Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Sunday, February 5, 2012

ఇరాన్‌ పై కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

 
ఇరాన్‌ తన రివల్యూషనరీ గార్డ్స్‌ను సన్నద్ధంగా ఉంచింది. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. గత డిసెంబర్‌ నుండి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దాడి చేస్తే గట్టిగా బుధ్ధి చెబుతామని అమెరికా, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తగదని చైనా, రష్యా పేర్కొన్నాయి. ఇటువంటి చర్యలు ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలగజేస్తాయని అవి పేర్కొన్నాయి.
ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరు కుంటున్నాయి. యుద్ధం అనివార్యం అంటూ అమెరికా, దాని ప్రధాన మిత్రపక్షమైన ఇజ్రాయిల్‌ రోజూ ఇరాన్‌ను హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇరాన్‌పై మరింత కిరాతకమైన ఆంక్షలను విధించాలని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ఏకపక్షంగా నిర్ణ యించాయి. ఇరాన్‌ చమురు, గ్యాస్‌ ఎగుమతులను భారీగా దెబ్బతీసే విధంగా పాశ్చాత్య దేశాల కూటమి ఆంక్షలు విధించింది. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ చమురు, గ్యాస్‌ ఎగుమతుల పైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. ఐఎఇఎ తాజా నివేదిక విడుదలైన అనంతరం ఒబామా ప్రభుత్వం ఇరాన్‌పై మరింతగా ఒత్తిడి పెంచసాగింది. ఇరాన్‌ రహస్యంగా యురేనియాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని రహస్యంగా నిర్వహి స్తోందని ఎటువంటి సాక్ష్యాధారాలు సమర్పించ కుండానే ఐఎఇఎ తన నివేదికలో పేర్కొంది.. ఒక సంవత్సర కాలంలో ఇరాన్‌ చేతిలో అణ్వాయుధం ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి లియోన్‌ పనెట్టా డిసెంబర్‌ చివరి వారంలో పేర్కొన్నారు. ఇరాన్‌ ఈ రెడ్‌లైన్‌ను దాటడాన్ని ఎన్నడూ అనుమతించ బోమని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని పరిష్కరిం చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోగలమని పేర్కొన్నారు. తన అణు కార్యక్రమం శాంతియుత సైనికేతర ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించిందని ఇరాన్‌ స్పష్టంగా ప్రకటిస్తూనే ఉంది. అప్రకటిత అణ్వాయుధ దేశమైన ఇజ్రాయిల్‌ దాడి చేస్తామని ఇరాన్‌ను పదేపదే హెచ్చరిస్తోంది. అణ్వాయుధాలు గల అమెరికా నౌకలు, జలాంతర్గాములు పర్షియా గల్ఫ్‌లో సంచరిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలో కదన రంగంలో దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. పొరుగున ఉన్న బహ్రెయిన్‌, కతార్‌లలో అమెరికా పెద్ద ఎత్తున సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఏ సమయంలోనైనా అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్‌పై దాడి చేసి పాము తలను తొలగించాలని అయెరికాపై సౌదీ అరేబియా రాజు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వికిలీక్స్‌ వెల్లడించింది.
అసాధారణ స్థాయికి చేరుకున్న హిస్టీరియా
ఐఎఇఎ అందించినట్లుగా చెబుతున్న సాక్ష్యాధారాలను ఇరాన్‌ ఖండిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీల కుట్రగా అభివర్ణిం చింది. విదేశాంగ విధానంపై పత్రికలో ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇదే సమయమని మాథ్యూ కోన్రింగ్‌ పేర్కొన్నాడు. ఆ వ్యాస రచయిత అమెరికా రక్షణ మంత్రికి ఇటీవలి కాలం వరకు ప్రత్యేక సలహాదారునిగా ఉన్నాడు. అమెరికా పకడ్బందీగా దాడి చేస్తే ఇరాన్‌ అణు స్థావరాలను ధ్వంసం చేయవచ్చునని ఆయన సలహా ఇచ్చాడు. గల్ఫ్‌ ప్రాంతం మొత్తానికి ఇబ్బంది కలిగించకుండా దాడి చేయవచ్చునని సూచించాడు. ఇరాన్‌ వ్యతిరేక హిస్టీరియా ఇటీవలి మాసాల్లో అమెరికాలో అసాధారణ స్థాయికి చేరుకుంది. అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిని హత్య చేసేందుకు కాంట్రాక్టును మెక్సికోకు చెందిన ఒక డ్రగ్‌ కార్టెల్‌కు ఇరాన్‌ అధికారులు ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లో జరిగిన 9/11 దాడుల వెనక ఇరాన్‌ ఉందని ఫెడరల్‌ జడ్జ్‌ రూలింగ్‌ ఇచ్చారు. ఇరాన్‌ అల్‌ ఖైదాకు ఈ డాడులను నిర్వహించేందుకు ప్రత్యక్షంగా సహాయ మందించిందని ఆయన పేర్కొన్నారు.
చమురు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటైన ఇరాన్‌ తాజా పరిణామాల నేపథ్యంలో తన ఉనికికి ముప్పు రానున్నదని ఆందోళన చెందడం సహజం. కొత్త ఆంక్షలను అమలు చేస్తే హార్మజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ మిలిటరీ ఉన్నత శ్రేణి నాయకులు హెచ్చరించారు. పర్షియా గల్ఫ్‌ ప్రాంతంలో ఉన్న ఈ జలసంధి ద్వారా చమురు అంతర్జాతీయంగా రవాణా అవుతుంది. హార్మజ్‌ జలసంధి పొడవు 6.4 కిలోమీటర్లు. ఇరాన్‌, ఒమన్‌ మధ్య గల్ఫ్‌ ముఖ ద్వారంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే ముడి చమురులో మూడవ వంతు ఇరుకుగా ఉండే ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. కతార్‌ నుండి లిక్విఫైడ్‌ గ్యాస్‌ సరఫరా హార్మజ్‌ జలసంధి ద్వారానే జరుగుతుంది.
పశ్చిమ దేశాలు క్రమంగా విస్తరించుకుంటూపోతున్న ఆంక్షల కారణంగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బాగా దెబ్బతింది. డిసెంబర్‌ 31న ఒబామా కొత్తగా ఆంక్షలు విధించారు. ఇరాన్‌ కేంద్ర బ్యాంక్‌తో లావాదేవీలు జరిపే కంపెనీలపై చర్య తీసుకుంటామని ఈ కొత్త శాసనం నిర్దేశించింది. భారత్‌ వంటి దేశాలు ఇరాన్‌ నుండి చమురు దిగుమతి చేసుకోకుండా చూడటం ఈ చట్టం ఉద్దేశంగా ఉంది. ఇరాన్‌ చమురులో ఎక్కువ భాగం చైనా, భారత్‌కు రవాణా అవుతుంది. ఇయు 18 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్‌ చమురు రంగంపై ఆంక్షలు విధిస్తే ఒక్క బొట్టు చమురు కూడా హార్మజ్‌ జలసంధి నుండి రవాణా కాదని ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ రేజా రహిమి హెచ్చరించారు. డిసెంబర్‌ నెల చివర్లో ఇరాన్‌ సైన్యం హార్మజ్‌ జలసంధి సమీపంలో పది రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల్లో భాగంగా వైమానిక దళం జలాంతర్గాములను సముద్రంలో ముంచేసింది. నౌకలు రాకుండా ఈ జలసంధిని మూసివేయడం చాలా తేలికైన విషయమని ఇరాన్‌ నౌకాదళాల అధిపతి అడ్మిరల్‌ హబీబుల్లా సయ్యారి మీడియాకు చెప్పారు. జలమార్గాలపై ఇరాన్‌కు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించడానికే కృతనిశ్చయంతో ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ విషయంలో అవి వెనకడుగు వేసేందుకు సుముఖత చూపడం లేదన్నారు. తన కీలక ప్రయోజనాలు పరిరక్షించుకునేందుకు రక్షాత్మక వ్యూహాలను అనుసరించ గలదని రివల్యూషనరీ గార్డ్స్‌ డిప్యూటీ కమాండర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ హుస్సేన్‌ సలామీ చెప్పారు. తమపై దాడి చేస్తే అమెరికాకు చెందిన 32 స్థావరాలను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ ఇంతకు ముందు హెచ్చరించింది. ఇరాన్‌తో యుద్ధం వస్తే చమురు ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చ రించారు. తన అణు కార్యక్రమంపై తిరిగి చర్చలు జరిపేందుకు ఇరాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు కొత్తగా ఆంక్షలు విధించిన తరువాత ఇరాన్‌ సైన్యం ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణిని పరీక్షించింది. రాడార్లకు ఇది చిక్కదు. మొట్టమొదటి అణు ఇంధన రాడ్‌ను తమ శాస్త్రవేత్తలు నిర్మించినట్లు ఇరాన్‌ జనవరి 1న ప్రకటించింది. సహజసిద్ధమైన యురేనియం గల రాడ్స్‌ను ఇరాన్‌ కీలకమైన అణు రియాక్టర్‌లో అమర్చారు.
సైన్యం నుండి ముప్పు
హార్మజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ చేసిన హెచ్చరికపై అమెరికా తీవ్రంగా ప్రతిస్పందించింది. రెండు యుద్ధనౌకలను జలసంధి వైపు పంపించింది. ఈ జలసంధిలో నౌకాయానం జరిపేందుకు గల హక్కును హరించే ఎటువంటి చర్యను క్షమించబోమని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. సైనిక దళాన్ని వినియోగించే ప్రమాదంతోపాటు అమెరికా, ఇజ్రాయిల్‌ గత రెండు సంవత్సరాలుగా ఇరాన్‌ సైంటిఫిక్‌ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులపై దృష్టి సారించాయి. వారిని కిడ్నాప్‌ చేసేదుకు, హతమార్చేందుకు, ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్‌ మిలిటరీ, పౌర స్థావరాలపై ఉగ్రవాద దాడులు జరిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో ఇద్దరు అణు శాస్త్రవేత్తలను హతమార్చారు. వారు కారులో ప్రయాణిస్తుండగా వారి కారును పేల్చివేశారు. ఇరాన్‌ అణు ఇంధన సంస్థ ఛైర్మన్‌ ఫెరేదౌన్‌ అబ్బాసీ దావానీ కారుపై కూడా ఇదే విధంగా బాంబు దాడి జరిగింది. రివొల్యూషనరీ గార్డ్‌ స్థావరంలో నవంబర్‌ 12న జరిగిన పేలుడులో 17 మంది మృతి చెందారు. అందులో ఇరాన్‌ క్షిపణి కార్యక్రమ రూపకర్త జనరల్‌ హసన్‌ తెహెరాని మొఘద్దమ్‌ కూడా ఉన్నారు. ద్రోణ్‌ నుండి క్షిపణిని ప్రయోగించి ఉండవచ్చునని నిపుణులు పేర్కొన్నట్లుగా న్యూయార్క్‌టైమ్స్‌ వెల్లడించింది. గత నవంబర్‌లో సంభవించిన మరో పేలుడు కారణంగా ఇస్ఫహాన్‌ నగరానికి సమీపంలోని యురేనియం శుద్ధి చేసే కర్మాగారం దెబ్బతిందని పశ్చిమ దేశాల మీడియా వెల్లడించింది. ఇరాన్‌ మీడియాలో మాత్రం ఈ పేలుడు గురించిన సమాచారం లేదు. ఈ విధ్వంస చర్య తమ ఘనతేనని ఇజ్రాయిల్‌, అమెరికా అధికారులు పేర్కొన్నారు.యువ అణు శాస్త్రవేత్త, నటాంజ్‌ యురేనియం కేంద్రంలో ఉప అధిపతి ముస్తాఫా అహ్మది రోషన్‌ హత్య వెనుక సిఐఎ హస్తం ఉందని ఇరాన్‌ అధికారులు ఆరోపించారు. ఆయన కారు తలుపుకు అయస్కాంత బాంబును అమర్చడం ద్వారా పేల్చివేశారని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద చర్య వెనుక సిఐఎ హస్తం ఉందని నిరూపించేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఇరాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ హత్యను ఖండించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి, భద్రతా మండలికి ఇరాన్‌ విజ్ఞప్తి చేసింది. 2010లో ఇరాన్‌ అణు స్థావరాలకు స్టక్‌నెట్‌ కంప్యూటర్‌ వైరస్‌ను అమెరికా, ఇజ్రాయిల్‌ ప్రయోగించాయి. పరిశ్రమల్లో ఉపయోగించే కంప్యూటర్లను కూడా ఈ వైరస్‌ దెబ్బతీసింది. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వైరస్‌ను అవి ప్రయోగించాయి. ఇరాన్‌ గగనతలంలో సాయుధ ద్రోణ్‌ విమానాల విహారానికి ఒబామా ప్రభుత్వం అనుమతించింది. అమెరికాకు చెందిన ఆర్‌కు 170 సెంటినెల్‌ స్టీల్త్‌ ద్రోణ్‌ను గత డిసెంబర్‌లో ఇరాన్‌ దింపేసిన తరువాత అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 50 వేల అడుగుల ఎత్తున ప్రయాణించగల ద్రోణ్‌ అమెరికా విమానాల్లో అత్యంత ఆధునికమైంది. ఈ విమానాన్ని ఇరాన్‌ ప్రదర్శనలో పెట్టింది. దీనిని వెనక్కు పంపాలని అమెరికా చేసిన డిమాండ్‌ను ఇరాన్‌ తోసిపుచ్చింది. ద్రోణ్‌ ఇరాన్‌ గగనతలంలో నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాదులపై ప్రయోగించడానికి ఉద్దేశించినవి కావు. యుద్ధం ముప్పును ఇరాన్‌ కూడా తేలికగా తీసుకోవడం లేదు. తన రివల్యూషనరీ గార్డ్స్‌ను సన్నద్ధంగా ఉంచింది. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. గత డిసెంబర్‌ నుండి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దాడి చేస్తే గట్టిగా బుధ్ధి చెబుతామని అది అమెరికా, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తగదని చైనా, రష్యా పేర్కొన్నాయి. ఇటువంటి చర్యలు ఇరాన్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలగజేస్తాయని అవి పేర్కొన్నాయి.

