నోబెల్ శాంతి బహుమతిని మరోసారి దుర్వినియోగం చేశారు. చైనా సోషలిస్టు వ్యవస్థను కూలదోసేందుకు కుట్రచేసిన నేరగాళ్లలో ఒకడైన లియూ జియావొబోకు 2010 శాంతి బహుమతిని ప్రకటించారు. సహజంగానే ఈ నిర్ణయంపై చైనా ఆగ్రహం ప్రకటించింది. బహుమతి ప్రకటించారు గనుక లియూను జైలు నుంచి విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా డిమాండ్ చేశాడు. రెండవసారి కూడా కొనసాగాలని వాంఛిస్తున్న ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ ప్రపంచంలో మానవహక్కుల ఆచరణ మెరుగుపడాలని ప్రపంచంలో పెరుగుతున్న ఏకాభిప్రాయానికి ఈ బహుమతి నిదర్శనం అని పరోక్షంగా ప్రశంసించారు. సరిగ్గా ఈ సమయంలోనే ఇజ్రాయెల్ 1976 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మెయిరెడ్ మాగైర్‌ను పాలస్తీనా ప్రాంతంలోకి వెళ్లటం చట్టవిరుద్ధమంటూ బలవంతంగా విమానం ఎక్కించి పదేళ్లదాకా రావటానికి వీల్లేదంటూ దేశం నుంచి వెళ్లగొట్టారు.
చైనా మానవహక్కులు,ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు దీన్నేమంటారు?. మెయిరెడ్ చేసిన నేరం ఏమిటి? పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నించటం తప్ప ఇజ్రాయెల్ వ్యవస్థను కూలదోయటానికి ప్రయత్నించలేదే? కానీ లియూ చేసిందేమిటి? విద్యార్థుల ఉద్యమం పేరుతో తిరుగుబాటును రెచ్చగొట్టి సోషలిస్టు వ్యవస్థను కూలదోసేందుకు కుట్ర చేశాడు. సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులకు బహుమతులు ప్రకటించి కమ్యూనిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఇదే కొత్తగా కాదు. సోవియట్ యూనియన్ ఉనికిలో ఉన్న సమయంలో ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా తయారైన రచయిత బోరిస్ పాస్టర్‌నాక్‌ను 1958వ సంవత్సరానికిగాను నోబెల్ పురస్కారానికి ఎంపిక చేశారు. మూడు దశాబ్దాల తరువాత పాస్టర్‌నాక్ కుమారుడికి దానిని అందచేశారు.
ఆల్‌ఫ్రెడ్ నోబెల్ గనుక ఇప్పుడు బ్రతికి ఉంటే తాను ఏర్పాటు చేసిన శాంతి బహుమతిని ఇలా దుర్వినియోగం చేయడాన్ని అనుమతించేవాడా? రెండు దేశాల మధ్య శాంతికి చేసే కృషికి శాంతి బహుమతి ఇవ్వాలని తన వీలునామాలో రాశాడు. బహుమతి నిర్ణేతలు తమ అతి తెలివితేటలను జోడించి ఇతరులకు ఇవ్వకూడదని రాయలేదుగా అంటూ దానికి వక్రభాష్యాలు చెబుతున్నారు. సామ్రాజ్యవాదులు నోబెల్ బహుమతిని కూడా ఒక అస్త్రంగా వాడుకోవటం 1906లో నాటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ను ఎంపిక చేయటంతోనే ప్రారంభమైంది. ఆయనకు ఎందుకిచ్చారంటే ఆ ఏడాడే స్వీడన్ నుంచి విడిపోయిన నార్వేకు ఎవరో ఒక పెద్ద దిక్కు అండగా ఉండాలని రూజ్వెల్టుకు ఇచ్చామని నిర్ణేతలు తరువాత వెల్లడించారు. గతేడాది తనకు ప్రకటించిన శాంతి బహుమతి గురించి స్వయంగా ఒబామాయే దిగ్భ్రాంతి చెందారు. తనకింకా ఆ అర్హత రాలేదని చెప్పుకోవాల్సి వచ్చింది.
లియూ వంటి కమ్యూనిస్టు వ్యతిరేకులకు ప్రకటించటం వెనుక రాజకీయం గురించి చెప్పనవసరం లేదు. దుర్మార్గులకు నాయకత్వం వహించిన వారికీ, ప్రజల పక్షాన వారిని ఎదిరించిన నాయకులనూ ఒకే గాటన కట్టటం కూడా నోబెల్ కమిటీ నిర్వాకాలలో కొన్ని. వియత్నాంపై దురాక్రమణ, సర్వనాశనం చేసిన అమెరికా రక్షణ మంత్రి హెన్రీ కిసింజర్, వియత్నాం కమ్యూనిస్టుపార్టీ నాయకుడు లీ డక్ తోకు, పాలస్తీనా ఆక్రమణ నాయకుడు యిత్జిక్ రాబిన్, పాలస్తీనా విమోచన నాయకుడు యాసర్ అరాఫత్‌కు ఉమ్మడిగా బహుమతులు ప్రకటించిన ఉదంతాలు తెలిసిందే. లీ డక్ బహుమతిని తిరస్కరించటంతో కిసింజర్ కూడా దానిని తీసుకొనేందుకు సిగ్గుపడ్డాడు.నోబెల్ కమిటీ మరొక ప్రహసనం ఏమంటే 2007 అమెరికా ఉపాధ్యక్షుడు అల్‌గోర్‌కు వాతావరణ మార్పులపై చైతన్యం కలిగించినందుకు శాంతి అవార్డును ప్రకటించారు.
