ఇటీవల లండన్‌లో పోలీసులు మార్క్ డగ్గన్ అనే 29 సంవత్సరాల ఆఫ్రో కరీబియన్ యువకుడ్ని కాల్చి చంపటంతో ప్రారంభమైన అల్లర్లు మూడు రోజుల్లో బ్రిటన్ అంతటికీ విస్తరించాయి. లండన్‌లో ప్రారంభమైన నిరసన దావానలంలా ఆ దేశంలోని ఇతర నగరాలకు పాకింది. మంగళవారంనాడు బర్మింగ్‌హాం, లివర్‌పూల్, బ్రిస్టల్, నాటింగ్‌హామ్, మాంచెస్టర్ తదితర నగరాల్లో నిరసనలు దొమ్మీలు, లూటీల రూపం తీసుకున్నాయి. ఒక్క లండన్ నగరంలోనే మంగళవారం నాడు 16 వేల మంది పోలీసులను దించారు. సోమవారం విధుల్లో ఉన్న వారి సంఖ్యకు ఇది దాదాపు మూడు రెట్లు. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు.వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. మార్క్ డగ్గన్‌ను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన పోలీసులు అతడే తమపై కాల్పులు జరిపాడని బుకాయించడంతో దక్షిణ లండన్‌లో కొద్దిమంది యువతీ యువకులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన ప్రారంభించారు. ఆ చిన్న నిరసనను సైతం పోలీసులు సహించకుండా తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. ఇది ప్రజాగ్రహానికి కారణమై నిరసనలు పెల్లుబికాయి. క్రమంగా అల్లర్లు, ఘర్షణలు స్థాయికి చేరాయి. కొన్నిచోట్ల లూటీలు సైతం సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో, నిరసనల్లో యువతే అధికంగా ఉన్నారు. వారిలో శ్వేతజాతీయులు గణనీయంగా ఉన్నారని పోలీసులు సైతం చెబుతున్నారు. అంటే వీటిని జాత్యహంకారానికి సంబంధించిన అల్లర్లుగా చెప్పడం ముమ్మాటికీ తప్పు. కానీ కార్పొరేట్ మీడియా రోజురోజుకూ ఆ నిరసనోద్యమాన్ని జాత్యహంకార అల్లర్లు, లూటీలుగా ప్రచారం చేస్తోంది. మంగళవారం నాడు బర్మింగ్‌హాంలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. షహజాద్, హారీహుస్సేన్ సోదరులు తన మిత్రుడైన ముసావెర్ ఆలీతో కలిసి తమ నివాస ప్రాంతంలో ఉండగా ఒక శ్వేతజాతీయుడు కారును వేగంగా నడుపుతూ వారిని ఢకొీట్టడంతో ముగ్గురూ మరణించారు. వారు రోడ్డుకు అడ్డంగా గానీ, మార్గ నిరోధకంగా గానీ లేనే లేరని పోలీసు అధికారులు కూడా నిర్ధారించారు. ఆ శ్వేతజాతీయుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు కానీ అరెస్టు చేయలేదు. మీడియా చేసిన దుష్ప్రచారంతో కూడా కొంతమంది ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతుండవచ్చు.
ప్రతిష్టాత్మకమైన లండన్ ఒలింపిక్స్ 2012 ద్వితీయార్థంలో జరగనున్నాయి. ఒక్క ఏడాది ముందు ఇంత విస్తృత స్థాయిలో ఘర్షణలు సాగడం తీవ్రమైన విషయం. బ్రిటన్ ప్రతిష్టకు ఇది దెబ్బే! ప్రస్తుతం బర్మింగ్‌హాంలో భారత్, ఇంగ్లండ్ టీమ్‌ల మధ్య క్రికెట్ టెస్ట్ జరుగుతోంది. ఘర్షణలతో ఆట ఆగలేదు. అయితే ఇలాంటి అల్లర్లే భారత్‌లో జరిగి ఉంటే ఇంగ్లండ్ టీమ్ మూటాముల్లె సర్దుకొని పోయేవారన్న భారతీయ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట అక్షర సత్యం. 2008లో ముంబయి దాడులు జరిగిన సందర్భంలో ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ చర్యనుబట్టే గవాస్కర్ అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. ఇప్పుడు బ్రిటన్‌లో మన క్రీడాకారులు నిబ్బరంగా ఉండడం మంచి విషయం. ఈ నిరసనల సెగకు ఇటలీలో సెలవులు 'అనుభవిస్తున్న' బ్రిటన్ దేశాధ్యక్షుడు డేవిడ్ కామెరాన్ పర్యటనను కుదించుకొని వెనక్కి వెళ్లారు. ప్రస్తుతం వేసవి సెలవులయినప్పటికీ పరిస్థితిని చర్చించడానికి అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాన్ని గురువారం జరపనున్నారు. పెట్టుబడిదారీ దేశాలన్నింటా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల కారణంగా ప్రజా సంక్షేమం నానాటికీ అడుగంటుతోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ఆదర్శ ప్రాయమైనదిగా చెప్పబడే బ్రిటన్ వైద్య రంగంలో సైతం సంక్షేమానికి కోతపెట్టడానికి టోరీ ప్రభుత్వం సిద్ధపడింది. ఇతర రంగాల్లోనూ సంక్షేమ వ్యయాన్ని కత్తిరిస్తున్నారు. 2015 నాటికి ప్రభుత్వ వ్యయంలో 8 వేల కోట్ల పౌండ్లు (ఆరు లక్షల కోట్ల రూపాయలు) కోత విధించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే కత్తిరింపులు మొదలయ్యాయి. మార్క్ డగ్గన్‌ను కాల్చి చంపిన దక్షిణ లండన్‌లోని టోటెన్‌హాం ప్రాంతంలో యువజన సర్వీసులకిచ్చే బడ్జెట్‌లో 75 శాతం కోతపెట్టారు. ఆ ప్రాంతంలో నిరుద్యోగిత 20 శాతం నమోదయ్యింది. సంక్షేమ బడ్జెట్ కోత పడడంతో యువతీ యువకుల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగింది. బ్రిటన్ ప్రజల్లో ముఖ్యంగా యువతలో అసంతృప్తి జ్వాలలు రగలడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అసంతృప్తులను, అసమ్మతులను అణిచివేసేందుకు ఉపయోగించే పోలీసుల్లోనూ అసంతృప్తి చోటు చేసుకుంటోంది. పొదుపు చర్యల్లో భాగంగా టోరీ ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల్లో 34 వేల పోలీసు ఉద్యోగుల పోస్టులను రద్దుచేయ నిర్ణయించింది. పోలీసు బడ్జెట్‌లో 20 శాతం కోత విధించింది. మీడియాను సైతం టోరీ పాలన వదిలిపెట్టలేదు. ఆ దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ అయిన బిబిసికి ప్రభుత్వం నుంచి ఇచ్చే కేటాయింపులకు కోతపెట్టింది. అందుకు నిరసనగా గడిచిన రెండు నెలల్లోనే బిబిసి పాత్రికేయులు రెండుసార్లు సమ్మె చేశారు. ఇలా బ్రిటన్‌లోని వివిధ వర్గాలు, తరగతులకు చెందిన ప్రజానీకం ప్రభుత్వ చర్యలతో అసంతృప్తి చెందాయి. అదే చినుచినుకు చేరి మహా ప్రవాహంలా మారిన రీతిన ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో అల్లర్లు, ఘర్షణల రూపంలో నిరసనోద్యమాలు సాగుతున్నాయి. పోలీసు బలంతోనూ, అధికార మదంతోనూ నిరసనలను టోరీ ప్రభుత్వం అణిచివేయవచ్చు. కానీ ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మిగిలిపోతుంది. నిరసనలకు మూల కారణమైన ఉదారవాద ఆర్థిక విధానాలను అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదా కనీసం ఆ వేగాన్ని తగ్గించాలి. అప్పుడే బ్రిటన్‌లో మంటలు చల్లారుతాయి. కాకపోతే చింకి గుడ్డకు మాసికలు వేస్తే దానిపక్కనే మరో చిరుగు పడుతుందన్న తీరున ఆ సమాజం అతలాకుతలం అవుతుందని బ్రిటన్ పాలకులు అలాంటి విధానాలను తలకెత్తుకొన్న దేశాల ఏలికలు గుర్తెరగాలి.
*****Article From Prajasakti Paper www.prajasakti.com
No comments:
Post a Comment