Some Quotes
Wednesday, October 20, 2010
ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ యుద్ధం
అగ్రగామి పెట్టుబడిదారీ దేశంగా ఉన్న అమెరికా ప్రస్తుత పరిస్థితిలో నాయకత్వం వహించగలిగిన స్ధితిలో లేదు. ఎందుకంటే అది ఏమాత్రం విస్తరణ కార్యక్రమాలు చేపట్టినా దాని కరెంటు ఖాతా లోటు పెరిగి పోతుంది. ప్రపంచానికి నేతృత్వం వహించే స్ధాయికి చైనావంటి దేశాలు ఇంకా ఎదగలేదు. నానాటికీ పెరుగుతున్న ప్రపంచ డిమాండు అవసరాలను తీర్చటానికిగాను పలు దేశాలు కలసి సమన్వయంతో వ్యవహరించటానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు సుముఖంగా లేరు. ప్రభుత్వ జోక్యాన్ని వీరెంతమాత్రం సహించలేకపోతున్నారు.కనుకనే పక్కవాడి నెత్తిన చేతులు పెట్టే సిద్ధాంతాన్ని వీరు చేపడుతున్నారు. సంక్షోభం నుంచి బయటపడేందుకే ఈనాడు కరెన్సీ యుద్ధాలు సాగుతున్నాయి.
ఈనాడు ప్రతి ఒక్కరూ కరెన్సీ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దవైన ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ యుద్ధం సాగుతున్నది. ఇతర దేశాలతో పోల్చినపుడు తన కరెన్సీ విలువ తక్కువ ఉండేలా ప్రతి దేశమూ చర్యలను చేపడుతున్నది. ఏ దేశమైనా తన కరెన్సీ విలువను తగ్గించినట్లయితే, ఆ కారణంగా, ఆ దేశపు ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గుతాయి. కరెన్సీ విలువ తగ్గింపు వలన ఆ దేశానికి చెందిన సరకుల ధరలు ఇతర దేశాల సరకులతో పోల్చినపుడు చౌకగా ఉండటమే ఇందుకు కారణం. క్లుప్తంగా చెప్పాలంటే, కరెన్సీ విలువ తగ్గింపు ఆ దేశపు నికర ఎగుమతులను పెంచుతుంది. అంటే, ఇతర దేశాల మార్కెట్‌లను ఫణంగా పెట్టి తన మార్కెట్‌లను పెంచుకుంటుంది. అదేవిధంగా, ఆ దేశం తన ఉత్పత్తినీ, ఉపాధినీ పెంచుకుంటుంది. దీనివల్ల కూడా ఇతర దేశాలు దెబ్బతింటాయి. కనుకనే కరెన్సీ విలువ తగ్గింపు ద్వారా దేశీయంగా ఉపాధిని పెంచుకోవటాన్ని తరచుగా ''పక్కవాడి నెత్తిన చేతులు పెట్టటంగా'' చెప్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా డిమాండు పెరుగుదల ఉన్నపుడు కరెన్సీ విలువ తగ్గింపు గురించి పెద్ద పట్టింపు ఉండదు. ఎందుకంటే కరెన్సీ విలువను తగ్గించనప్పటికీ ప్రతి దేశంలోనూ ఎంతో కొంతమేరకు ఉపాధి పెరుగుదల ఉంటుంది. పోటీలుపడి కరెన్సీ విలువలను తగ్గించటమంటే, ఒకరి మార్కెట్‌ను మరొకరు గుంజుకునే ప్రయత్నం చేయటమన్న మాట. ప్రపంచ డిమాండులో పెరుగుదల లేదంటే దానర్థమేమంటే, ప్రపంచం, సంక్షోభంలో చిక్కుకున్నదన్నమాట. ఇప్పటికీ, కరెన్సీ యుద్ధంలో మునిగివున్న వారే, ప్రపంచంలో సంక్షోభం సమసి పోయిందంటూ నమ్మబలుకుతున్నారు! నిజానికి ప్రస్తుత ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతున్నది. కరెన్సీ యుద్ధం ఈ విషయాన్నే తెలియచేస్తున్నది. సమీప భవిష్యత్‌లో ఆశారేఖలు కనిపించక పోవటంతో పొరుగు దేశాన్ని దెబ్బతీసి తన పరిస్థితిని మెరుగుపరచు కోవటానికే ప్రతి దేశమూ ప్రయత్నిస్తున్నది.
