Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Thursday, May 6, 2010

వేదాల్లో ఏముంది?

ఒక వేయి సంవత్సరాల మానవజాతి పరిణామాన్ని, పురోగమనాన్ని, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని, ఉత్పత్తిలో అభివృద్ధిని, దాని పర్యవసానంగా సమాజజీవనంలో, సామాజిక వ్యవస్థ నిర్మాణంలో, మానవుల మధ్య సంబంధా లలో వచ్చిన మార్పులను వేదాలు చూపుతాయి. భాషా, సాంస్కృతిక, తాత్విక పరిణామం కూడ వీటిలో కనబడుతుంది. వర్ణాలు ఇంకా ఏర్పడని రోజుల్లో రచించిన ఋక్కులలో కులం, మతం, పరలోకం, ఆత్మ వంటి భావనలేమీ కనపడవు. కాని తర్వాత వేదాలలో వీటి ప్రస్తావనలు చోటుచేసుకున్నాయి.రచించినవి. ఆ కాలంనాటి కవుల మానసిక స్థితిని సక్రమంగా అర్థం చేసుకుంటేనే వేదాలను కూడా అర్థం చేసుకోడానికి వీలవుతుంది.
ఈ వేదాలలో ఏమున్నదో కూడా తెలుసుకోవాలి. అంతకు ముందు ఒక ముఖ్య మైన అంశాన్ని మనం పరిగణనలోకి తీసుకో వడం చాలా అవసరం. ఏదైనా ఒక గ్రంథం చదివితే అందులో ప్రస్తావించబడిన అంశాలను బట్టి ఆ గ్రంథ రచనా కాలాన్ని గుర్తించవచ్చు. ఆ కాలంలో ప్రజల జీవన స్థాయి ఎలా ఉండేదో ఊహించ వచ్చు. ఉదాహరణకు: రామాయణాన్ని వాల్మీకి రాసిన కాలంలో రథాలు, గుర్రాలు, పడవలు, నార చీరెలు, విల్లంబులు వంటివి ఉండేవని, కుల వ్యవస్థ స్థిరపడి ఉన్నదని అర్థం అవుతుంది. అలాగే ఆర్యుల పెత్తనానికి లోబడని విస్తారమైన ప్రాంతాలు చాలా ఉండేవని, దండకారణ్యం, ఋష్యమూకం, లంక వంటివి ఆ కోవకే చెందు తాయని గ్రహించగలుగుతాం. అదే సమయంలో ఆంజనేయుడు అమాంతం శరీరాన్ని అనేక రెట్లు పెంచివేయడం, మైళ్లకి మైళ్లు గాలిలో ఎగరడం, రాముడు ఒక్క బాణంతో ఏడు తాటిచెట్లను కూల్చివేయడం, బాణాలతో ఆకాశంలో పైకప్పు నిర్మించడం, రావణుడికి పదితలలు ఉండడం, పుష్పకవిమానం ఏ ఇంజనూ, ఇంధనమూ లేకుండానే నడవడం, ఎందరు దానిలో ఎక్కినా ఇంకా ఖాళీ ఉండడం(అదేమిటోగాని మన రైళ్లలో, విమానాల్లో రిజర్వేషన్లు ముందస్తుగా కోరినా చాలాసార్లు సీట్లు లేవనే సమాధానం వస్తూవుంటుంది) ఇలాంటి అతిశయోక్తులు, కవి/రచయిత కల్పనను, వర్ణణాచాతుర్యాన్నీ ప్రతి బింబిస్తూ కనపడతాయి. కాని అవన్నీ రామా యణ కాలంలో నిజంగా ఉనికిలో ఉన్నట్లు చరిత్రకారులు ఎవరూ ఆమోదించరు. ఇలా ఆమోదించని చరిత్రకారుల్లో అత్యధికులు దేవుడిని పూజించేవారుసైతం ఉన్నారని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.


ఒక నిర్థిష్ట కాలంలో, ఒక కవి/రచయిత జీవిత కాలంలో రాయబడిన గ్రంథం విషయం లో పై అంశాలు వర్తిస్తాయి. కాని వేదాల విషయంలో అలా కాదు. వేద కాలపు రచయి తల, ప్రజల పరిస్థితులను, ఆనాటి సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మరికొన్ని ప్రత్యేకతలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. వేదాలను ఒక రచయిత/కొందరు రచయితలు రాయలేదు. కొన్ని వందల, వేలమంది రచయితలు వేదా లను సృజించారు. ఒక ఏభై, వంద సంవత్స రాలలో రాసినవి కావు. సుమారు వేయి సంవ త్సరాల కాలంలో వేదాల రచన జరిగిందని డా||సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. ఈ వెయ్యి సంవత్సరాల కాలం ప్రారంభంలో లిపి, నిర్థిష్టమైన భాషలేని దశ. చివరికి వచ్చే సరికి భాష నిర్ధిష్ట రూపం పొందింది. లిపి ఏర్పడింది. నోటి మాటగా పలికే దశనుండి రాయగలిగే దశవరకు సాగింది.