సామ్రాజ్యవాదులు తమతో పాటు, తమకు తొత్తులుగా మారిన కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవార్డులు ఇప్పించుకుంటారు. తమను వ్యతిరేకించిన వారి పేర్లను ఎవరైనా ప్రతిపాదించినా రాకుండా అడ్డుకుంటారు. మన జాతిపితగా పరిగణించే మహాత్మాగాంధీ విషయంలో అదే జరిగింది. ఆయనకు ఆ బహుమతి ఇవ్వాలని 1937,38,39, 1947,48 సంవత్సరాలలో ప్రతిపాదించారు. ఆయనకు ఎందుకు నిరాకరించారో ఇంతవరకు కారణాలు బయటకురాలేదు. కానీ ఆయన మరణించిన పదేళ్ల తరువాత అరెరె బహుమతి ఇవ్వాల్సిన పెద్దమనిషిని మరిచిపోయామంటూ కమిటీ మొసలి కన్నీరు కార్చింది, పోనీ మరణానంతర అవార్డు ఇద్దామా అంటే బతికున్నవారికే ఇవ్వాలని నిబంధనలని సాకు చెప్పారు. కానీ అదే కమిటీ వాటన్నింటినీ పక్కనపెట్టి 1961లో స్కాండినేవియాకు చెందిన డాగ్ హామర్‌ష్కోజోల్‌కు మరణాంతరం ప్రకటించారు. సామ్రాజ్యవాదులతో పాటు వారి ప్రతినిధిగా ఉన్న ప్రపంచబ్యాంకు కూడా అవార్డులను ఇప్పించుకోవటంలో ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో ఏదో ఒక చోట మైక్రో ఫైనాన్స్ పిండారీల దౌర్జన్యం, దారుణాలకు గురికాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మైక్రోఫైనాన్స్, గ్రామీణబ్యాంకు పద్దతిని రూపొందించిన ఒకప్పటి ప్రపంచబ్యాంకు అధికారి బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ యూనస్‌కు కూడా నోబెల్ బహుమతి వచ్చింది. ఆసంస్థలు వసూలు చేస్తున్న అధికవడ్డీ గురించి ఆ పెద్దమనిషి ఇటీవల నెత్తీనోరు బాదుకున్నాడు.
నోబెల్ కమిటీ నిర్ణయాలు ఒక్క శాంతి బహుమతి విషయంలోనే అనుకుంటే పొరపాటు. 1923నే ఔషధాలపై జరిపిన కెనడా శాస్త్రవేత్త బాంటింగ్, ఆయన జూనియర్ చార్లెస్ బెస్ట్‌కు ఇవ్వాల్సిన అవార్డును వారి పరిశోధనను పర్యవేక్షించాడనే పేరుతో బాంటింగ్‌తో కలిపి జాన్ మెక్‌లోడ్‌కు ప్రకటించారు. చైనా ప్రజావ్యతిరేకి లియూ విషయానికి వస్తే గత రెండు సంవత్సరాలలో అమెరికా ఇతర ధనిక దేశాలు అటు ఆర్థిక రంగంలోనూ ఇటు రాజకీయ, మిలిటరీ రంగాలలోనూ తీవ్ర ఎదురుదెబ్బలు తింటున్నాయి. ఆర్థికంగా చైనా ప్రపంచ మాంద్యం నుంచి తప్పించుకోవటమే కాదు, అమెరికా తరువాత సంపదలో రెండవ పెద్ద దేశంగా ఉన్న జపాన్‌ను వెనక్కు నెడుతోంది. రాజకీయంగా అటు లాటిన్ అమెరికాలోనూ ఇటు తూర్పు ఆసియాలోనూ ప్రభావం చూపుతోంది. ఆఫ్రికన్ దేశాలతో సంబంధాలను రోజురోజుకూ మెరుగుపరచుకుంటోంది. తన కరెన్సీ విలువను పెంచాలన్న ధనిక దేశాల వత్తిడిని చైనా తోసి పుచ్చింది. ఇదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు రోజురోజుకీ మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చైనాపై అమెరికా అమ్ములపొదిలోని మానవహక్కుల అస్త్రాన్ని గతంలో అనేకసార్లు ప్రయోగించినా తుస్సుమంది. ఇప్పుడు లియూ అనే శిఖండిని అడ్డుపెట్టుకొని మరోసారి అదే దాడి చేసింది. నోబెల్ ఆశయాలను నోబెల్ కమిటి ఉప్పు పాతర వేస్తోంది. సామ్రాజ్యవాద శక్తులకు నిస్సిగ్గుగా ఊడిగం చేస్తోంది.
No comments:
Post a Comment