***** Article From  PRAJASAKTI  NEWS Paper Link www.prajasakti.com written by యొహానన్‌ చామరపల్లి

Sunday, November 6, 2011

మరో గ్లో'బలి'

మొన్న ఇరాక్‌... నిన్న ఆఫ్ఘనిస్తాన్‌... నేడు లిబియా... ప్రపంచ రక్షకుడిగా చెప్పుకుంటున్న అమెరికా తాజాగా లిబియాను భక్షించింది. ప్రపంచ పోలీసు అవతారమెత్తి తనకు ఎదురు తిరిగే దేశం పాలిట విలన్‌గా మారడం అమెరికా ఆనవాయితీ. ఆ ఆనవాయితీని నిజం చేస్తూ 42 ఏళ్లుగా తన కంట్లో నలుసుగా ఉన్న లిబియా అధినేత కల్నల్‌ గడాఫీని పాశవికంగా వెంటాడి, వేటాడి హత్య చేసింది. గ్లోబలీకరణ... ప్రపంచీకరణ పేరుతో మరో గ్లో'బలి'కి పాల్పడింది. లిబియాలో ఉన్న అపార చమురు సంపదపై కన్నేసిన అమెరికా దాని మిత్ర పక్షాలు ఆ దేశాన్ని కబళించాయి. అంతటితో ఊరుకోకుండా ఆ దేశాన్ని ఎప్పటికీ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు అధ్యక్షుడు గడాఫీని బలి తీసుకుంది.
తమ దేశంలోని ఆర్థిక మాంద్యం, నిరుద్యోగాన్ని పరిష్కరించలేని అమెరికా ప్రపంచంలోని ఇతర దేశాల సమస్యలను పరిష్కరిస్తానని బయలుదేరింది. మానవ హక్కులను కాపాడతాననే నెపంతో తనకు కంటగింపుగా ఉన్న దేశాలపైకి బాంబుల వర్షం కురిపిస్తూ లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించిన లిబియా అధ్యక్షుడిగా గడాఫీని నాటో దళాల ముసుగులో అదును చూసి చంపేసింది. అంతటితో ఊరుకోకుండా ప్రపంచంలోనే అతి నాణ్యమైన చమురు సంపదను కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసింది. 42 ఏళ్లుగా చెప్పుకోదగ్గ జీవన ప్రమాణాలతో విలసిల్లుతున్న లిబియన్లను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రణాళిక రచించింది. 27 ఏళ్లకే అధికారం చేపట్టి 42 ఏళ్లు అప్రతిహతంగా పరిపాలించిన గడాఫీ లిబియాను ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా నిలిపాడు. 1969లో రక్తపాత రహిత తిరుగుబాటుతో ఈ పోలీసు అధికారి లిబియా గద్దెనెక్కాడు. యునెస్కో లెక్కల ప్రకారమే లిబియాలో అక్షరాస్యత శాతం 83. యువకుల్లో 99.9 శాతం మంది అక్షరాస్యులు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుహెచ్‌ఓ) లెక్కల ప్రకారం వైద్య సేవలందించడంలో ఆఫ్రికాలోనే లిబియా అగ్రస్థానంలో ఉంది.
ఇటలీ వలస రాజ్యంగా...
వేలాది సంవత్సరాల క్రితం లిబియాలోని 90 శాతం భూమి సహారా ఎడారితోనే నిండి ఉంది. భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 8000 బిసి నుండే ఇక్కడ జనజీవనం కొనసాగింది. ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఎడారిలో అక్కడక్కడ పారే చిన్న వాగులు, కాలువలను ఆధారం చేసుకొని లిబియన్లు వ్యవసాయం కొనసాగించేవారు. రాళ్లపై పెయింటింగ్‌కు అక్కడి పర్వతాలు చారిత్రక నిదర్శనంగా నిలిచాయి. 1000 బిసిలో ఫెజాన్‌ ప్రజలను గిరిజనులుగా పరిగణించేవారు. 500 బిసి నుండి 500 ఎడి మధ్య కాలంలో స్థానిక పాలనలో ఉంది. తూర్పు ప్రాంత ప్రజలు, సహారా ప్రాంతంలో స్థిరపడిన ప్రజలు రావడంతో లిబియా నాగరికతను సంతరించుకుంది. ఫియోనిసియన్లు లిబియన్లతో తొలుత వ్యాపార లావాదేవీలు నిర్వహించారు.
లిబియా తీర ప్రాంతమైన ఓయె, లిబ్‌దాV్‌ా, సబ్రతా నగరాలు కలిసి ప్రస్తుత ట్రిపోలీ (మూడు నగరాలు)గా రూపాంతరం చెందింది. ఇటలీ ఆక్రమించుకున్న తర్వాత 1912 - 27 మధ్యకాలంలో లిబియాను ఇటాలియన్‌ ఉత్తర ఆఫ్రికాగా పిలిచారు. 1927-34 మధ్యకాలంలో ఇటాలియన్‌ సైరేనైకా, ఇటాలియన్‌ ట్రిపోలిటానియా అనే రెండు ప్రాంతాలుగా విభజించబడింది. ఈ రెండు ప్రాంతాలు ఇటలీ ప్రభుత్వ పాలనలో ఉండేవి. ఆ కాలంలో లక్షా 50 వేల మంది ఇటాలియన్లు (లిబియా జనాభాలో 20 శాతం) ఇక్కడ స్థిరపడ్డారు. సైరేనైకా, ట్రిపోలిటానియా, ఫెజాన్‌ అనే మూడు ప్రాంతాలను కలిపి లిబియాగా 1934లో ఇటలీ స్థిరీకరించింది. లిబియా రెండు ప్రపంచ యుద్ధాల సమయాల్లోనూ ఇటలీ ఆధీనంలోనే ఉంది. 1943-51 మధ్యకాలంలో ట్రిపోలిటానియా, సైరేనైకాలు బ్రిటిష్‌ పాలనలో ఉన్నాయి. ఫెజాన్‌ను ఫ్రాన్స్‌ ఆధీనంలో ఉంచుకున్నది.
951లో స్వాతంత్య్రం
లిబియాకు జనవరి1, 1952లోపు స్వాతంత్య్రం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి నవంబర్‌ 21, 1949లో తీర్మానం చేసింది. దానికి అనుగుణంగానే డిసెంబర్‌ 24, 1951లో లిబియాకు స్వాతంత్య్రం వచ్చింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ లిబియాకు రాజుగా ఇద్రిస్‌ నియమితులయ్యాడు. లిబియా రాజ్యాంగం ప్రకారం రాజు ఇద్రిస్‌ పాలనలో లిబియా నేషనల్‌ అసెంబ్లీతో పాటు ఒక అధ్యక్షుడు (మహ్మద్‌ అబ్దులాస్‌ ఎల్‌ ఆలెమ్‌), ఇద్దరు ఉపాధ్యక్షులు (ఒమర్‌ ఫేక్‌ షెనిబ్‌, అబూబకర్‌ అహ్మద్‌ అబూబకర్‌) నియమితులయ్యారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి లిబియా ఉత్తర ఆఫ్రికాలో నిరుపేద గిరిజన దేశంగానే ఉండేది. ఇది ఆఫ్రికాలో నాలుగో పెద్ద దేశం, ప్రపంచంలో 17వ పెద్ద దేశం. సాంప్రదాయకంగా లిబియా ట్రిపోలిటానియా, ఫెజాన్‌, సైరేనైకా అనే మూడు ప్రాంతాలు కలిగి ఉంది. 1951లో స్వాతంత్య్రం పొంది యునైటెడ్‌ లిబియన్‌ కింగ్‌డమ్‌గా అవతరించింది. 1959లో చమురు నిక్షేపాలు బయటపడిన తర్వాత లిబియా శుద్ధమైన చమురు నిక్షేపాలు గల పదవ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం నిక్షేపాలు గల 17వ అతిపెద్ద దేశంగా ఘనతకెక్కింది. 1963లో దానిపేరును కింగ్‌డమ్‌ ఆఫ్‌ లిబియాగా మార్చారు. 1969లో జరిగిన రక్తపాత రహిత విప్లవంలో కల్నల్‌ గడాఫీ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తర్వాత దేశం పేరును లిబియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌ (అల్‌-జమూరియా అల్‌ అరబియా అల్‌-లిబియా)గా మార్చాడు. గడాఫీ కొన్ని సోషలిస్టు విధానాలను అవలంభించడంతో ఆ దేశాన్ని 1977-86 మధ్య కాలంలో 'సోషలిస్ట్‌ పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా' అని, 1986-2011 మధ్య కాలంలో 'గ్రేట్‌ సోషలిస్ట్‌ పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా' అని పిలిచారు. ఇప్పుడు కొత్తగా అధికారం చేపట్టిన నేషనల్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌టిపి) 'లిబియన్‌ రిపబ్లిక్‌' అని మార్చారు.
దేశం : లిబియా
రాజధాని : ట్రిపోలి
అధికారిక భాష : అరబిక్‌
స్వాతంత్య్రం పొందింది : ఫిబ్రవరి 10, 1947 (ఇటలీ నుండి ఐక్యరాజ్య సమితి ట్రస్టీషిప్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ @ ఫ్రాన్స్‌ల ఆధీనంలోకి మారింది)
డిసెంబర్‌ 24 1951 (యునైటెడ్‌ కింగ్‌డమ్‌ & ఫ్రాన్స్‌ ఆధీనం నుండి కూడా స్వాతంత్య్రం పొందింది)
జనాభా : 66 లక్షలు
విస్తీర్ణం : 17,59,541 చదరపు కిలోమీటర్లు
ప్రధాన ఆదాయ వనరు : చమురు
కరెన్సీ : దీనార్‌
రాష్ట్రాలు : ట్రిపోలిటానియా, బర్కా, ఫెజాన్‌
ప్రధాన నది : మన్మేడ్‌ నది (సహారా ఎడారిలో)



