అసలే ఐరోపాలో వేసవి, దానికి తోడు రుణ సంక్షోభ వేడిగాలులు పాలకపార్టీలకు మరింతగా చెమటలు పట్టిస్తున్నాయి. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా పరపతి పోయింది. తరువాత వంతు ఏ దేశానిది అవుతుందన్నది మదుపర్లలో ప్రశ్నార్థకంగా మారిన సమయంలో న్యూయార్క్, వాషింగ్టన్, నుంచి రుణ సంక్షోభం పారిస్ నగరానికి పాకింది. ఏ క్షణంలో అయినా దాని పరపతీ పతనం కానున్నదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న ఐరోపాను ఆదుకొనేందుకు తాత్కాలిక సర్దుబాటు నిధి సమకూర్చే దేశాలలో జర్మనీ తరువాత స్థానంలో ఉంది ఫ్రాన్స్. అలాంటి దేశంలో పడిపోతున్న స్టాక్‌మార్కెట్‌ను నిలబెట్టేందుకు అధ్యక్షుడు సర్కోజీ పక్షం రోజుల ముందుగానే వేసవి విడిది నుంచి ఆగమేఘాల మీద పారిస్ చేరుకున్నాడు. లండన్ తగలడిపోవటం కూడా నిస్సందేహంగా సర్కోజీని కలవర పరిచి ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన తాజా నివేదికలో ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థ పురోగమనం గురించి భరోసా ఇచ్చింది. రానున్న రెండు సంవత్సరాలలో తన ఆర్థిక వనరులను అది మరింతగా స్థిరపరుచుకుంటుందని చెప్పింది. ఇదొక ఎత్తయితే అమెరికా పరపతిని తగ్గించిన స్టాండర్డ్ అండ్ పూర్ సంస్థతో పాటు మరో రెండు ప్రముఖ సంస్థలు ఫ్రెంచి సర్కార్ బాండ్లు కొనటం సురక్షితమని చేసిన ప్రకటనల నేపథ్యంలో ఫ్రెంచి బాండ్ల ధరలు పెరిగాయి. అయితే ఉరుములేని పిడుగులా శుక్రవారం నాడు ఫ్రెంచి ప్రభుత్వ పది సంవత్సరాల బాండ్లపై రాబడి మూడు శాతం పడిపోయింది. ఈ పరిణామం జరిగిన కొద్ది సేపటికే ఏప్రిల్-జూన్ మధ్య ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పురోగతి లేక స్తంభించి పోయిందని, సర్కోజీ సర్కార్ చెబుతున్నట్లు ఏడాది కాలంలో రెండు శాతం కాదు 0.3శాతం మాత్రమే పెరుగుదల రేటు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనాలను ప్రకటించారు. పులి మీద పుట్రలా తొలి మూడు మాసాలతో పోల్చితే వినియోగం రెండవ త్రైమాసికంలో 0.7శాతం పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ ఏటి లోటు బడ్జెట్‌ను 7.1 నుంచి 5.7శాతానికి, వచ్చే ఏడు 4.6శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పులు లేవని అందుకు గాను బడ్జెట్ కోతలను విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెల్లవారే సరికి పరిష్కరించటానికి మంత్ర దండం లేదని కొన్ని పత్రికలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఇదే జరిగితే అభివృద్ధి రేటు మరింత పతనం అవకతప్పదు. ఇతర ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద దేశీయ డిమాండ్ మీదే ప్రధానంగా ఆధారపడి ఉంది. కొత్త కార్ల కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపసంహరించగానే జనం కొనుగోళ్లను కూడా నిలిపివేశారు. ఈ పరిణామం సర్కోజీ సర్కార్‌ను కుదిపేస్తోంది. రుణభారాన్ని తగ్గించేందుకు, బడ్జెట్‌లోటును కుదించేందుకు చర్యలు తీసుకుంటామని ట్రిపుల్ ఏలతో ఉన్న తమ పరపతికి ఎలాంటి ఢోకా లేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు అధ్యక్షుడు సర్కోజీ సర్కస్ ఫీట్లు చేస్తున్నాడు. దానిలో భాగంగానే ప్రభుత్వ బాండ్లను తక్కువ రేట్లకు విక్రయించటాన్ని పదిహేను రోజుల పాటు నిషేధించాడు. ఇటలీ, స్పెయిన్, బెల్జియం కూడా ఇవే చర్యలను తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితి మార్కెట్‌లో తలెత్తటం అంటే ప్రభుత్వ సమర్థతపై విశ్వాసం కోల్పోవటానికి సూచిక.
