగానే ఉంటుంది. అలాగే ఎవరెన్ని విధాలుగా వక్రీ కరించినా, వ్యాఖ్యానించినా భారతదేశ కమ్యూ నిస్టు ఉద్యమ చరిత్రలో మహత్తర ఘట్టమైన తెలంగాణా సాయుధ రైతాంగ గెరిల్లా పోరా టాన్ని ఎవరైనా మసకబార్చటమో, మరుగు పర్చటమో అసాధ్యమూ, అసంభవం. అయితే నేటికీ మిగిలిఉన్న కర్తవ్యాలతో ఆ పోరాట వారసులుగా మనం ప్రజలలో మరింత పట్టుదలగా మమేకం కావాలి. అన్ని వక్రీకర ణలకూ అదే సరైన సమాధానం అవుతుంది.

Article from Markist Monthy written by Thammenani Veerabadram

No comments:

Post a Comment