గడాఫీ పాలన...
1959లో చమురు నిక్షేపాల వెలికితీతతో అతిపేద గిరిజన దేశం అకస్మాత్తుగా ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా అవతరించింది. చమురు విక్రయంతో ప్రభుత్వ ఆదాయం భారీ స్థాయిలో పెరిగింది. ప్రభుత్వ ఆదాయం పెరగడంతో ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు ఇద్రిస్‌ భోగభాగ్యాల్లో మునిగిపోయాడు. ప్రజా సంపదను సొంతానికి వాడుకుంటూ ప్రజల పేదరికాన్ని పట్టించుకోలేదు. పాలన స్థంభించింది. లిబియాలో ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులను, ఆ దేశానికి ఆయుధాలను బ్రిటన్‌ ఎక్కువగా సరఫరా చేసింది. అమెరికా కూడా లిబియాలో అతిపెద్ద ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా, బ్రిటన్‌ దోపిడీలు పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. సెప్టెంబర్‌ 1, 1969లో 27 ఏళ్ల యువ మౌమ్మర్‌ గడాఫీ నేతృత్వంలో చిన్న మిలిటరీ అధికారుల గ్రూపు తిరుగుబాటు చేసింది. గడాఫీని ''సోదర నాయకుడు, తిరుగుబాటుకు మార్గదర్శకుడు''గా పేర్కొన్నారు. రాజు ఇద్రిస్‌ ప్రతిఘటించకుండానే పాలనాధికారాలను గడాఫీ బృందానికి అప్పగించాడు. గడాఫీ పాలనా పగ్గాలు చేపట్టగానే దేశంలో మార్పులు చేపట్టాడు. రేడియో, టెలివిజన్‌లను ప్రభుత్వ ఆధీనం చేశాడు. ప్రధానంగా కంపెనీలను, విద్యావ్యవస్థలను ప్రభుత్వపరం చేశాడు. చమురును జాతీయం చేశాడు. 1977లో లిబియాను 'సోషలిస్టు పీపుల్స్‌ లిబియన్‌ అరబ్‌ జమాహిరియా'గా ప్రకటించాడు. దేశంలో గల 66 లక్షల మందికి ఉచిత విద్య, వైద్యంతో పాటు నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించాడు. చదువుపై ఆసక్తి ఉండాలే కాని లిబియాలో ప్రోత్సాహానికి కరువులేదు. విదేశాల్లో చదవాలనుకునే వారందరికీ అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అయితే తాము సంపాదించిన జ్ఞానాన్నంతా మళ్లీ దేశాభివృద్ధికే వెచ్చించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తారు. లిబియన్లు ఆస్పత్రి మెట్లు ఎక్కిననాటి నుండి ఇంటికి వెళ్లే వరకూ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంతటి అనారోగ్యమైనా ప్రభుత్వమే భరిస్తుంది. విదేశాల నుండి మందులు, వైద్యులను తెప్పించి మరీ సేవలు అందిస్తుంది. కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అవసరార్థం డబ్బులు కావాల్సి వస్తే లిబియా బ్యాంకులు వడ్డీ లేని రుణాలు అందిస్తాయి. యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే 50 వేల డాలర్లు బహుమతిగా ఇస్తుంది. ఇల్లు కొనుక్కుని స్థిరపడేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. వ్యవసాయం చేయాలనుకునే వారికి భూమి, అవసరమైన పనిముట్లు, విత్తనాలు సమకూర్చి అండగా నిలుస్తుంది. కారు కొనుక్కువాలనుకునే వారికి సగం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. భారత్‌ నుండే కాదు అగ్రరాజ్యాలుగా చెలామణి అవుతున్న అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల ప్రజలు కూడా ఉద్యోగాల కోసం పొట్ట చేతబట్టుకొని ఇతర దేశాలకు వలస వెళ్తారు. కానీ ఒక్క లిబియా పౌరుడు కూడా ఇతర దేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన సందర్భం లేదు. పైపెచ్చు ఇతర దేశస్తులను ఉద్యోగం కోసం ఆ దేశానికే వలస వెళ్తారు. ఇదీ లిబియా ప్రత్యేకత. ఆఫ్రికా దేశాల్లో లిబియా ఒక స్విట్జర్లాండ్‌ వంటిదని ఇటలీ జర్నలిస్టు వైవోన్‌ పేర్కొన్నారు.
లిబియాను 'ధనిక మధ్య తరగతి ఆదాయం' గల దేశంగా ప్రపంచ బ్యాంకు కూడా కొనియాడింది. అప్పులేని దేశం లిబియా. 1980 వచ్చే సరికి ధనిక దేశాల సరసన నిలిచింది. ఇటలీ, సింగపూర్‌, దక్షిణ కొరియా, స్పెయిన్‌, న్యూజిలాండ్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే లిబియాలోనే జిడిపి వృద్ధిరేటు ఎక్కువగా ఉంది. లిబియన్లను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత గడాఫీకే దక్కింది.
మరి వ్యతిరేకత ఎందుకు..?
లిబియాలో తన కీలుబొమ్మ రాజు ఇద్రిస్‌ను తొలగించి గడాఫీ అధికారం చేపట్టగానే అమెరికాకు వ్యతిరేకమైన చర్యలు చేపట్టాడు. అధికార పగ్గాలు చేపట్టగానే అమెరికన్‌, బ్రిటన్‌ సైనిక స్థావరాలను తొలగించాడు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా పెత్తనాన్ని సవాలు చేశాడు. చమురు సంపద విలువను తెలియజెప్పి దీన్ని ఇతర దేశాలు కొల్లగొట్టుకోకుండా కాపాడాల్సిన బాధ్యత తమదేనని లిబియన్లలో నింపాడు. అలీనోద్యమంలో ముఖ్య పాత్రధారిగా ఉంటూ ఆఫ్రికా దేశాల ఐక్యత కోసం పరితపించాడు. సోవియట్‌ రష్యా నేతృత్వంలోని సోషలిస్టు కూటమితో సన్నిహితంగా ఉంటూ సామ్రాజ్యవాదాన్ని సవాల్‌ చేశాడు. తమ భూభాగం కోసం పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు అండగా నిలిచాడు. ఇజ్రాయిల్‌ జాత్యాహంకారాన్ని నిర్ద్వందంగా ఖండించాడు. ఇజ్రాయిల్‌ దాడులకు బలవుతున్న లెబనాన్‌కు మద్దతుగా నిలిచాడు. అంతేకాదు ఇజ్రాయిల్‌తో ఈజిప్ట్‌ అధ్యక్షుడు అన్వర్‌ సాదత్‌ శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఆగ్రహించి ఆ దేశంపై శతఘ్నులు, ఫిరంగులతో దాడులు చేశాడు.
ఈ చర్యలే అమెరికాకు కంటగింపుగా మారాయి. 80వ దశకంలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌, ఇంగ్లండ్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌లు తమ అభివృద్ధి నిరోధక ప్రయత్నాలకు అడ్డుగా నిలిచిన లిబియాతో ఘర్షణ వైఖరి అవలంబించాయి. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ అమెరికా చేసిన పనిని లిబియాపైకి నెట్టింది. యూరప్‌లో ఒక హోటల్‌పై దాడి, అమెరికా విమానం కూల్చివేత వంటి ఆరోపణలు గడాఫీపై మోపి అతడిపై క్రిమినల్‌గా ముద్ర వేయడానికి ప్రయత్నించాయి. 1986లోనే లిబియాపై, గడాఫీ నివాసంపై అమెరికా వైమానిక దాడులు చేసి ఆయన పెంపుడు కూతుర్ని చంపేసింది. గడాఫీపై ఎన్నో హత్యాయత్నాలు జరిగాయి. గడాఫీ లిబియాలో ఎన్నికలు జరపలేదని, అక్కడ ప్రజాస్వామ్యం లేదని, మానవ హక్కులు మృగ్యమని అమెరికా ప్రచారం చేసింది. కార్పొరేట్‌ మీడియా దానికి వంతపాడింది.
సోవియట్‌ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు
సోవియట్‌ యూనియన్‌ పతనంతో గడాఫీ వైఖరిలో మార్పు వచ్చింది. విమానం పేల్చివేతకు కారకుడైనట్లు ఆరోపిస్తున్న వ్యక్తిని అమెరికాకు అప్పగించాడు. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లను కబ్జా చేసుకున్న తర్వాత ఇరాన్‌, లిబియాలపై అమెరికా దాడిచేస్తుందని ఎప్పుడో స్పష్టమైంది. అయితే గడాఫీ దౌత్య నీతితో ఇంతకాలం నెట్టుకొచ్చాడు. 9/11 నిందితులలో ఒకడైన అబ్దెలఖిమ్‌ బెల్వద్జీని మలేసియాలో 2003లో పట్టుకున్న అమెరికాకు చెందిన సిఐఎ మరుసటి ఏడాది లిబియాకు అప్పగించింది. అతడ్ని కొంతకాలం జైల్లో ఉంచిన గడాఫీ తర్వాత ఉదారవాద దృష్టితో విడుదల చేశాడు. అయితే బెల్వద్జీ అప్పటికే సిఐఎ ఏజెంటుగా మారినట్లుంది. లిబియా ఇస్లామిక్‌ ఫైటింగ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐఎఫ్‌జి) పేరుతో ఒక ఛాందస వాద సంస్థను ఏర్పాటు చేశాడు. అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్‌ను పెంచి పోషించినట్లు బెల్వద్జీని కూడా అమెరికా పెంచి పోషించింది. అతడు గడాఫీపైనే దాడికి దిగాడు. ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై పోరాటమే తన ధ్యేమని చెప్పే అమెరికా తన వత్తాసుతో పలికే నాటోను లిబియాలో దించాడు. నాటో కూటమి బెల్వద్జీ సంస్థకు అండగా నిలిచి లిబియాలో వ్యతిరేకతను ప్రోత్సహించింది. అరబ్‌ దేశాల్లోని సిరియా, ఈజిప్టుల్లో మాదిరిగా లిబియాలో కూడా తిరుగుబాటు దారులు పురోగమించారు. అయితే గడాఫీ ఆయన కుమారుడు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. తిరుగుబాటు దారులు ఆక్రమించుకున్న రాజధాని ట్రిపోలీని, ఇతర ప్రాంతాలను మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు గడాఫీ దళం ప్రయత్నించింది. అయితే అమెరికా కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్య సమితి ట్రిపోలీని 'నో ఫ్లై జోన్‌'గా మార్చి 17న ప్రకటించింది. ఆ ప్రాంతాన్ని కాపాడే బాధ్యతను నాటో దళాల ముసుగులో ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌ కూటమిలోని సైనికులు తమకుతామే స్వీకరించారు. ట్రిపోలీని కాపాడతామని వాగ్దానం చేసిన ఈ నాటో దళాలు లిబియాలో గడాఫీ అనుకూల దళాలను తుదముట్టించే పనిలో పడ్డాయి. ఏప్రిల్‌ 20వ తేదీన గడాఫీ నివాసాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో గడాఫీ తన స్వస్థలం సిర్తేలో తలదాచుకోవాల్సి వచ్చింది. ట్రిపోలీని కాపాడతామని వచ్చిన నాటో దళాలు గడాఫీని వెంటాడి, వేటాడి హత్య చేయడం వారి దుర్మార్గానికి నిదర్శనం. గడాఫీ మరణం తర్వాత లిబియాలో శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయని, మానవహక్కులు వర్థిల్లుతాయని భావించలేం. మాజీ సోషలిస్టు దేశాలతోపాటు ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లో అమెరికా నమ్మిన బంటైన పాకిస్తాన్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో మనం చూస్తూనే వున్నాం.

నాటో దళాలు
నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ఏప్రిల్‌ 4, 1949లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది. ప్రధానంగా అగ్రదేశాల రాజకీయ ప్రయోజనాలను కాపాడే సంస్థ ఇది. అమెరికాకు చెందిన సైనికాధికారులు నేతృత్వంలోకి నాటో వెళ్లాక వివిధ దేశాల్లో నాటో దళాల రాజకీయ జోక్యం మరీ పెరిగింది. నాటోపై ప్రపంచ దేశాలకు నమ్మకం పోయింది. నాటో దళం తొలిసారి యుగోస్లావియాలో జోక్యం చేసుకుంది. 1991-95 మధ్యకాలంలో నాటో బోస్నియాలో సైనిక చర్యను చేపట్టింది. 1999లో యుగోస్లావియాలోనూ జోక్యం చేసుకుంది. 9/11 నాడు తమ దేశంపై జరిగిన దాడులను 19 నాటో సభ్య దేశాలపై జరిగిన దాడిగా గుర్తించాలని అమెరికా తీర్మానం చేయించింది. 9/11ను సాకుగా చేసుకున్న అమెరికా తన శత్రు దేశాలపై దాడులకు నాటోను పావుగా ఉపయోగించుకోనారంభించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొని తాలిబన్లను మట్టికరిపించి అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకూ నాటో దళం ఆ దేశంలో తిష్టవేసింది. ఇరాక్‌లోని చమురు సంపదపై కన్నేసిన అమెరికా సద్దాం హుస్సేన్‌ను క్రూరంగా చంపి ఆ దేశంలోనే తమ నమ్మిన బంటును నియమించుకుంది. ఇప్పుడు లిబియాలోనూ తిరుగుబాటు దళాలకు మద్దతుగా ఆ దేశ రాజధాని ట్రిపోలీని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించి ఆ నగరాన్ని కాపాడేందుకు మాత్రమే అక్కడికి వెళ్తున్నట్లు చెప్పింది. కానీ గడాఫీని హత్యచేసి తిరుగుబాటు దళాలు చంపినట్లు అబద్ధాలు ఆడింది. అమెరికా నేతృత్వంలో ఏ దేశంలోనైనా అక్రమంగా ప్రవేశించి అక్కడి అమాయక ప్రజలను దారుణంగా చంపడమే పనిగా నాటో దళాలు పెట్టుకున్నాయి. ఇది అంతర్జాతీయ ఉగ్రవాది అమెరికాకు నమ్మినబంటుగా వ్యవహరిస్తూ ఇతర దేశాల విశ్వాసాన్ని కోల్పోయాయి. నాటోలో ఏప్రిల్‌ 2009న కొత్తగా అల్బేనియా, క్రొయేషియా చేరాయి. డిసెంబర్‌ 16, 2002లో కుదిరిన బెర్లిన్‌ ప్లస్‌ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఎక్కడైనా సంక్షోభం తలెత్తితే స్వతంత్య్రంగా జోక్యం చేసుకునే హక్కు నాటోకు ఉంది. ఈ ఒప్పందం నాటో, యూరోపియన్‌ దేశాల మధ్య కుదిరింది. నాటో 28 దేశాల కూటమి అయినా అందులో అమెరికా 43 శాతం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీలు 15 శాతం చొప్పున సైనిక శక్తి కలిగి ఉన్నాయి.

యువతలో అసంతృప్తి
లిబియాను గడాఫీ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలబెట్టి అందరి మన్ననలు పొందాడు. అయితే ఇటీవల యువతరం ఆయనపై అసంతృప్తిని పెంచుకుంది. లిబియాలో కీలకమైన విభాగాల్లో విదేశీ ఉద్యోగస్తులే ఉన్నారు. ఎంత ఉన్నత విద్యను అభ్యసించినా ఉద్యోగం దొరకడం కష్టమైంది. దీంతో కొత్త తరం ప్రజల్లో నిరుద్యోగిత పెరిగింది. లిబియన్‌ యువకుల్లో చాలా మంది తమ కారును ట్యాక్సీగా మార్చి జీవించాల్సి వచ్చింది. ఉన్నత చదువులు చదివిన తమకు ఉద్యోగాలు లభించడం లేదన్న అసంతృప్తి వాళ్లలో పెరిగింది. యువతలోని ఈ బలహీనతను బెల్వద్జీ నేతృత్వంలోని లిబియా ఇస్లామిక్‌ ఫైటింగ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐఎఫ్‌జి) సొమ్ముచేసుకుంది. యువతలో మతోన్మాదాన్ని నింపి గడాఫీకి వ్యతిరేకంగా ఉసిగొల్పింది. వాళ్లకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది.
ఇక కుక్కలు చింపిన విస్తరే...
అమెరికా విష కౌగిలిలో లిబియా ఇక కుక్కలు చింపిన విస్తరిగా మారనుంది. నేషనల్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌టిసి) పేరుతో ఆ దేశంలో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశంగా ఓ వెలుగు వెలుగుతున్న లిబియా ప్రధాన వనరు చమురు. ఈ చమురును అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లు ఎగరేసుకుపోవడం మాత్రం ఖాయం. 99.9 శాతం విద్యావంతులు గల ఆ దేశ ప్రజలు తమ దేశంలోనే పరాయివాళ్లుగా బతకాల్సి వస్తుంది. ప్రజలందరికీ అన్నీ ఉచితం పేరిట ఒక విధమైన సోషలిజం పరిఢవిల్లుతున్న లిబియాలో అమెరికా మెల్లగా తన పెట్టుబడిదారీ విధానాన్ని చొప్పించడానికి వెనకాడదు. లిబియాను కూడా తన మార్కెట్‌గా మార్చుకొని అక్కడి సహజవనరులను కొల్లగొట్టుకొని పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గడాఫీ బతికుండగానే ఇంగ్లండ్‌ ప్రధాని కామెరూన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు సర్కోజీ లిబియాకు వెళ్లి తమ కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలపై ఒక ఒప్పందానికి వచ్చారు. లిబియాపై వచ్చే ఆదాయం అగ్ర రాజ్యాల మధ్య స్నేహాన్ని పెంచుతుందా లేక వారి మధ్య వైరుధ్యాలను మరింత పెంచుతుందా అనేది చూడాలి.

*Article from prajasakti Daily written by Md.Hassan Sharif. visit www.prajasakti.com


Friday, September 16, 2011

కేజీ గ్యాస్‌ - రిలయన్స్‌ లూటీ

రిలయన్స్‌ తన చిత్తం వచ్చినట్టు కేజీ బేసిన్‌లో వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఏ ప్రాంతమయితే ఆ గ్యాసుతో పారిశ్రామికవంతం అవుతుందో ఆ కోస్తా ప్రాంతంలో సిపిఎం ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వాస్తవం ఇది కాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ పట్టువదలని విక్రమార్కునిలా కెజి గ్యాస్‌ కోసం కృషి చేశారని కొందరు చేస్తున్న ప్రచారం అర్ధం లేనిది. ఆయన రాష్ట్రానికి కోరిన గ్యాస్‌ వాటా 10 శాతం మాత్రమే. దాన్నీ ఆయన సాధించలేకపోయారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతానని మాటలతోనే కాలం వెళ్లబుచ్చారు. కేంద్రానికి విజ్ఞప్తులతోనే పరిమితమయ్యారు.
ఇటీవల వెల్లడయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక మన రాష్ట్రంలోని కృష్ణా గోదావరి (కెజి) బేసిన్‌లో రిలయన్స్‌ గ్యాస్‌ కంట్రాక్టు వ్యవహారంలో చోటుచేసున్న అనేక అవకతవకలను ఎత్తిచూపింది. గత కొన్నేళ్లుగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్రంలోను, రాష్ట్రంలోను ఈ భారీ లూటీని ఎండగట్టి, చేస్తున్న ఆందోళనల సహేతుకతను ఈ నివేదిక ధ్రువీకరిస్తున్నది. సహజ వనరుల అన్వేషణ వెలికితీతలకు సంబంధించి భారత ప్రభుత్వం, పని అప్పగించబడిన ప్రైవేటు సంస్థల మధ్య ప్రాతిపదిక ఒప్పందం అయిన ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్టును (పిఎస్‌సి) రిలయన్స్‌ ఉల్లంఘించిన తీరును కాగ్‌ స్పష్టం చేసింది. పెట్టుబడి వ్యయాన్ని అనుచితంగా పెంచి ఉత్పత్తిలో అత్యధిక వాటాను రిలయన్స్‌ కాజేస్తున్న వైనాన్ని వివరించింది.
భారత దేశంలో కనుగొన్న అతి పెద్ద గ్యాస్‌ నిక్షేపాలు ధీరూబారు-1, ధీరూబారు-3 క్షేత్రాలు. అంతేకాదు, ఇవి దేశంలో అతిపెద్ద చమురు అన్వేషణా క్షేత్రాలు కూడా. ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్టు ప్రకారం రిలయన్స్‌ సంస్థ మొదటి దశ అన్వేషణ తర్వాత కాంట్రాక్టు ప్రాంతంలో 25 శాతాన్ని వదిలివేయాలి, రెండవదశ అన్వేషణ తర్వాత మరో 25 శాతం ప్రాంతాన్ని వదిలి వేయాలి. చమురు కనుగొన్న ప్రాంతాన్ని డిస్కవరీ ప్రాంతంగా ప్రకటిస్తారు. అంటే ఆ ప్రాంతంలో ఎంత పరిమాణంలో గ్యాస్‌ లభిస్తుంది అన్నదాన్ని బావులు తవ్వడం ద్వారా కచ్చితంగా నిర్ధారిస్తారు. డిస్కవరీ ప్రాంతంగా ప్రకటించిన దాన్ని కాంట్రాక్టుదారు తన ఆధీనంలో ఉంచుకుంటాడు. మిగతా కాంట్రాక్టు ప్రాంతంలో 25 శాతాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అలా ప్రభుత్వం తిరిగి తీసుకున్న దానిని ఆసక్తికలిగిన ఇతర పార్టీలకు కాంట్రాక్టుకు ఇస్తుంది. కాని ఇక్కడ రిలయన్స్‌ సంస్థ మొదటి దశ అన్వేషణ ముగిసిన తర్వాత 25 శాతం మిగతా ప్రాంతాన్ని అప్పగించకుండానే రెండవ దశ అన్వేషణకు పూనుకుంది. ఆ తర్వాత 2009లో మొత్తంగా 765 చదరపు కిలోమీటర్ల కాంట్రాక్టు ప్రాంతాన్ని డిస్కవరీ ప్రాంతంగా ప్రకటించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ విధంగా దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌, చమురు నిక్షేపాలున్న ప్రాంతాన్ని రిలయన్స్‌ సంస్థ గుత్తాధిపత్యానికి ప్రభుత్వం కట్టబెట్టింది. మొదటి దశలో రిలయన్స్‌ తన కంట్రాక్టు ప్రాంతంలో కేవలం వాయవ్య ప్రాంతంలో మాత్రమే అన్వేషణ జరిపి, రెండవదశకు సాగిపోయింది. బావులు తవ్వి కచ్చితంగా డిస్కవరీని నిర్ధారించడానికి బదులు, భూప్రకంపనల అధ్యయనం ఆధారంగా నిక్షేపాలగురించి రిలయన్స్‌ పేర్కొన్న అంచనాలను ఆమోదించి ప్రభుత్వం మొత్తం కాంట్రాక్టు ఏరియాను డిస్కవరీ ఏరియాగా ప్రకటించింది.
ఈ విధంగా మొత్తం కాంట్రాక్టు ఏరియాను డిస్కవరీ ఏరియాగా ప్రకటించడాన్ని సమీక్షించమని చమురు, సహజవాయువు మంత్రిత్వశాఖను కాగ్‌ ఆదేశించింది. మొదటి దశ రెండవ దశ అన్వేషణ తర్వాత తిరిగి అప్పగించాల్సిన 25 శాతం ప్రాంతాన్ని కూడ నిర్ధారించమని కోరింది. మొదటి దశలో కాని, రెండవ దశలో కాని నిర్దేశిత ప్రాంతంలో, నిర్దేశిత కాలవ్యవధిలో కనుగొన్న నిక్షేపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, కాలపరిమితి తర్వాత ఆ ప్రాంతంలో తవ్వి కనుగొన్న క్షేత్రాలను కచ్చితంగా మినహాయించాలని కూడ చెప్పింది. ఈ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని, ఎట్టిపరిస్థితిలోను మినహాయింపులు ఇవ్వకూడదని, డిస్కవరీ తర్వాత మిగిలిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని మరొకరికి కాంట్రాక్టుకు ఇవ్వడం ద్వారా ఇంధన వనరుల అన్వేషణ సంపూర్ణంగా జరుగుతుందని చెప్పింది.
కాగ్‌ నివేదిక ఎత్తిచూపిన మరొక ప్రధాన అంశం పెట్టుబడి వ్యయం అంచనాలను భారీగా పెంచడం గురించి. మొదటి దశలో కనుగొన్న వనరులను అభివృద్ధి చేయడానికి 240 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని రిలయన్స్‌ 2004లో చూపించింది. కానీ ఆ తర్వాత 2006లో అనుబంధ అంచనాలో మొదటి దశకు 520 కోట్ల డాలర్లు, రెండవ దశకు 360 కోట్ల డాలర్లు అవుతుందని చూపించింది. అనుబంధ అంచనాను ప్రభుత్వానికి సమర్పించి ఆమోదింపచేసుకోవడానికి ముందే దాని ప్రకారం అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టారు. డి-1, డి-3 క్షేత్రాలను సకాలంలో అభివృద్ధి చేయడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం లభిస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేశామని కాంట్రాక్టరు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ ఆమోదం దానంతటదే వస్తుందన్న ధీమాతో ఇలా చేస్తుంటారని కాగ్‌ పేర్కొంది.
ఇలా పెట్టుబడి వ్యయ అంచనాను పెంచడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ఉత్పత్తి పంపిణీ ఒప్పందం ప్రకారం ఒక ఏడాదిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ, అన్వేషణా వ్యయం, అభివృద్ధికి అయిన వ్యయం కలుపుకొని ఆ ఏడాది ఉత్పత్తి అయిన దానిలో 'కాస్ట్‌ పెట్రోలియం'ను నిర్ణయిస్తారు. దానికోసం ఆ ఏడాది అయిన ఉత్పత్తిలో 90 శాతం వరకు మినహాయిస్తారు. మిగతాదాన్ని 'ప్రాఫిట్‌ పెట్రోలియం'గా గుర్తిస్తారు. ఈ ప్రాఫిట్‌ పెట్రోలియంలో కూడ మొత్తం పెట్టుబడిని బట్టి కాంట్రాక్టరుకు వాటా లభిస్తుంది. మిగిలినదే ప్రభుత్వానికి దక్కేది. వనరుల అభివృద్ధి వ్యయం అంచనా ఇలా పెరగడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ఉత్పత్తి అధికంగా జరిగే తొలి దశలో ప్రభుత్వం వాటా నామమాత్రంగా ఉంటుంది. క్రమంగా చివరికి వాటా పెరిగినా ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. అధిక వాటా ప్రభుత్వానికి లభించే సమయానికి అసలు ఆ వనరే వట్టిపోయే అవకాశం ఉంటుంది. అందుచేతనే అనేక దేశాలు పెట్టుబడి వ్యయం అంచనాల పెంపుదలపై కచ్చితమైన, నిఘాను, నియంత్రణను అమలుచేస్తున్నాయి. ఉదాహరణకు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ పెట్టుబడి వ్యయం 5 లక్షల డాలర్లు పెరిగితే దాన్ని ప్రభుత్వ ప్రతినిధులు కూడ సగం మంది ఉండే మేనేజింగ్‌ కమిటీ ఆమోదించి తీరాలని నిబంధన విధించింది. అలాంటి పద్ధతి మనకు లేదు.
మరొక ముఖ్యమైన అంశం గ్యాస్‌ ధర. ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వలోని సాధికార కమిటీ రిలయన్స్‌ గ్యాస్‌కు ఒక ఎంఎంబిటికి 4.2 డాలర్ల ధరను నాలుగేళ్ల క్రితమే ఆమోదించింది. ఇది అంతకుముందు రిలయన్స్‌ సంస్థ ఎన్‌టిపిసికి సరఫరా చేస్తానన్న 2.34 డాలర్ల కన్నా ఎక్కువ. అంబానీ సోదరులు తమ ప్రైవేటు ఒప్పందంలో అంగీకరించుకున్న 2.25 డాలర్ల కన్నా ఎక్కువ. 4.33 డాలర్లను అనుమతించమని రిలయన్స్‌ చేసిన ప్రతిపాదనను 0.1 శాతం తగ్గించి ప్రభుత్వం ఆమోదించింది. దీని మూలంగా ఆ గ్యాస్‌ను వినియోగించే విద్యుత్‌ కేంద్రాలు, ఎరువుల ఫ్యాక్టరీలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అంతిమంగా భరించేది ప్రజలే. గ్యాస్‌ను వెలికి తీయడానికి ఒక ఎంఎంబిటికి ఒక డాలరుకు మించి ఖర్చు అవుతుందని ప్రపంచంలో ఎక్కడా ఎవరూ చెప్పలేదని నిపుణులు ఎన్ని సార్లు మొత్తుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు దీన్ని కాగ్‌ ప్రశ్నించినా ప్రభుత్వం నుండి మౌనమే సమాధానం.
ఆరంభంలోనే చెప్పినట్లు ఈ అన్ని అంశాల గురించి చాల కాలంగా పోరాటం చేస్తున్నది సిపిఎం పార్లమెంటు సభ్యుడు తపన్‌ సేన్‌. 2006 డిసెంబరు 21న మొదలుపెట్టి అనేక లేఖలను పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖకు రాశారు. వాటి కాపీలను ప్రధానమంత్రికి పంపించడంతోపాటు నేరుగా ఆయనకూ లేఖలు రాశారు. రాష్ట్రానికి చెందిన అప్పటి సిపిఎం పార్లమెంటు సభ్యులు పి. మధు, ఎం. బాబూరావు ప్రధానికి లేఖ రాస్తూ కెజి బేసిన్‌లో రిలయన్స్‌ వెలికితీసే గ్యాసుకు నిర్ణయించిన అహేతుకమైన ధర గురించి, అన్యాయమైన ఉత్పత్తి పంపిణీ ఒప్పందం గురించి ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ముందుగా మన అవసరాలకు వినియోగించాలని, ఆ తర్వాతనే బయటికి తరలించాలని కోరారు. సహజవనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో 50 శాతం కేటాయించాలని 12వ ఆర్థిక సంఘం చెప్పినదాన్ని అమలుచేయాలని, లేదంటే ప్రభుత్వానికి లభించే గ్యాస్‌లో అయినా 50 శాతం ఈ రాష్ట్రానికి వినియోగించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ 2007లోనే ఈ అంశంపై సిపిఎం ఎంపీల లేఖలు, పొలిట్‌బ్యూరో ప్రకటనలతో పాటు, పలువురు రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలతో ఒక బుక్‌లెట్‌ను ప్రచురించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఈ బుక్‌లెట్‌ ముందుమాటలో ''సహజవాయు నిక్షేపాలు రాష్ట్రంలో లభిస్తున్నప్పటికీ వాటి అభివృద్ధి మీద, వినియోగం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. పెత్తనమంతా కేంద్రానిదే. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాలలో భాగంగా ఇప్పుడంతా ప్రైవేటు సంస్థలదే రాజ్యంగా మారిపోయింది. ముఖ్యంగా రిలయన్స్‌ సంస్థ గుత్తాధిపత్యాన్ని సంపాదించి తన చిత్తం వచ్చినట్లు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వమేమో నామమాత్రంగా లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నది.'' అని ఘాటుగా విమర్శించారు. అంతేకాదు, కెజి బేసిన్‌ గ్యాస్‌పై రాష్ట్రానికే హక్కు అని నినదిస్తూ ఏ ప్రాంతమయితే ఆ గ్యాసుతో పారిశ్రామికవంతం అవుతుందో ఆ కోస్తా ప్రాంతంలో సిపిఎం ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వాస్తవం ఇది కాగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పట్టువదలని విక్రమార్కునిలా కెజి బేసిన్‌ గ్యాస్‌ కోసం కృషి చేశారని కొందరు చేస్తున్న ప్రచారం అర్ధం లేనిది. ఆయన రాష్ట్రానికి కోరిన గ్యాస్‌ వాటా 10 శాతం మాత్రమే. దాన్నీ ఆయన సాధించలేకపోయారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతానని మాటలతోనే సరిపుచ్చారు. కేంద్రానికి విజ్ఞప్తులతోనే పరిమితమయ్యారు. పైగా ఆంధ్రప్రదేశ్‌ను పెట్రోలియం, కెమికల్స్‌,పెట్రోకెమికల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జోన్‌గా తయారుచేస్తానని ఒక వైపున గొప్పలు చెప్పుకొంటూ, తన ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకున్న కాకినాడ ఓఎన్‌జిసి రిఫైనరీ బయటికి తరలిపోతున్నా అడ్డుకోలేకపోయారు.

**** from Prajasakti desk

Tuesday, August 23, 2011

హజారే ఉద్యమంలో కొన్ని కోణాలు

అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో రెండో స్వాతంత్య్రోద్యమం నడుస్తోందా ? అవినీతికి వ్యతిరేకంగా ప్రజా విప్లవం పెల్లుబికిందా ?? సంఫ్‌ు పరివార్‌ దీనిని సొమ్ము చేసుకోవాలని చూస్తోందా ??? ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరి వద్దా ఒక్కో సమాధానముంది. ఏ సమాధానం సరైనదన్న విషయాన్ని కాలమే త్వరలో నిర్ణయించనుంది. అవునన్నా, కాదన్నా...ఇప్పుడు దేశంలో అవినీతి అతిపెద్ద చర్చనీయాంశం అయ్యింది. పెట్రోల్‌ ధరలు తగ్గించాలని దేశ ప్రజలందరూ నినదించవచ్చు..ప్రభుత్వం ఒక్కరోజులో తగ్గించనూ వచ్చు. వేతనాలు పెంచాలని, లాకౌట్లు ఎత్తివేయాలని కార్మికులు సమ్మె చేయవచ్చు...ప్రభుత్వాలు, యాజమన్యాలు తలొగ్గవచ్చు. ఇలా అత్యధిక శాతం ప్రజలు కొన్ని 'నిర్దిష్టమైన' డిమాండ్ల ఆధారంగా (నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలపై) ఏకమవ్వడం..ఆందోళనల్లోకి రావడం సర్వ సాధారణం. అవినీతిని అంతమొందించాలని ' దేశ ప్రజలందరూ ' వీధుల్లోకి రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే ! వ్యవస్థీకృతమైన అవినీతిని అరికట్టడం, ఒకటి రెండు చట్టాలతోనే సాధ్యమౌతుందని భావించడమూ అటువంటిదే. అన్నా హజారే దీక్ష రూపంలో ప్రస్తుతం దేశవ్యాపితంగా సాగుతోన్న ఆందోళనలోనూ పైకి కనిపించని వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయి. సయోధ్యకు ఇరుపక్షాలూ సిద్ధంగానే ఉన్న నేపథ్యంలో..అన్నా బృందం, కేంద్ర ప్రభుత్వం మధ్య నేడో, రేపో ఒక ఒప్పందం కుదరవచ్చు. ఈ సయోధ్యమాటున అవినీతి వ్యతిరేక ఉద్యమంలో దాగున్న కీలకాంశాలను మరుగున పడేయడం మాత్రం సాధ్యం కాదు.
కల్లోల కాంగ్రెస్‌
ప్రస్తుతం యుపిఎ 2 ప్రభుత్వం రెండు సంవత్సరాల వయసులోనే అపారమైన అవినీతి (అప్రతిష్ట) మూటగట్టుకుందనడంలో వివాదం లేదు. హాజారే, రామ్‌దేవ్‌బాబా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక 'ఉద్యమాన్ని' ఎదుర్కోవడంలోనూ తలపండిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ పసితనాన్ని ప్రదర్శించింది. హజారేబృందాన్ని లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా తయారీ కమిటీలోకి సభ్యులుగా తీసుకోవడం - ఆపాదమస్తకమూ హజారే అవినీతిపరుడేనని విమర్శించడం....రామ్‌దేవ్‌బాబాతో విమానాశ్రయానికి వెళ్లి చర్చలు జరపడం - దీక్షలో కూర్చున్న వ్యక్తిని అర్ధరాత్రి బలవంతంగా అరెస్టు చేయడం...ఇలా గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఆగస్టు 16న హజారేను ఇంటి నుండి నేరుగా తీహార్‌ జైలుకు తరలించడం వీటికి పరాకాష్ట. ఇది ప్రజాస్వామ్య హక్కులపై అధికార పార్టీ నగంగా చేసిన దాడి. లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా కమిటీలోకి కొందరు వ్యక్తులను సభ్యులుగా తీసుకోవడం కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం..నాడు కాంగ్రెస్‌కు అప్రజాస్వామికంగానూ, పార్లమెంటును అగౌరవపర్చే చర్యగానూ అనిపించకపోవడం విడ్డూరం. అప్రజాస్వామిక డిమాండ్లతో అన్నా ఆందోళన చేస్తున్నారని విమర్శించే హక్కు ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉందా అన్నదే ప్రశ్న. అవినీతి వ్యతిరేక ఉద్యమాలపై, వాటికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తులపై గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ సూత్రబద్ధమైన, నిలకడైన వైఖరిని ప్రదర్శించలేదు. 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ, ఇలా ఏపూటకాపూట బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నది. ఇంత జరుగుతున్నా అవినీతి అంశంపై కనీసం ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. 'ఆర్థిక సంస్కరణల అమలు వల్లే దేశంలో అవినీతి పెరిగిందని కొందరు అంటున్నారు. ఇది అవాస్తవం. సంస్కరణలకూ, అవినీతికీ సంబంధం లేదు. ఇంకా కొన్ని రంగాల్లో సంస్కరణల కారణంగానే, అవినీతి తగ్గింది' అంటూ ప్రధాని మన్మోహన్‌ రెండ్రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ జెండాను, ఎజెండానూ చెప్పకనే చెబుతున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యలో సంస్కరణలకు ఎక్కడ అగౌరవం కలుగుతుందోనన్న ఆందోళన తప్ప...ప్రధాని ప్రకటనలో మరేమీ కనబడకపోవడం యాదృచ్ఛికం కాదు.
ఆరెస్సెస్‌ చొరబాటు యత్నాలు
గత ఏప్రిల్‌లో మొదటి సారి జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళనకన్నా ప్రస్తుత ఆందోళన విస్తృతి పెరిగింది. హజారే దీక్షలో చొరబడి దీనిని సొమ్ము చేసుకోవాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ ఉద్యమంలో తమ శ్రేణులు పూర్తి స్థాయిలో, ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేత సునీల్‌ జోషి కొద్ది రోజుల క్రితం స్వయంగా చెప్పడం, ఎబివిపి ఆధ్వర్యంలో నడిచే 'ఇండియా అగైనెస్ట్‌ కరప్షన్‌' ఈ ఉద్యమంలో చొరబడడం దీనినే సూచిస్తున్నాయి. అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అలా అని అన్నా ఆందోళనలో ప్రజలెవరూ స్వచ్ఛదంగా పాల్గొనడం లేదన్నది దీనర్ధం కాదు. హజారే ఉద్యమంతో ఊపందుకున్న అవినీతి వ్యతిరేక వాతావరణం నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి ఇంకొకవైపు నుంచి ప్రయత్నిస్తున్నది. అదలా ఉంచితే అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు, కార్పొరేట్‌ ఉద్యోగులు, యువత, మధ్యతరగతి జీవులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం ఆహ్వనించదగ్గ పరిణామమే.
పార్లమెంటు...ప్రజాస్వామ్యం
ఈ ఉద్యమం సందర్భంగా అన్నా బృందం లేవనెత్తిన డిమాండ్లకు సంబంధించిన కొన్ని అంశాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఫలానా గడువులోగా ఫలానా చట్టాన్ని రూపొందించాలని శాసించజూడడం అన్నా బృందం పట్టుబట్టడం విమర్శలకు ఆస్కారమిచ్చింది. అదే సమయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ...పార్లమెంటు అధికారమే అత్యున్నతమైనదని భీష్మించుక్కూర్చొన్న యుపిఏ ప్రభుత్వ ధోరణి ప్రజల ఆగ్రహం పెరగడానికి కారణమవుతున్నది. 'అవినీతి' అంశానికి నిర్దిష్టత్వం లేదు కాబట్టి దేశ కార్పొరేట్‌ రంగం కూడా అన్నా ఆందోళనకు మద్దతునిస్తున్నది. అన్నా బృందం ప్రస్తావిస్తున్న జన లోక్‌పాల్‌లో ప్రభుత్వ అవినీతి గురించి తప్ప కార్పొరేట్‌ అవినీతి గురించిన ఊసే లేకపోవడం గమనార్హం. ఇప్పుడు వెల్లువెత్తిన అవినీతి కుంభకోణాలన్నీ దాదాపు ఈ కార్పొరేట్‌ రంగం ప్రమేయంతో జరిగినవేనన్న విషయం మరువరాదు. రెండో దశ సంస్కరణలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమయ్యిందన్న అసంతృప్తితో ఉన్న కార్పొరేట్‌ గణం... కూడా హజారే ఉద్యమానికి మద్దతు నిస్తున్నదనే వార్తలను కొట్టిపారేయలేం. మధ్యతరగతి స్పందిస్తుందన్న కారణం చెప్పి, అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కార్పొరేట్‌ మీడియా కల్పిస్తోన్న ప్రాధాన్యతా శ్రుతి మించుతోందనే చెప్పాలి. ఏడాది క్రితం ఇదే రామ్‌లీలా మైదానం నుండి ఇదే జంతర్‌మంతర్‌ వరకూ లక్షలాది అంగన్‌వాడీలు ప్రదర్శనగా వస్తే...' ట్రేడ్‌యూనియన్‌ ఆందోళనలతో ఢిల్లీ వాసులుకు ట్రాఫిక్‌ ఇక్కట్లు ' అంటూ లోపలి పేజీల్లో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్తను ఇచ్చింది. అదే పత్రిక ప్రస్తుతం అన్నా ఉద్యమంపై నిత్యం 8 పేజీలకు తగ్గకుండా వార్తలిస్తోంది. 'సంస్కరణలను కొనసాగించడంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం విఫలమౌతోంది. ఈ కారణంగా దేశంలో మధ్య తరగతి ఆకాంక్షలు, అభిలాషలు తీరడం లేదు. అందువల్లే దేశ మధ్యతరగతి అన్నా ఉద్యమానికి బాసటగా నిలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించకపోతే, కాంగ్రెస్‌ పుట్టి మునిగినట్లే' అని మరో ప్రముఖ ఆంగ్ల పత్రిక సంపాదకుడు రెండ్రోజుల క్రితం వ్యాసమే రాశారు !

**Article By D.JayaPrakash From prajasakti.com 

Tuesday, August 16, 2011

అమెరికా బాటలో ఫ్రాన్స్‌

అసలే ఐరోపాలో వేసవి, దానికి తోడు రుణ సంక్షోభ వేడిగాలులు పాలకపార్టీలకు మరింతగా చెమటలు పట్టిస్తున్నాయి. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా పరపతి పోయింది. తరువాత వంతు ఏ దేశానిది అవుతుందన్నది మదుపర్లలో ప్రశ్నార్థకంగా మారిన సమయంలో న్యూయార్క్‌, వాషింగ్టన్‌, నుంచి రుణ సంక్షోభం పారిస్‌ నగరానికి పాకింది. ఏ క్షణంలో అయినా దాని పరపతీ పతనం కానున్నదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న ఐరోపాను ఆదుకొనేందుకు తాత్కాలిక సర్దుబాటు నిధి సమకూర్చే దేశాలలో జర్మనీ తరువాత స్థానంలో ఉంది ఫ్రాన్స్‌. అలాంటి దేశంలో పడిపోతున్న స్టాక్‌మార్కెట్‌ను నిలబెట్టేందుకు అధ్యక్షుడు సర్కోజీ పక్షం రోజుల ముందుగానే వేసవి విడిది నుంచి ఆగమేఘాల మీద పారిస్‌ చేరుకున్నాడు. లండన్‌ తగలడిపోవటం కూడా నిస్సందేహంగా సర్కోజీని కలవర పరిచి ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన తాజా నివేదికలో ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థ పురోగమనం గురించి భరోసా ఇచ్చింది. రానున్న రెండు సంవత్సరాలలో తన ఆర్థిక వనరులను అది మరింతగా స్థిరపరుచుకుంటుందని చెప్పింది. ఇదొక ఎత్తయితే అమెరికా పరపతిని తగ్గించిన స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ సంస్థతో పాటు మరో రెండు ప్రముఖ సంస్థలు ఫ్రెంచి సర్కార్‌ బాండ్లు కొనటం సురక్షితమని చేసిన ప్రకటనల నేపథ్యంలో ఫ్రెంచి బాండ్ల ధరలు పెరిగాయి. అయితే ఉరుములేని పిడుగులా శుక్రవారం నాడు ఫ్రెంచి ప్రభుత్వ పది సంవత్సరాల బాండ్లపై రాబడి మూడు శాతం పడిపోయింది. ఈ పరిణామం జరిగిన కొద్ది సేపటికే ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పురోగతి లేక స్తంభించి పోయిందని, సర్కోజీ సర్కార్‌ చెబుతున్నట్లు ఏడాది కాలంలో రెండు శాతం కాదు 0.3శాతం మాత్రమే పెరుగుదల రేటు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనాలను ప్రకటించారు. పులి మీద పుట్రలా తొలి మూడు మాసాలతో పోల్చితే వినియోగం రెండవ త్రైమాసికంలో 0.7శాతం పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ ఏటి లోటు బడ్జెట్‌ను 7.1 నుంచి 5.7శాతానికి, వచ్చే ఏడు 4.6శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పులు లేవని అందుకు గాను బడ్జెట్‌ కోతలను విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెల్లవారే సరికి పరిష్కరించటానికి మంత్ర దండం లేదని కొన్ని పత్రికలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఇదే జరిగితే అభివృద్ధి రేటు మరింత పతనం అవకతప్పదు. ఇతర ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద దేశీయ డిమాండ్‌ మీదే ప్రధానంగా ఆధారపడి ఉంది. కొత్త కార్ల కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపసంహరించగానే జనం కొనుగోళ్లను కూడా నిలిపివేశారు. ఈ పరిణామం సర్కోజీ సర్కార్‌ను కుదిపేస్తోంది. రుణభారాన్ని తగ్గించేందుకు, బడ్జెట్‌లోటును కుదించేందుకు చర్యలు తీసుకుంటామని ట్రిపుల్‌ ఏలతో ఉన్న తమ పరపతికి ఎలాంటి ఢోకా లేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు అధ్యక్షుడు సర్కోజీ సర్కస్‌ ఫీట్లు చేస్తున్నాడు. దానిలో భాగంగానే ప్రభుత్వ బాండ్లను తక్కువ రేట్లకు విక్రయించటాన్ని పదిహేను రోజుల పాటు నిషేధించాడు. ఇటలీ, స్పెయిన్‌, బెల్జియం కూడా ఇవే చర్యలను తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితి మార్కెట్‌లో తలెత్తటం అంటే ప్రభుత్వ సమర్థతపై విశ్వాసం కోల్పోవటానికి సూచిక.

ఐరోపా యూనియన్‌లో జర్మనీ తరువాత ఫ్రాన్స్‌ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు భావిస్తారు. అక్కడ నిరుద్యోగం 9.2శాతం కాగా, యువతలో అది 22.8శాతం కావటం గమనార్హం. ఫ్రాన్స్‌లో పెద్ద బ్యాంకుల్లో మూడవదైన సొసైటీ జనరల్‌ షేర్ల ధరలు జూలై రెండవ వారం నుంచి ఇప్పటివరకు 40శాతం పడిపోవటం ప్రమాద సూచిక. ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించి కంపెనీల వాటాలు, వస్తువుల ధరలపై లావాదేవీలు జరపటాన్ని ఆర్థిక పరిభాషలో డెరివేటివ్స్‌ అంటారు. ఇది పెద్ద జూదం. దీనిలో సొసైటీ జనరల్‌ది పెద్ద చేయి. అమెరికా సెక్యూరిటీల డెరివేటివ్స్‌ తనఖా లావాదేవీల్లో 67 వేల కోట్ల డాలర్లు పోగొట్టుకొని చేతులు కాల్చుకుంది. అయితే అమెరికా సర్కార్‌ ఆదుకోవటంతో అది నష్టాల నుంచి బయట పడింది. ఇప్పుడు ఫ్రెంచి సర్కార్‌ ఈ బ్యాంకును కాపాడేందుకు రంగంలోకి దిగింది. ఈ బ్యాంకే పోర్చుగల్‌, ఐర్లండ్‌, గ్రీస్‌, స్పెయిన్‌ సర్కార్లను ఆదుకొనేందుకు 1820 కోట్ల యూరోలు, ఫ్రెంచి సర్కారుకు 1920 కోట్ల యూరోల రుణం ఇచ్చింది. ఫ్రాన్స్‌లో రుణ సంక్షోభ ఛాయలు కనిపించటంతో వంద రూపాయల ఆదాయమైతే ఇప్పటికే 120 రూపాయల అప్పుల పాలైన ఇటలీ కూడా ఉలిక్కి పడుతోంది. రానున్న రెండు సంవత్సరాలలో 6,500 కోట్ల డాలర్ల మేరకు అదనంగా పొదుపు చర్యలు చేపట్టాలని శుక్రవారం నాడు బెర్లుస్కోనీ సర్కార్‌ నిర్ణయించింది. మతేతరమైన అనేక సెలవురోజుల రద్దు, స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేవారి సంఖ్య పరిమితం చేయటం, పన్నులు పెంచటం వంటి చర్యలను ప్రకటించింది. సంక్షోభంలో ఉన్న గ్రీస్‌ను ఆదుకోవటం, మిగతా దేశాల పతనాన్ని ఎలా నిలబెట్టాలా అని మదన పడుతున్న ఐరోపా యూనియన్‌కు ఫ్రెంచి పరిణామం ఊహించని దెబ్బ. ఒక దగ్గర పడిన చిల్లుకు మాసిక వేసిన మరుక్షణమే మరోచోట పడిపోతోంది. దివాళాకోరు పెట్టుబడిదారీ విధానాలను, ప్రపంచాధిపత్యం కోసం యుద్ధాలను రుద్దుతున్న ధనిక దేశాలే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా అమెరికా, ఐరోపా యూనియన్‌ సంక్షోభానికి ప్రపంచం కూడా మూల్యం చెల్లించాల్సి రావటమే ఆందోళన కలిగించే అంశం.

***Article From prajasakti Editorial  www.prajasakti.com

Sunday, August 14, 2011

చరిత్ర బురుజుపై స్వతంత్ర పతాక

ఎర్రకోటను మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ పాతఢిల్లీలో యమునానది ఒడ్డున 17వ శతాబ్దంలో నిర్మించాడు. లాల్‌ ఖిల్లా అప్పట్లో చక్రవర్తి కుటుంబ నివాసంగా వుండేది. చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ను బ్రిటిష్‌వారు దేశ బహిష్కరణ చేసేవరకు అంటే 1857 వరకు మొఘలుల రాజధాని నగరం కూడా అదే. షాజహాన్‌ 1638లో ప్రారంభించిన ఈ కోట నిర్మాణం తొమ్మిదేళ్లపాటు సాగింది. ఔరంగజేబు, ఆ తర్వాత మొఘల్‌ పాలకులు కోటకు అనేక కొత్త అందాలు అద్దారు

 ఎర్రకోట పర్షియన్‌, యూరోపియన్‌, ఇండియన్‌ కళల కలబోతగా వుంటుంది. ఖిల్లా ప్రతి అంగుళంలోనూ కళాకారుల పనితనం కనిపిస్తుంది. భారతదేశంలోని అత్యంత ప్రధానమైన నిర్మాణాల్లో ఎర్రకోట ఒకటి. భవన నిర్మాణ కౌశలానికి, శక్తికి ఈ కోట నిదర్శనం. నిర్మాణంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగా వుంటుంది. ఈ కోట లోపలి స్థలము 6 లక్షల చదరపు గజాలుంటుంది. గోడల యెత్తు 35 గజాలు. కోట చుట్టూ 24 గజాల వెడల్పు, 20 గజాల లోతుగల కందకం తవ్వబడింది. ఈ కోట నిర్మాణానికి అప్పుడే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. లోపలి భవనాల నిర్మాణానికి మరో 50 లక్షల రూపాయలైంది. కట్టడాల నిర్మాణం ఎంతో అందంగా, ఉన్నతంగా వుంటుంది. విశాలమైన భవనాలు, వాటి చుట్టూ అందమైన తోటలు, స్నానాల గదులు...రాచరికానికి నిలువెత్తు నిదర్శనంగా గోచరిస్తాయి. ఇంతటి అపురూపమైన కోట కాలక్రమంలో ఎన్నో దాడులకు గురై తన సౌందర్యాన్ని చాలా వరకు కోల్పోయిందనే చెప్పాలి. మహారాజసం వుట్టిపడే ఈ కోట ఒకప్పుడు మహాకవులు, కళాకోవిదులతో కళకళలాడిపోయేది. కవితా కళాకుసుమాలు వికసించేవి. ముస్లింల ఈద్‌ సందర్భంగా, హిందువుల దీపావళి వంటి పండుగల సందర్భంగా పాదుషాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రజల ఆనందంలో పాలుపంచుకొనేవారు

మొఘల్‌ వంశపు చివరి రాజైన బహదూర్‌ షా 1837 సెప్టెంబర్‌ 27వ తేదీన ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. అయితే అప్పటినుంచే బ్రిటిషు ప్రభుత్వం అతని పతనానికి కుట్రలు పన్నసాగింది. ఎన్నో రాజకీయ, ప్రతికూల క్లిష్ట పరిస్థితుల్లో బహదూర్‌ పట్టాభిషేకం జరిగిందనుకోవాలి. 1857లో మొదటిసారిగా మీరట్‌లో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేయబడింది. సైన్యంలో బెంగాల్‌ ఆర్మీ రెజిమెంట్‌కు చెందిన సైన్యాధికారి మంగల్‌పాండే ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించి గొప్ప సంక్షోభాన్ని సృష్టించాడు. బ్రిటిషు సైన్యం ఆ అధికారిని హతమార్చి తిరుగుబాటును అణచివేయాలని చూసింది. కానీ అతను చనిపోయినా అతను రగిల్చిన తిరుగుబాటు జ్వాలలు చల్లారలేదు. మరింతగా భగ్గుమన్నాయి. తిరుగుబాటు సైన్యం ఎర్రకోటలోకి ప్రవేశించి బహదూర్‌షా ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా వున్నామంది. లాల్‌ ఖిల్లాలో ప్రతి కీలక ప్రాంతంలోను ఆయుధధారులైన సైనిక కేంద్రాలను సన్నద్ధం చేశారు. పోరాటం కూడా ఉధృతం చేయబడింది. బ్రిటిష్‌ సైన్యం మరింత అప్రమత్తమై అణచివేతను కఠినంగా అమలు జరిపింది. ఆ పోరాటంలో మూడు వేల మందికి పైగా దేశభక్తులను ఉరితీశారు. వేలాదిమందిని కాల్చిచంపారు. లక్షలాదిమంది సైనికుల ప్రాణాలు ఫిరంగుల ధాటికి గాలిలో కలిసిపోయాయి. ఇటువంటి అనేక పోరాటాల చరిత్ర కలిగిన ఎర్రకోటను చూడగానే దేశభక్తులైన ప్రతి భారతీయుడి హృదయం అలనాటి చారిత్రక స్మృతులతో బరువెక్కిపోతుంది. ఉద్వేగభరితమౌతుంది.