పశువుల మందలను వెంటబెట్టుకుని ఎక్కడ సంవత్సరం పొడుగునా నీళ్లూ, గడ్డీ దొరుకు తాయో వెతుక్కుంటూ బయలుదేరిన ఆదిమ గణ వ్యవస్థ వేదరచనా ప్రారంభకాలం. వెయ్యి సంవత్సరాల తర్వాత పరిస్థితి వేరు. అప్పటికి ఆర్యులు భారతదేశానికి రావడం. ఇక్కడి సింధు నాగరికతను ధ్వంసం చెయ్యడం, స్థానిక తెగలలో కొన్నింటిని లొంగదీసుకొని, మరికొన్నింటితో రాజీపడి మొత్తానికి తమ ఆధిపత్యాన్ని సాధించ డం జరిగిపోయింది. వర్ణ వ్యవస్థ ఏర్పడింది. సమాజం ఆదిమ దశ నుండి వర్గ విభేదాలు గల వ్యవసాయిక దశలోకి పరిణతి చెందింది. సూర్యోదయం, వర్షం, మెరుపు -ఇలాంటి ప్రకృతి దృశ్యాలను చిన్నపిల్లల మాదిరి అత్యంత సంభ్ర మాశ్చర్యాలతో చూసి కేరింతలు కొట్టి తమ స్పందనలను కవితలుగా అల్లిన వేదకాలపు తొలి రచయితలకు, ప్రకృతి శక్తులను కొంత అదుపులోకి తెచ్చుకుని వాటితో సహజీవనం చేస్తూ, ఈ ప్రకృతి అస్థిత్వం యొక్క మూల కారణాలను అన్వేషించే తాత్విక చింతన అలవర్చుకున్న వేదాల మలి రచయితలకు చాలా వ్యత్యాసం ఉంది.
ఒక వేయి సంవత్సరాల మానవజాతి పరిణామాన్ని, పురోగమనాన్ని, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని, ఉత్పత్తిలో అభివృద్ధిని, దాని పర్యవసానంగా సమాజ జీవనంలో, సామాజిక వ్యవస్థ నిర్మాణంలో, మానవుల మధ్య సంబంధా లలో వచ్చిన మార్పులను వేదాలు చూపుతాయి. భాషా, సాంస్కృతిక, తాత్విక పరిణామం కూడా వీటిలో కనబడుతుంది. వర్ణాలు ఇంకా ఏర్పడని రోజుల్లో రచించిన ఋక్కులలో కులం, మతం, పరలోకం, ఆత్మ వంటి భావనలేమీ కనపడవు. కాని తర్వాత వేదాలలో వీటి ప్రస్తావనలు చోటుచేసుకున్నాయి.


ఇంతకీ వేదాలెన్ని? - ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వణవేదం - ఈ నాలుగు వేదాలు ఉన్నట్లు ప్రస్తుత కాలంలో ఎక్కువమంది అంగీకరిస్తారు. కాని వేదాల సంఖ్య కూడా వివాదాస్పదమే. భారతం రచించిన నన్నయ ''వేదత్రయ మూర్తయ: త్రిపురుషా:'' అని అన్నాడు. మూడు వేదాలు, వాటి రూపాలుగా ముగ్గురు దేవుళ్లు - బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఉన్నారని నన్నయ భావం. చాలా కాలం వరకు అధర్వణవేదానికి వేదం హౌదా లభించలేదు. తర్వాత కాలంలో భార తాన్ని పంచమ వేదం అని అన్నారు. ఎందుకైనా మంచిదని దానిని రాసిన వ్యాసుడిని విష్ణువు అవతారాల్లో ఒక అవతారంగా కలిపారు. అయినా, దానికి వేదం హౌదా దక్కనట్టే భావించాలి. 'ఆయుర్వేదం' అని ప్రాచీన వైద్య శాస్త్రానికి పేరున్నా, దానికీ వేదం హౌదా దక్కలేదు. పైగా వైద్యులను సమాజంలో అంటరానివాళ్లుగా పరిగణించిన ఘనత కూడా మన ప్రాచీన మనువాదులకే దక్కింది.


మొత్తానికి నాలుగు వేదాలు ఉన్నాయి. వీటిలో అతి ప్రాచీనమూ, అతి పెద్దదీ ఋగ్వేదం. ఇందులో 10,552 ఋక్కులు (రెండు/మూడు లైన్లకు మించని పద్యాల లాంటివి) ఉన్నాయి. వీటిని 1028 సూక్తాలుగా వర్గీకరించారు. అంటే ఒక్కో సూక్తంలో 10 ఋక్కులు ఉంటాయన్న మాట. ఈ సూక్తాలను తిరిగి మండలాలుగా వర్గీకరించారు. మొత్తం ఋగ్వేదం 10 మండలాలు(అధ్యాయాలు). ఇందులో మొదటి మండలంలో 191 సూక్తాలు (అంటే సుమారు 2000 ఋక్కులు) ఉన్నాయి. ఈ మొదటి మండలాన్ని 15 మంది రచయితలు రచించారు. దీనిని బట్టి ఋగ్వేద రచయితలే 100 మందికి పైగా ఉండవచ్చు. ఋగ్వేదంలో ప్రస్తావనకు వచ్చిన వరుణులు, అగ్ని, మిత్రుడు, సూర్యుడు లాంటి దేవతలు, పర్షియన్ల ప్రాచీన గ్రంథం 'అవెస్త'లోకూడా కనపడతారు. ఋగ్వేద సంస్కృత భాషకూ, అవెస్త గ్రంథంలో వాడిని భాషకూ, ఇతర ప్రాచీన ఇండో-యూరోపియన్‌ తెగల భాషలకూ ఉమ్మడి పదాలు చాలా ఉన్నాయి.


తమ సుదీర్ఘయాత్ర అనంతరం సింధు- హరప్ప ప్రాంతానికి చేరుకుని అక్కడి స్థానికులతో తలపడవలసి వచ్చినపుడు ఆర్యులు స్థానికుల సంస్కృతితో, ఇక్కడి దేవతల పట్ల గల నమ్మ కాలతో సైతం తలపడాల్సి వచ్చింది. తమతో బాటు పదిలంగా 'శృతాలు'గా కాపాడుకుని తెచ్చిన తమ పాటలను, కవిత్వాన్ని మరింత కట్టుదిట్టంగా పరిరక్షించవలసిన అగత్యం ఏర్ప డింది. దాని పర్యవసానమే క్రమబద్ధీకరిం చబడి, ఋగ్వేదం రూపం పొందింది. అయితే దీనిలోని పదో మండలం చాలా కాలం తర్వాత మూల గ్రంథానికి చేర్చబడిందని కొందరు పండితులు భావిస్తున్నారు.
ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం - ఈ మూడింటిలోని సారాంశం ఒక్కటేనని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. సామవేదంలో 1791 ఋక్కులు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం -దాదాపు 1715 -ఋగ్వేదంలో చెప్పినవే. మధురంగా, శ్రావ్యంగా పాడుకోడానికి వీలుగా తిరిగి రాయబడ్డాయి. సంగీత శాస్త్రానికి సామవేదం ప్రారంభంగా పరిగణిస్తారు.


ఇక యజుర్వేదం సంగతి చూద్దాం. యజ్‌ అన్న మూల పదం నుంచి ఈ పేరు వచ్చింది. దీనికి బలి/నైవేద్యం అని అర్థం. తమ కోర్కెలు తీర్చుకోడానికి దేవతలకు బలియిచ్చే కార్యక్రమమే యజ్ఞం. వర్ణ వ్యవస్థ బలపడ్డాక ఈ తంతు చేసే అర్హత, అధికారం అగ్రవర్ణాలు తమకే సొంతం చేసుకున్నాయి. కాని తొలి రోజుల్లో ప్రతీవాడూ తనకి నచ్చిన దేవతకి నైవేద్యం/బలి సమర్పించేవాడు. గ్రామ దేవతల పండగల్లో ఇప్పటికీ ఈ తంతు మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కనపడుతుంది. మొక్కు తీర్చు కునేటప్పుడు తన కోర్కెను వ్యక్తం చేసే పదాలే/మంత్రాలే యజుర్వేదం సారాంశం. ఐతే కాలక్రమేణా ఎవరూ అతిక్రమించడానికి వీలు లేని, మార్చడానికి వీలు లేని కొన్ని పద్ధతులుగా ఇవి రూపుదిద్దుకున్నాయి. ఋగ్వేదంలో ప్రస్తావించిన దేవతలే, అందులో వ్యక్తీకరించిన కోరికలే, పొగడ్తలే ఇక్కడ ఒక క్రమపద్ధతిలో దర్శనమిస్తాయి. ఆధునిక పరిభాషలో చెప్పా లంటే ఆఫీసు మాన్యువల్‌ అన్నమాట. యజుర్వే దంలో తిరిగి కృష్ణ యజుర్వేదమూ, శుక్ల యజుర్వేదమూ అని రెండు భాగాలు ఉన్నాయి.
ఇక ఆఖరుగా అధర్వణ వేదం. ఇందులో 20 అధ్యాయాలున్నాయి. అయిదువేలకు పైగా రుక్కులు 731 సూక్తాలుగా ఉన్నాయి. ఇందులో ఆధ్యాత్మిక చింతన, పరలోక భావన వంటివేమీ లేవు. కొడవటిగంటి కుటుంబరావు గారు ''ఇది బొత్తిగా ఐహిక సుఖ సాధన కోసం పనికి వచ్చే వేదం'' అన్నారు. అంటే ఈ లోకంలో సుఖంగా బతకడం ఎలా అన్నది చర్చించిన వేదం. ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం వంటివి అభివృద్ధి చెందడానికి వాటి వేరు అధర్వణ వేదంలోనే ఉంది అని అంటారు. బహుశ పరలోకం గొడవ బొత్తిగా లేనందువల్లనో ఏమో అధర్వణవేదాన్ని చాలా కాలంపాటు వేదంగా గుర్తించడానికే నిరాకరించారు.


అన్నింటిలోకీ ప్రధానమైన ఋగ్వేదంలో ఏమున్నది? దేవీప్రసాద్‌ ఛటోపాధ్యాయ ఇలా రాశారు : ''ఈ ఋక్కులు, పాటలు అనేకమైన దేవతలను గురించి చేసిన విపరీతమైన స్తుతు లుగా (అతిగా పొగడటం) భావించవచ్చు. ఆహార ధాన్యాలను దోచుకుంటూ, పశువులను దొంగిలిస్తూ, సంపదలను కొల్లగొడుతూ పరమ నిర్ధాక్షిణ్యంగా వాటిని తమలో పంపకం చేసుకునే ఆటవిక జాతి వీరుల స్తవాలే(పొగడ్తలే) ఈ ఋక్కులు. వారి నాయకులను సభాంగణంలో ''మిత్రులని'', ''పరమ మిత్రులని'', ''మిత్ర శ్రేష్టు లని'', ''పర్వతంలాగా స్థిరమైనవారని'', ''వనస్పతి లాంటి వారని'', ''ఆయుధం లాంటివారని'', ''ఓషధుల్లాంటి వారని'' -వీరు పొగిడేవారు. కొన్ని సమయాల్లో కేవలం భౌతికమైన ఈ లోకంలోని కోర్కెల స్వభావాన్ని కూడా దేవతా స్వరూపంగా వర్ణించేవారు. ఉదాహరణకు- ''గర్భస్రావ రక్షణ దేవత'', సంతాన దేవత' ''మశూచి దేవత'', ''అంటువ్యాధి నివారణ దేవత'' మొదలైనవి. శరీరానికి బలాన్నిచ్చే అన్న దేవతను ఏ విధంగా స్తుతించారో ఇంతకు ముందు వ్యాసంలో చూశాం. అలాగే శరీరానికి మత్తెక్కి ంచే సోమపానీయాన్ని(ఒక విధమైన కల్లు వంటి పానీయం) కూడా పొగిడిన ఋక్కులు ఉన్నాయి.''ఓ సోమమా! నన్ను ఈ ప్రపంచంలో అనంతమైన కాంతి ఉండే చోటికి సూర్యుడుండే దగ్గరికి, చావు, వినాశనం లేని చోటికి తీసు కుపో.వివస్వతుని కొడుకు రాజ్యమేలే చోటికి, స్వర్గం ఉండే రహస్య ప్రదేశానికి, శక్తివంతమైన జలధారలున్న చోటికి చేర్చు. అమరుణ్ని చెయ్యి.ఎక్కడ ఆశలు, కోర్కెలు తీరుతాయో, ఎక్కడ సోమం పుష్కలంగా దొరుకుతుందో, ఎక్కడ తిండి, ఆనందం దొరుకుతుందో అక్కడ నేను శాశ్వతంగా ఉండేలా చెయ్యి.'' (ఇప్పుడు తాగి తందనాలాడేవాళ్లు కూడా ఇంతకన్నా గొప్పగా కోరుకునేది వేరే ఏమన్నా ఉందా?) ఇక్కడ దేవత అన్న పదాన్ని 'పరమాత్మ' అన్న తాత్విక అర్థంతో చూడరాదు. దేవత/దేవుడు అంటే మనిషికి(కోరినది) ఇచ్చేవాడు అన్న అర్థంలోనే ఋగ్వేద రచయితలు ఆ పదాన్ని ఉపయోగించారు. హిందీలో 'దే' అంటే ఇయ్యి అని అర్థం. జ్ఞానం కలిగినవాడు తోటి మానవు డికి ఆ జ్ఞానాన్ని ఇస్తే అతడు దేవుడు- సూర్యుడు, చంద్రుడు వెలుగునిస్తారు కనక దేవతలు. తల్లి జన్మనిచ్చింది గనుక దేవత. తండ్రి విద్యాబు ద్ధులు/బతుకుతెరువు నేర్పుతాడు కనుక దేవత. ఇంటికొచ్చిన అతిథి తనరాక వలన ఆనందాన్ని కలిగిస్తాడు గనుక దేవత. అందుకే ''మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ'' అన్నారు.


ఋక్కుల్లో అత్యధిక భాగం ఇంద్రుడిని పొగిడినవి ఉన్నాయి. అతడు శత్రువులని చీల్చి చెండాడుతాడని, శత్రువుల కోటలను ధ్వంసం చేశాడని, ఆనకట్టలను పగల గొట్టాడని, తెగ తాగి బానకడుపు పెంచుకున్నాడని-ఇలా ఉన్నాయి పొగడ్తలు. ఇంద్రుడి తర్వాత స్థానం వరుణుడిది. ఆ తర్వాత అగ్నిది.... ఇలా తమ నాయకులనుగాని, ప్రకృతి శక్తులను గాని పొగిడిన ఋక్కులేఅధిక భాగం. వేదాల గురించి స్థూలంగా పరిశీలన చేసినపుడు ''వేదాల్లోనే సమస్త జ్ఞానము ఉన్నది'' అన్న నమ్మకం సరైంది కాదని తేట తెల్లం అవుతోంది. అభివృద్ధి శైశవ దశలో ఉన్న మానవ సమాజంలోని విభిన్న ఆలోచనల, కోర్కెల, ఆచారాల, సంస్కృతుల సమాహారంగా వేదాలు మనకి అర్థమౌతాయి. వేదాలపై పరిశోధనలు చేపట్టడం, ఇంతవరకు గమనిం చని, గ్రహించని కొత్త అంశాలమేన్నా ఉంటే బైటపెట్టడం అవసరం. కాని ఇప్పటికి కూడా దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న వేద పాఠ శాలల్లో కేవలం వేదాలను యధాతథంగా వల్లె వేయడం నేర్పుతున్నారు. ఇంకాస్త శ్రద్ధ ఉన్న చోట వ్యాఖ్యానాలు నేర్పుతున్నారు. ప్రాచీన సమాజపు అవశేషాల్లా వేదపండితులు వ్యవహ రించడం వల్ల ప్రయోజనం ఏమిటో విజ్ఞులంతా ఆలోచించాలి.


ప్రఖ్యాత ఆధునిక భారతీయ తత్వవేత్తల్లో అరవిందఘోష్‌ ఒకరు. యోగిగా పరిగణించ బడిన స్వాతంత్ర యోధుడతను. వేదాలను సామాన్య అర్థంలో చూడరాదని, అందులోని ప్రతీదానికీ వెనుక ఒక విశేష అర్థం, రహస్య జ్ఞానం ఉన్నాయని ఆయన భావించారు. సూర్యుడు అంటే తెలివితేటలు, అగ్ని అంటే శక్తి, సోమం అంటే తాదాత్మ్యత-ఇలా అర్థం చేసుకోవాలని అన్నారు. వేదాల్లో దాగివున్న పరమార్థం పామరులకు అర్థం కాకూడదనే వాటిని ఋషులు నిగూఢంగా ఉండేలా రచించా రని, పామరులు అర్థం చేసుకుంటే వాటిని దుర్వి నియోగ పరిచే ప్రమాదం ఉందని భావించారు.అయితే మరొక ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అరబింద ఘోష్‌ అభిప్రాయాలతో ఏకీభవించలేదు. ''అరబిందఘోష్‌ చెప్పిన దానిని అంగీకరిస్తే మన భారతీయ తత్వశాస్త్రం ఒక అత్యున్నత శిఖరం స్థాయిలో ప్రారంభమై క్రమంగా కిందికి దిగజారిపోతున్న క్రమంలో ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. కాని తత్వశాస్త్రం సాధారణ మానవ జాతి పరిణామక్రమంలో భాగంగా అభివృద్ధి చెందుతూ వస్తుందనేది విశ్వజనీన సత్యం. తొలినాటి ప్రాథమికమైన, మొరటుగా ఉండిన తాత్విక భావాల నుండి క్రమంగా అభివృద్ధి చెందుతూ భారతీయ తత్వశాస్త్రం అభివృద్ధి చెందింది. మొదట్లోనే అత్యంత ఘనంగా, లోపరహితంగా రూపొంది క్రమేణా దిగజారిపోయిందని భావించలేము.'' ఆధ్యా త్మికవాది అయినా, రాధాకృష్ణన్‌ చారిత్రిక దృష్టితో ఈ విషయంపై సరైన వైఖరినే తీసుకున్నారని, అరబిందఘోష్‌ వైఖరి సనాతన పాలకవర్గాలను బలపరిచేదిగా ఉందని స్పష్టమౌతూనే ఉంది కదా.


ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబ రావు ఇలా అన్నారు : ''దాచిపెట్టిన జ్ఞానం నిరుపయోగం కావడమే గాక ప్రజలను పీడించ డానికి సాధనమౌతుంది'' అని తెలిసినవాళ్లు చెబుతారు. వేదాల విషయంలో ఇదే జరిగినట్లు కనబడుతుంది. వేదాలను బ్రాహ్మణులు గుత్తకు తీసుకుని వేదాధ్యయనానికి నిషేధాలు కల్పించి అందులో ఏమున్నదీ ఎవరికీ తెలియకుండా చేశారు. ఈ పరిస్థితిని ఆధారం చేసుకుని కొందరు ముందుకుపోవడమంటే భయమూ, అసహ్యమూ కలవాళ్లు వేదాల్లో లేనిదేదీలేదని ప్రజలను నమ్మించజూశారు.'' ''వేదాలను గురించీ, ఆ కాలపు మనుషుల గురించీ తెలుసుకొనడం మనకీనాడు ఎంతైనా అవసరం. ఎందుకంటే అప్పటికీ, ఇప్పటికీ జీవితంలోనూ సమాజ స్వరూపంలోనూ ఊహించరాని మార్పులెన్నో వచ్చినా మన సంస్కృతి అంతా ఆ వేదాల మీదే ఆధారపడి పెరిగింది. ఈ ఇరవయ్యో శతాబ్ధంలో ఈ సంస్కృతిలో మౌలికమైన మార్పులు రాకపోతే మనం ప్రపంచ సంస్కృతికి వెనుకబడి వుండటం తప్పనిసరి అవుతుంది. అందుకని తెలిసినవాళ్లు వేదాలను గురించీ, వేదకాలపు జీవితం గురించీ సాధ్యమైనన్ని వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజెప్పాలి.'' ఇంతకీ వేదాల్లో ఉన్న తాత్విక సారాంశం ఏమిటి? భావవాదమా? లేక భౌతికవాదమా? అని ఎవరికైనా సందేహం రావచ్చు. రామాయణ మంతావిని రాముడికి సీత ఏమౌతుంది? అని ఒక పెద్దమనిషి అడిగాడట. దాన్ని కొట్టిపారెయ్య కుండా సీరియస్‌గా తీసుకుని ఆరుద్ర''రాముడికి సీత ఏమౌతుంది?'' అన్న పరిశోధక గ్రంథం రాశారు. అందువల్ల వేదాలలోని తాత్విక భావ జాల సారాంశం, వెయ్యి సంవత్సరాల వేదకాలంలోను, అనంతర కాలంలోను దానిలో వచ్చిన పరిణామం ఏమిటో తప్పకుండా తెలుసుకోవలసిందే. దానిని మరో వ్యాసంలో చూద్దాం.


Article From MarkistPaper Writen By ఎం.వి.ఎస్‌. శర్మ

No comments:

Post a Comment