సంక్షోభాన్నిపెంచే కరెన్సీ యుద్ధం
అయితే, కరెన్సీ యుద్ధం అనేది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. రానున్న కాలానికి సంబంధించి మారకపు రేట్ల గురించిన అంచనాలు అనిశ్చితంగా ఉన్నట్లయితే, అదేవిధంగా రానున్న కాలంలో పరాయి దేశం మార్కెట్ గురించిన అవగాహన అస్థిరంగా ఉన్నట్లయితే ఆప్పుడా పరిస్థితి ప్రతిచోటా ప్రైవేటు పెట్టుబడులకు ఏమాత్రం ప్రోత్సాహంగా ఉండదు. ఇది, మాంద్యం పెరుగుదలకు దారితీస్తుంది. సాపేక్ష కరెన్సీ విలువలో అనిశ్చితి నెలకొన్నట్లయితే, సంపన్నులు బంగారం వైపుకు లేదా చమురు వైపు, ఇతర సరకుల ఫ్యూచర్స్ మార్కెట్ వైపుకు మొగ్గు చూపుతారు. ఇది, ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, కరెన్సీ యుద్ధాలు, ప్రస్తుత సంక్షోభాన్ని ప్రతిబింబిస్తూ, ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
'నూతనావిష్కృత ఆర్థికవ్యవస్థలు' ప్రత్యేకించి చైనా, తదితర ఆసియా దేశాలే (భారత్‌తోసహా) కరెన్సీ యుద్ధాలకు మూలమని పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు చెందిన వ్యాఖ్యాతలు చెప్పుకొస్తున్నారు. వారి వాదన ఇలా సాగుతుంది: అమెరికా కరెంటు ఖాతా లోటు భారీగా వుండి, ఇదేసమయంలో ముఖ్యంగా చైనాతోపాటు ఇతర నూతనావిష్కృత ఆర్థికవ్యవస్ధల కరెంటు ఖాతాలు మిగులుగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయి. ఈ అసమానత్వం కారణంగా, సంక్షోభంలో చిక్కుకున్న అమెరికా నుండి చైనా తదితర నూతనావిష్కృత ఆర్థికవ్యవస్ధలకు సట్టా వ్యాపార పెట్టుబడులు తరలుతున్నాయి. చైనా తదితర దేశాల కరెన్సీ విలువ పెరిగినట్లయితే అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాలు చాలావరకు స్ధిరంగా ఉండేవి. కాని చైనా తదితర దేశాలు తమ కరెన్సీ విలువను పెంచలేదు. పైగా అత్యున్నతమైన విదేశీ మారక నిల్వల రూపంలో ఉన్న డాలర్ల ప్రవాహాన్ని అది ఏమాత్రం అడ్డుకోలేదు. ఇది డాలర్ విలువపై ఒత్తిడిని తీసుకు వస్తున్నది. కనుక, చైనా తన కరెన్సీ విలువను తగ్గించటం ''ఆదిమ పాపం''తో సమానమని, దీనినుంచే కరెన్సీ యుద్ధం పుట్టుకు వచ్చిందని పాశ్చాత్య వ్యాఖ్యాతలు చెపుతున్నారు. చైనా దిగుమతులపై ఆంక్షల విధింపునకు అమెరికా ప్రతినిధుల సభ ఇటీవలనే ప్రభుత్వానికి అనుమతిని ఇచ్చింది.
ఇలా వాదించేవారు ఒక అంశాన్ని విస్మరిస్తున్నారు. ఒకవేళ చైనా తన కరెన్సీ విలువను పెంచిందనుకుందాము. ప్రాయికంగా చూస్తే దీనర్థమేమంటే, చైనా సరకులు అంతకుముందంత చౌకగా ఉండవు. ఇంకా దీనర్థమేమిటంటే, చైనా నికర ఎగుమతులు తగ్గుతాయి. దీనివల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మార్పు వస్తుంది. అంటే, కరెంటు ఖాతాలోని అసమానతలు తగ్గుతాయి. మిగిలినవన్నీ యథాతథంగానే ఉంటాయి. కాగా చైనా ఉత్పత్తిలోనూ, ఉపాధి రంగాలలోనూ తగ్గుదల ఉంటుంది. కరెన్సీ విలువ పెంపు కారణంగా ఉత్పత్తి, ఉపాధి రంగాలలో తగ్గుదలను నివారించేటందుకుగాను చైనా ముందున్న ఒకేఒకే మార్గం ఏమిటంటే, ప్రజల వినియోగం పెరిగేలా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, లేదా ప్రజలకు బదలాయింపు అయ్యే ప్రభుత్వ మొత్తాలను పెంచటం. ఆవిధంగానే చైనా చేసినట్లయితే, కరెన్సీ విలువ పెంపు కారణంగా నికర ఎగుమతుల్లో సంభవించిన తగ్గుదలను ప్రభుత్వ వ్యయాన్ని పెంచటం ద్వారా భర్తీ చేసుకుంటుంది. తత్ఫలితంగా మొత్తం దాని డిమాండులో ఎలాంటి మార్పూ ఉండదు. అదేవిధంగా ఉపాధి, ఉత్పత్తి రంగాలలో కూడా ఎలాంటి మార్పూ ఉండదు. చైనా ఈవిధంగా చేసిందనుకుంటే, అంటే, డిమాండును పెంచటానికిగాను నికర ఎగుమతుల నుంచి ప్రభుత్వ వ్యయం పెంపుదలకు మారిందనుకున్నట్లయితే, అటువంటపుడు, కరెన్సీ విలువను పెంచవలసిన అవసరమే చైనాకు ఉండదు. చైనా విధానమైన 'కరెన్సీ విలువ పెంపుదలతోపాటు ప్రభుత్వ వ్యయం పెంపుదల' కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఖాతాల అసమానతలు తగ్గి, డిమాండు ఉద్దీప్తమయ్యేటట్లయితే, ఆ ఫలితాన్ని ఒక్క ప్రభుత్వ వ్యయం పెంపుదల ద్వారానే సాధించవచ్చు.