ఐరోపా యూనియన్‌లో జర్మనీ తరువాత ఫ్రాన్స్ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు భావిస్తారు. అక్కడ నిరుద్యోగం 9.2శాతం కాగా, యువతలో అది 22.8శాతం కావటం గమనార్హం. ఫ్రాన్స్‌లో పెద్ద బ్యాంకుల్లో మూడవదైన సొసైటీ జనరల్ షేర్ల ధరలు జూలై రెండవ వారం నుంచి ఇప్పటివరకు 40శాతం పడిపోవటం ప్రమాద సూచిక. ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించి కంపెనీల వాటాలు, వస్తువుల ధరలపై లావాదేవీలు జరపటాన్ని ఆర్థిక పరిభాషలో డెరివేటివ్స్ అంటారు. ఇది పెద్ద జూదం. దీనిలో సొసైటీ జనరల్‌ది పెద్ద చేయి. అమెరికా సెక్యూరిటీల డెరివేటివ్స్ తనఖా లావాదేవీల్లో 67 వేల కోట్ల డాలర్లు పోగొట్టుకొని చేతులు కాల్చుకుంది. అయితే అమెరికా సర్కార్ ఆదుకోవటంతో అది నష్టాల నుంచి బయట పడింది. ఇప్పుడు ఫ్రెంచి సర్కార్ ఈ బ్యాంకును కాపాడేందుకు రంగంలోకి దిగింది. ఈ బ్యాంకే పోర్చుగల్, ఐర్లండ్, గ్రీస్, స్పెయిన్ సర్కార్లను ఆదుకొనేందుకు 1820 కోట్ల యూరోలు, ఫ్రెంచి సర్కారుకు 1920 కోట్ల యూరోల రుణం ఇచ్చింది. ఫ్రాన్స్‌లో రుణ సంక్షోభ ఛాయలు కనిపించటంతో వంద రూపాయల ఆదాయమైతే ఇప్పటికే 120 రూపాయల అప్పుల పాలైన ఇటలీ కూడా ఉలిక్కి పడుతోంది. రానున్న రెండు సంవత్సరాలలో 6,500 కోట్ల డాలర్ల మేరకు అదనంగా పొదుపు చర్యలు చేపట్టాలని శుక్రవారం నాడు బెర్లుస్కోనీ సర్కార్ నిర్ణయించింది. మతేతరమైన అనేక సెలవురోజుల రద్దు, స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేవారి సంఖ్య పరిమితం చేయటం, పన్నులు పెంచటం వంటి చర్యలను ప్రకటించింది. సంక్షోభంలో ఉన్న గ్రీస్‌ను ఆదుకోవటం, మిగతా దేశాల పతనాన్ని ఎలా నిలబెట్టాలా అని మదన పడుతున్న ఐరోపా యూనియన్‌కు ఫ్రెంచి పరిణామం ఊహించని దెబ్బ. ఒక దగ్గర పడిన చిల్లుకు మాసిక వేసిన మరుక్షణమే మరోచోట పడిపోతోంది. దివాళాకోరు పెట్టుబడిదారీ విధానాలను, ప్రపంచాధిపత్యం కోసం యుద్ధాలను రుద్దుతున్న ధనిక దేశాలే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా అమెరికా, ఐరోపా యూనియన్ సంక్షోభానికి ప్రపంచం కూడా మూల్యం చెల్లించాల్సి రావటమే ఆందోళన కలిగించే అంశం.
***Article From prajasakti Editorial www.prajasakti.com

No comments:
Post a Comment