వివిధ చారిత్రిక దశల్లో స్వతంత్రంకోసం పోరాడిన ఎందరో వీరులను, ఈ కోటలోనే బంధించి ఉరితీశారు. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌పైన విచారణ జరిపిందీ ఇక్కడే. ఈ ఎర్రకోటపైనే బ్రిటిష్‌ పాలకుల పతాకం అనేక సంవత్సరాలు రెపరెపలాడి, భారత ప్రజల బానిస బతుకుల్ని అవహేళన చేసింది. ఎందరో దేశ భక్తులైన ధీరహృదయులు, కవులు, కళాకారులు, ప్రభువులు, బ్రిటిషు ప్రభుత్వ దారుణ శిక్షలకు గురై అమరవీరులయ్యారు. అయితే ఎర్రకోట మహోన్నత వైభవం మహోజ్వలంగా ప్రకాశించి దశదిశలను కాంతివంతం చేసిన రోజుల గురించి కూడా మనం చరిత్రలో చూస్తాం. సుదీర్ఘ కాలం పాటు ఈ కోట నుంచి వెలువడిన ఆజ్ఞలు యావత్‌ భారత దేశాన్ని శాసించాయి. దీని వైభవ ప్రాభవాలకు తల వంచని శక్తి ఏదీ ఆనాడు దేశంలో వుండేది కాదు. అలాంటి చోటనే 27 జనవరి 1858వ సంవత్సరంలో కడపటి భారత చక్రవర్తి, సుప్రసిద్ధ దేశభక్తుడు అయిన బహదూర్‌ షా జఫర్‌ ఒక సాధారణ నేరస్థుడిగా నిర్బంధితుడై బ్రిటిషు పరిపాలకుల ఎదుట విచారణకు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కేసు విచారణ కోట భవనాల సముదాయంలోని ఒకప్పటి ఆయన న్యాయ దర్బారు 'దర్బారె ఖాస్‌'లో జరిగింది. ఇదే ప్రదేశంలో ఒకానొక రోజుల్లో జఫర్‌ ఆజ్ఞలు నిర్విఘ్నంగా అమలయ్యేవి. అలాంటి చోటనే జఫర్‌ నేరస్థుడుగా నిరూపించబడటం చరిత్ర గతికి ఒక తార్కాణం. బ్రిటిష్‌ పాలకులు ఆయనకు దేశ బహిష్కరణ శిక్ష విధించి రంగూన్‌ పంపారు. ఆ విధంగా 1862వ సంవత్సరంతో అక్కడే ఢిల్లీ సార్వభౌమత్వపు ఆఖరి వెలుగు కొడిగట్టిపోయింది.
బ్రిటిష్‌వారి కాలంలో కోటను ప్రధానంగా సైనిక శిబిరంగానే ఉపయోగించారు. స్వాతంత్య్రానంతరం కూడా 2003 వరకు కోటలో ప్రధాన భాగం భారత సైన్యం అధీనంలోనే వుంది. ఐరాస సాంస్కృతిక విభాగమైన యునెస్కో 2007లో ఎర్రకోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.


మువ్వన్నెల రెపరెపలు
 
మనదేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు చిహ్నమైన మువ్వన్నెల జండా గురించి చెప్పుకోవాలంటే... త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య. మన తెలుగువాడే. ఆయన సృజించిన జాతీయ పతాకంలో మూడు రంగులుంటాయి. కాషాయం, ఆకుపచ్చ, తెలుపు. ఈ మువ్వన్నెలు కేవలం మూడు రంగుల కలయికే కాదు. ఇది మన సంస్కృతి, ఐక్యత, సంప్రదాయాల కలయిక. జాతీయ జండా సైజు 3:2 వుండాలి. పై భాగంలో కాషాయం, కింది భాగంలో హరిత వర్ణం, మధ్యలో శ్వేత వర్ణం వుండాలి. మధ్య భాగంలో నీలి రంగులో అశోక చక్రం వుంటుంది. ఇందులో 24 గీతలుంటాయి. ప్రారంభంలో జాతీయ పతాకాన్ని గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే ఆవిష్కరించేవారు. తర్వాత అన్ని రోజుల్లోను మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయవచ్చని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం, సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గణతంత్ర దిన్సోతవం నాడు దేశ రాష్ట్రపతి సైనిక దళాల వందనం స్వీకరిస్తారు.
1948 ఆగస్టు 15వ తేదీన మొదటిసారిగా నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దేశ రాజధాని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచే స్వాతంత్య్రదినోత్సవం నాడు ఎర్రకోటపై జాతీయజండాను ఆవిష్కరించే సంప్రదాయం ప్రారంభమైంది. అలాగే దేశాధ్యక్షుని ముందర మన దేశ సైనిక ప్రతిభాపాటవాల ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏటా ఒక దేశాధినేత ముఖ్య అతిథిగా పాల్గొంటారు.


పతాక నియమాలివే!

అయితే మువ్వన్నెల పతాకాన్ని అగౌరవపరచకుండా కొన్ని నియమనిబంధనలు పెట్టింది మన ప్రభుత్వం. వాటి ప్రకారం చిరిగిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకూడదు. జండాను తిరగవేసి ఎగరేయకూడదు. కార్లమీద పరవకూడదు. వ్యక్తిగత వస్త్రాలపై త్రివర్ణ పతాకాన్ని ముద్రించకూడదు. దిళ్లు, చేతి రుమాళ్లు, నేప్కిన్ల మీద మువ్వన్నెల జండాను కుట్టకూడదు. జండాపై ఎటువంటి అక్షరాలను రాయకూడదు. కేంద్రం అనుమతి లేకుండా వాహనాలపై ఎగరేయకూడదు. రైళ్లు, వాహనాల ముందు, వెనక తగిలించకూడదు. మూడు రంగుల బట్ట ముక్కలను కలిపి ఒక పతాకంలాగా చేయకూడదు. పతాకాన్ని నేల మీదగానీ, నీటిలోగానీ పడనివ్వకూడదు. ప్రభుత్వ, సైనిక అంత్యక్రియల సందర్భంలో మినహా మరెక్కడా ఉపయోగించకూడదు. కాళ్లతో తొక్కడం, తగలబెట్టడం కూడా చేయకూడదు. ఒకవేళ పతాకం పాడైపోతే దాన్ని సగౌరవంగా గంగాజలంలో వదిలేయడంగానీ, మట్టిలో పూడ్చిపెట్టడంకానీ చేయాలి.
పతాకావిష్కరణ ఎలా? ఎక్కడీ
మువ్వన్నెల జెండా ఎగరేసిన చోట దానికి ప్రత్యేక గౌరవ స్థానం కల్పించాలి. ప్రభుత్వ భవనాలపై ఎగరేసినప్పుడు సెలవు దినాలతో సంబంధం లేకుండా అన్ని రోజుల్లోను పతాకం రెపరెపలాడుతూనే వుండాలి. ఇందుకు సూర్యోదయ - సూర్యాస్తమయాలు, వాతావరణాలతో కూడా సంబంధం వుండదు. దేశాధినేతలు కాలం చేసినప్పుడు వారి గౌరవార్ధం జాతీయ పతాకాన్ని కొంతసేపు కిందికి దించుతారు. పతాకాన్ని ఎగరవేసేప్పుడుగానీ, దించేప్పుడుగానీ ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. అలాగే పెరేడ్‌లో జాతీయ పతాకం వున్న వాహనం వస్తున్నప్పుడు కూడా గౌరవార్థం లేచి నిలబడాలి. హైకోర్టులు, సెక్రటేరియట్‌ కమిషనర్‌ కార్యాలయం, కలెక్టరేట్లు, జైళ్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దులు, కస్టమ్‌ పోస్టులు, చెక్‌ పోస్టులు, ఔట్‌ పోస్టులు, ఇతర ప్రత్యేక స్థలాల్లో కూడా జాతీయ పతాకాన్ని ఎగరేయవచ్చు. ఇవికాక విమానాశ్రయాలు, సరిహద్దు పహారా, అంతర్జాతీయ జలాల సమీపంలో వున్న లైట్‌ హౌస్‌లు దగ్గర కూడా ఎగరేయవచ్చు. దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్లు, లెఫ్టెనెంట్‌ గవర్నర్ల అధికార నివాసాల్లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించవచ్చు. అదేవిధంగా దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏదైనా సంస్థను సందర్శించినప్పుడు వారి గౌరవార్థం పతాకావిష్కరణ చేయవచ్చు. విదేశీ దేశాధినేతలు, యువరాజులు, రాజులు, ప్రధానమంత్రులు భారత దేశాన్ని సందర్శించినప్పుడు మన జాతీయ పతాకంతోపాటుగా సదరు ప్రముఖుల జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరించవచ్చు. భారత దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్లు, లెఫ్టనెంట్‌ గవర్నర్లు, ప్రధానమంత్రులు, క్యాబినెట్‌ మంత్రులు, స్పీకర్‌, భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకునే అవకాశం వుంది. మన దేశ ప్రధాని, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఏదైనా ప్రత్యేక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్‌ బోగీలో జాతీయ పతాకాన్ని వుంచవచ్చు. ఈ పతాకం రైల్వే ప్లాట్‌ఫారమ్‌కు అభిముఖంగా వుండాలి.
ఒకరోజు దేశభక్తులు!
స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న కాలంలో జాతీయ జెండా ఎగరేయడం పెద్ద ధిక్కార చర్య. పోలీసుల కళ్లు గప్పి దేశ భక్తులు ఎలాగో పైకి ఎక్కేసి తూటాలు ఒళ్లు చీరేస్తున్నా జండా ఎగరేస్తుండేవారు. ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ గర్వాల్‌లో ఆ విధంగా జెండా ఎగరేసిన ఘటన చాలా ఉత్తేజకరమైంది. ప్రీతిలతా వడేదార్‌ కూడా అలా ఎగరేస్తూనే పోలీసుల కాల్పులకు గురైంది. ఝండా వూంఛే రహా హమారా అన్నది ఒక పెద్ద నినాదం.
దేశ స్వాతంత్య్రం తర్వాత మాత్రం క్రమేణా జెండా పండుగ తీరు తెన్నులు మారిపోయాయి. ప్రజల దైనందిన జీవిత సమస్యలు పెరుగుతున్న కొద్ది ప్రభుత్వాలు అసంతృప్తి మూటగట్టుకున్న కొద్ది స్వాతంత్య్ర దినోత్సవం మొక్కుబడిగా మారిపోతున్నది. ఆ పోరాట కాలం నాటి త్యాగాలు ఆశయాలకు తిలోదకాలిచ్చిన పాలక వర్గ నేతలు ప్రజలలో నిరుత్సాహం నింపడంతో దేశ భక్తి సంప్రదాయాలకు కూడా ముప్పు ఏర్పడింది. ఇప్పుడు ఆగష్టు 15 అనేది అధికార లాంఛనాలకు రాజకీయ పటాటోపానికి ఆలవాలమై సజీవ చైతన్యం సన్నగిల్లింది.