కొట్టొచ్చినట్లు కనిపించే మరో విషయమేమంటే, చైనా కరెన్సీ విలువ తగ్గింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పైన పేర్కొన్న వ్యాఖ్యాతలే, పైన పేర్కొన్న అమెరికన్ కాంగ్రెసు సభ్యులే, ద్రవ్య సంస్థల ప్రతినిధులే ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల ఎక్కడవున్నా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన నామమాత్రపు ఉద్దీపన పథకాలను సైతం ఉపసంహరించు కోవాలని వీరు చెపుతున్నారు. నిరుద్యోగం తొలగింపునకు ప్రభుత్వ వ్యయంలో పెంపుదల ప్రతి చోటా దుష్ఫలితాలను ఇస్తుందని, చైనాలో మాత్రం కాదని, చైనా (ఇతరంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్ధలు) కరెన్సీ విలువను పెంచాలని సలహా ఇచ్చేవారు చెప్పజాలరు. నిరుద్యోగం తొలగింపు నిమిత్తం దేశీయ డిమాండును పెంచేసాధనంగా శ్రామికుల వేతనాలలో పెరుగుదల చైనాలో సత్ఫలితాలను ఇస్తుందని చెప్పేవారు, అమెరికాలో శ్రామికుల వేతనాలలో కోత విధింపు ద్వారానే నిరుద్యోగ పరిస్థితిని ఎదుర్కొన వచ్చునని చెప్పజాలరు. నిరుద్యోగ సమస్యను అధిగమించేటందుకై అమెరికాలో ఏ ఆయుధాల ప్రయోగాన్నైతే వ్యతిరేకిస్తున్నారో, ఆ ఆయుధాలనే చైనాలో ఉపయోగించమని చెప్పజాలరు. మరో విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైనా కరెన్సీ విలువను పెంచాలని సలహా ఇచ్చేవారు, ఇలా విలువను పెంచటం చైనాలో నిరుద్యోగానికి దారితీయబోదని విశ్వసించాలి, అలా చేయటమంటే అది పూర్తిగా తప్పవుతుంది. లేదా చైనాలో నిరుద్యోగం పెద్ద సమస్య కాదని భావించేటట్లయితే అది దురహంకారమే అవుతుంది. ఇందులో ఏది సరైనది? నిజానికి, దురహంకార పూరితమైన వాదనను పూర్తిగా దోషపూరితమైన సిద్ధాంతం ద్వారా ముందుకు తీసుకు వచ్చారు. అదేలానో చూద్దాము. తప్పుడు సిద్ధాంతం
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో స్వేచ్ఛయైన, నిరాటంకమైన మార్కెట్ కార్యకలాపాలు సహజంగానే ''పూర్తిస్ధాయి ఉపాధి''ని కల్పిస్తాయన్న ద్రవ్య పెట్టుబడుల తప్పుడు సిద్ధాంతం పలువురు ఆర్థికవేత్తల ద్వారా, వ్యాఖ్యాతల ద్వారా ప్రచారంలోకి వస్తున్నది. 1930ల నాటి పెను మాంద్యం సమయంలో సైతం ఈ వైఖరిని వారు విడనాడలేదు. సంక్షోభ ప్రారంభంలో దీనికి కాస్త ఎదురుదెబ్బ తగిలినప్పటికీ మరలా పుంజుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ద్రవ్య పెట్టుబడిదారుల ప్రచారమే ఇందుకు కారణం. అమెరికాలో నిరుద్యోగం రేటు 10 శాతంగా ఉన్నప్పటికీ ఒబామా ప్రకటించిన నామమాత్రపు ఉద్దీపన పథకాలను సైతం ఉపసంహరించు కోవాలంటూ డిమాండు చేయటాన్ని ఏవిధంగా వివరించగలరు? ఇలాంటి ఉద్దీపనలు లేనప్పటికీ పూర్తిస్ధాయి ఉపాధివైపు ఆర్థికవ్యవస్థ సాగగలదన్న విశ్వాసమే ఇలాంటి డిమాండ్లను ముందుకు తీసుకు వస్తున్నది. రూజ్వెల్ట్‌కు ముందు అమెరికాకు అధ్యక్షుడిగావున్న హెర్‌బెర్ట్ హూవర్ ఇలాంటి దృక్పథాన్నే కలిగివున్నాడు. హూవర్ చేపట్టిన విధానం పెనుమాంద్యానికి దారి తీసింది.