ఆగష్టు 15 సందడి ప్రధానంగా పిల్లలదే. ఆ రోజు స్కూళ్లలో జెండా ఎగరేయడం, ఉపన్యాసాలు అలా వుంచితే ఆటలు పాటల పోటీలు వంటివి జరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం మిఠాయిలు కనీసం చాక్లెట్లు పంచి పెడతారు.అసంఖ్యాకమైన పేద, మధ్య తరగతి పిల్లలకు ఇది కూడా అపురూపమే గనక 'జెండా పండుగ' అని మురిసిపోతుంటారు. చిన్న చిన్న జెండాలు కూడా చేతపట్టుకుని లేదా బాడ్జీలు పెట్టుకుని గొప్పగా భావించుకుంటారు.
ఇక నాయక గణాల విషయానికొస్తే జెండా ఎగరేయడం వారికి హోదాకు సంబంధించిన విషయం. కలెక్టర్లు పోలీసుల అధికారులతో పాటు మంత్రులు తము చూస్తున్న జిల్లాల్లో జెండా ఎగరేస్తారు. ప్రజా ప్రతినిధులు కూడా వారి ఉత్సాహాన్ని బట్టి జెండా వందనం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ అధికార తతంగాలను పక్కనబెడితే ఆర్భాటాలకు హంగు దర్పాలకు ఆ సందర్బాన్ని వాడుకోవడం కద్దు. కారులు బారులు తీరించి వీలైనన్ని చోట్ల జండాలు ఎగరేస్తే తమ పట్టు చాటుకోవచ్చన్న ధోరణి చాలా పట్టణాలలో ఛోటా మోటా నాయకులకు పెరిగింది. పార్టీల వారిగా కూడా తాత్కాలిక దిమ్మలు ఏర్పాటు చేసి- అంటే డ్రమ్ములో ఇసుక పోసి మధ్యలో జెండా పాతి సాయంత్రం వరకూ సంరంభం చేస్తారు.ఈ ఒకరోజు దేశభక్తి ముగిశాక మరురోజు షరా మామూలే!
పాడవోయి భారతీయుడా!
పదిమందికి సంబంధించిన ఏ ఉత్సవమైనా పాటలు లేకపోతే అసంపూర్ణమే. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా అనేక దేశభక్తి గీతాలు మార్మోగుతాయి. అన్నిట్లోకి ఎక్కువగా వినిపించేది పాడవోయి భారతీయుడా! అన్న శ్రీశ్రీ పాట. 'వెలుగు నీడలు' చిత్రంలోని ఈ పాట అర్థవంతంగానూ సమస్యల ప్రస్తావనతోనూ ఇప్పటికి నిత్యనూతనంగా విరాజిల్లుతున్నది. ఏ వీధిలో చూసినా ఆ పాటతోనే మొదలవుతుంది. మన సినిమాల్లో దేశభక్తి గీతాలు ఒకప్పుడు ఎక్కువగా వుండేవి. ఏదో ఒక వీలు చూసుకుని అలాంటి పాట జొప్పించేసేవారు. అంతర్నాటకాల రూపంలోనూ దేశభక్తి ప్రబోధం, గాంధీ నెహ్రూలను చూపించడం జరగుతుండేది. భారత మాతకు జేజేలు, మన జన్మభూమి బంగారు భూమి లాంటి పాటలు కూడా వినిపిస్తాయి. సినిమా పాటలను అటుంచితే దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన 'జయజయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి' అన్న పాట కూడా జాతీయ గీతంలాగే ప్రసిద్ధమైంది. నాడు తిలక్‌ మహాశయుని నోట మార్మోగిన నినాదంతో 'స్వాతంత్రమే నా జన్మహక్కని చాటండి' వంటి పాటలు కూడా ఆ రోజున వినిపిస్తాయి. ఘంటసాల గానం చేసిన పద్యాలు 'అమ్మా సరోజినీ దేవి' వంటివి కూడా వేస్తుంటారు. ఇటీవలి కాలంలోనైతే వందేమాతరం గీతం రహ్మాన్‌ కట్టిన రాగంలో మార్మోగుతుంటుంది. 'పుణ్యభూమి నా దేశం నమోనమామి' మరీ తప్పనిసరి. భారతీయుడు చిత్రంలోనూ జండా ఎగరేసే సన్నివేశంతో పాటు స్వాతంత్ర దిన సంబరాలను చిత్రించే పాట కూడా వీటిలో ఒకటిగా వినిపిస్తుంది. ఎన్‌డిఎ హయాంలో కార్గిల్‌ తరహా దేశభక్తి దశలోనూ 'ఖడ్గం, జై' వంటి చిత్రాల్లో మరో తరహా దేశభక్తిని గుప్పించే పాటలుంటాయి. అన్నిటినీ మించి 'అల్లూరి సీతారామరాజు' పాటలు, 'భలేతాత మన బాపూజీ' వంటి పాటలు కూడా ఆ రోజున వింటాము. రేడియోలోనూ టీవీల్లోనూ తెల్లవారక ముందునుంచి చెవుల తుప్పు వదిలిపోయేలా ఇలాంటి పాటలే దంచి కొట్టడం అనివార్యం. చంద్రునికో నూలుపోగులా దేశానికి ఆగష్టు 15న అందించే నివాళి ఇది.


*********Article From Prajasakti Written By K.Sahil  www.prajasakti.com





Thursday, August 11, 2011

మండుతున్న బ్రిటన్‌

ఇటీవల లండన్‌లో పోలీసులు మార్క్‌ డగ్గన్‌ అనే 29 సంవత్సరాల ఆఫ్రో కరీబియన్‌ యువకుడ్ని కాల్చి చంపటంతో ప్రారంభమైన అల్లర్లు మూడు రోజుల్లో బ్రిటన్‌ అంతటికీ విస్తరించాయి. లండన్‌లో ప్రారంభమైన నిరసన దావానలంలా ఆ దేశంలోని ఇతర నగరాలకు పాకింది. మంగళవారంనాడు బర్మింగ్‌హాం, లివర్‌పూల్‌, బ్రిస్టల్‌, నాటింగ్‌హామ్‌, మాంచెస్టర్‌ తదితర నగరాల్లో నిరసనలు దొమ్మీలు, లూటీల రూపం తీసుకున్నాయి. ఒక్క లండన్‌ నగరంలోనే మంగళవారం నాడు 16 వేల మంది పోలీసులను దించారు. సోమవారం విధుల్లో ఉన్న వారి సంఖ్యకు ఇది దాదాపు మూడు రెట్లు. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు.వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. మార్క్‌ డగ్గన్‌ను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన పోలీసులు అతడే తమపై కాల్పులు జరిపాడని బుకాయించడంతో దక్షిణ లండన్‌లో కొద్దిమంది యువతీ యువకులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన ప్రారంభించారు. ఆ చిన్న నిరసనను సైతం పోలీసులు సహించకుండా తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. ఇది ప్రజాగ్రహానికి కారణమై నిరసనలు పెల్లుబికాయి. క్రమంగా అల్లర్లు, ఘర్షణలు స్థాయికి చేరాయి. కొన్నిచోట్ల లూటీలు సైతం సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో, నిరసనల్లో యువతే అధికంగా ఉన్నారు. వారిలో శ్వేతజాతీయులు గణనీయంగా ఉన్నారని పోలీసులు సైతం చెబుతున్నారు. అంటే వీటిని జాత్యహంకారానికి సంబంధించిన అల్లర్లుగా చెప్పడం ముమ్మాటికీ తప్పు. కానీ కార్పొరేట్‌ మీడియా రోజురోజుకూ ఆ నిరసనోద్యమాన్ని జాత్యహంకార అల్లర్లు, లూటీలుగా ప్రచారం చేస్తోంది. మంగళవారం నాడు బర్మింగ్‌హాంలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. షహజాద్‌, హారీహుస్సేన్‌ సోదరులు తన మిత్రుడైన ముసావెర్‌ ఆలీతో కలిసి తమ నివాస ప్రాంతంలో ఉండగా ఒక శ్వేతజాతీయుడు కారును వేగంగా నడుపుతూ వారిని ఢకొీట్టడంతో ముగ్గురూ మరణించారు. వారు రోడ్డుకు అడ్డంగా గానీ, మార్గ నిరోధకంగా గానీ లేనే లేరని పోలీసు అధికారులు కూడా నిర్ధారించారు. ఆ శ్వేతజాతీయుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు కానీ అరెస్టు చేయలేదు. మీడియా చేసిన దుష్ప్రచారంతో కూడా కొంతమంది ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతుండవచ్చు.

           ప్రతిష్టాత్మకమైన లండన్‌ ఒలింపిక్స్‌ 2012 ద్వితీయార్థంలో జరగనున్నాయి. ఒక్క ఏడాది ముందు ఇంత విస్తృత స్థాయిలో ఘర్షణలు సాగడం తీవ్రమైన విషయం. బ్రిటన్‌ ప్రతిష్టకు ఇది దెబ్బే! ప్రస్తుతం బర్మింగ్‌హాంలో భారత్‌, ఇంగ్లండ్‌ టీమ్‌ల మధ్య క్రికెట్‌ టెస్ట్‌ జరుగుతోంది. ఘర్షణలతో ఆట ఆగలేదు. అయితే ఇలాంటి అల్లర్లే భారత్‌లో జరిగి ఉంటే ఇంగ్లండ్‌ టీమ్‌ మూటాముల్లె సర్దుకొని పోయేవారన్న భారతీయ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాట అక్షర సత్యం. 2008లో ముంబయి దాడులు జరిగిన సందర్భంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ చర్యనుబట్టే గవాస్కర్‌ అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. ఇప్పుడు బ్రిటన్‌లో మన క్రీడాకారులు నిబ్బరంగా ఉండడం మంచి విషయం. ఈ నిరసనల సెగకు ఇటలీలో సెలవులు 'అనుభవిస్తున్న' బ్రిటన్‌ దేశాధ్యక్షుడు డేవిడ్‌ కామెరాన్‌ పర్యటనను కుదించుకొని వెనక్కి వెళ్లారు. ప్రస్తుతం వేసవి సెలవులయినప్పటికీ పరిస్థితిని చర్చించడానికి అత్యవసరంగా పార్లమెంట్‌ సమావేశాన్ని గురువారం జరపనున్నారు. పెట్టుబడిదారీ దేశాలన్నింటా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల కారణంగా ప్రజా సంక్షేమం నానాటికీ అడుగంటుతోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ఆదర్శ ప్రాయమైనదిగా చెప్పబడే బ్రిటన్‌ వైద్య రంగంలో సైతం సంక్షేమానికి కోతపెట్టడానికి టోరీ ప్రభుత్వం సిద్ధపడింది. ఇతర రంగాల్లోనూ సంక్షేమ వ్యయాన్ని కత్తిరిస్తున్నారు. 2015 నాటికి ప్రభుత్వ వ్యయంలో 8 వేల కోట్ల పౌండ్లు (ఆరు లక్షల కోట్ల రూపాయలు) కోత విధించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే కత్తిరింపులు మొదలయ్యాయి. మార్క్‌ డగ్గన్‌ను కాల్చి చంపిన దక్షిణ లండన్‌లోని టోటెన్‌హాం ప్రాంతంలో యువజన సర్వీసులకిచ్చే బడ్జెట్‌లో 75 శాతం కోతపెట్టారు. ఆ ప్రాంతంలో నిరుద్యోగిత 20 శాతం నమోదయ్యింది. సంక్షేమ బడ్జెట్‌ కోత పడడంతో యువతీ యువకుల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగింది. బ్రిటన్‌ ప్రజల్లో ముఖ్యంగా యువతలో అసంతృప్తి జ్వాలలు రగలడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అసంతృప్తులను, అసమ్మతులను అణిచివేసేందుకు ఉపయోగించే పోలీసుల్లోనూ అసంతృప్తి చోటు చేసుకుంటోంది. పొదుపు చర్యల్లో భాగంగా టోరీ ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల్లో 34 వేల పోలీసు ఉద్యోగుల పోస్టులను రద్దుచేయ నిర్ణయించింది. పోలీసు బడ్జెట్‌లో 20 శాతం కోత విధించింది. మీడియాను సైతం టోరీ పాలన వదిలిపెట్టలేదు. ఆ దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ అయిన బిబిసికి ప్రభుత్వం నుంచి ఇచ్చే కేటాయింపులకు కోతపెట్టింది. అందుకు నిరసనగా గడిచిన రెండు నెలల్లోనే బిబిసి పాత్రికేయులు రెండుసార్లు సమ్మె చేశారు. ఇలా బ్రిటన్‌లోని వివిధ వర్గాలు, తరగతులకు చెందిన ప్రజానీకం ప్రభుత్వ చర్యలతో అసంతృప్తి చెందాయి. అదే చినుచినుకు చేరి మహా ప్రవాహంలా మారిన రీతిన ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో అల్లర్లు, ఘర్షణల రూపంలో నిరసనోద్యమాలు సాగుతున్నాయి. పోలీసు బలంతోనూ, అధికార మదంతోనూ నిరసనలను టోరీ ప్రభుత్వం అణిచివేయవచ్చు. కానీ ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మిగిలిపోతుంది. నిరసనలకు మూల కారణమైన ఉదారవాద ఆర్థిక విధానాలను అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదా కనీసం ఆ వేగాన్ని తగ్గించాలి. అప్పుడే బ్రిటన్‌లో మంటలు చల్లారుతాయి. కాకపోతే చింకి గుడ్డకు మాసికలు వేస్తే దానిపక్కనే మరో చిరుగు పడుతుందన్న తీరున ఆ సమాజం అతలాకుతలం అవుతుందని బ్రిటన్‌ పాలకులు అలాంటి విధానాలను తలకెత్తుకొన్న దేశాల ఏలికలు గుర్తెరగాలి.

*****Article From Prajasakti Paper www.prajasakti.com