చైనావంటి దేశాలు స్వేచ్ఛా మార్కెట్లను అడ్డుకుంటున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి టిమ్ గీత్నర్ ఆరోపించాడు. స్వేచ్ఛా మార్కెట్‌ను చైనా అనుమతించేటట్లయితే అది చైనాతో సహా అందరికీ ప్రయోజనకారిగా ఉంటుందని ఆయన చెప్పారు. చైనా కరెన్సీ విలువ పెరిగినట్లయితే అదేమీ ఆందోళనకరం కాదని ఆయన చెప్పుకొచ్చారు. పైగా దానివల్ల నిరుద్యోగం తగ్గుతుందని పేర్కొన్నారు. చైనా కరెన్సీ విలువను పెంచాలని కోరటంలో అసలు ఆంతర్యం వేరే వున్నది. అలాంటి పెరుగుదల చైనాలో నిరుద్యోగానికి దారితీయగలదన్న సంగతి వారికి తెలుసు. ప్రభుత్వ వ్యయం తగ్గించే దిశలో చైనా నడవాలన్నదే వారి ఉద్దేశం.
పురాతన కాలంలో వలస దేశాలలో పరిశ్రమలు నెలకొనకుండా చేసి పెట్టుబడిదారీ దేశాలు లాభపడిన మార్గంలోనే ఇప్పుడు కూడా చైనా తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను బలిపెట్టి అమెరికా తదితర దేశాలు లాభపడాలన్నదే ద్రవ్యపెట్టుబడుల, మితవాద శక్తుల అభిప్రాయంగా ఉన్నది. మార్కెట్లు పనిచేస్తే నిరుద్యోగం అంతమవుతుందన్న నిరర్థక వాదనల ముసుగులో పై అభిప్రాయాలను ముందుకు తీసుకు వస్తున్నారు. కొత్తగా ఎదుగుతున్న వర్ధమాన దేశాల విషయంలో సంపన్న దేశాలు అనుసరిస్తున్న ఈ విధానం పక్కవాడి నెత్తిన చేయిపెట్టే సిద్ధాంతం మినహా మరేమీకాదు.
ప్రపంచ డిమాండు స్థాయి పెరిగే సూచనలు కనిపించక పోవటంతో పై వాదనలను ముందుకు తెస్తున్నారు. అగ్రగామి పెట్టుబడిదారీ దేశంగా ఉన్న అమెరికా ప్రస్తుత పరిస్థితిలో నాయకత్వం వహించగలిగిన స్ధితిలో లేదు. ఎందుకంటే అది ఏమాత్రం విస్తరణ కార్యక్రమాలు చేపట్టినా దాని కరెంటు ఖాతా లోటు పెరిగి పోతుంది. ప్రపంచానికి నేతృత్వం వహించే స్ధాయికి చైనావంటి దేశాలు ఇంకా ఎదగలేదు. నానాటికీ పెరుగుతున్న ప్రపంచ డిమాండు అవసరాలను తీర్చటానికిగాను పలు దేశాలు కలసి సమన్వయంతో వ్యవహరించటానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు సుముఖంగా లేరు. ప్రభుత్వ జోక్యాన్ని వీరెంతమాత్రం సహించలేకపోతున్నారు. కనుకనే పక్కవాడి నెత్తిన చేతులు పెట్టే సిద్ధాంతాన్ని వీరు చేపడుతున్నారు. సంక్షోభం నుంచి బయటపడేందుకే ఈనాడు కరెన్సీ యుద్ధాలు సాగుతున్నాయి. ప్రస్తుత స్తంభన పెట్టుబడిదారీ విధానాల పుణ్యమే. పైగా ఈ స్థితిని అది మరింత తీవ్రతరం చేస్తున్నది.
Article from prajasakti written By Prabatpatnayak
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment