Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Wednesday, April 25, 2012

నయా పోకడల మోజులో నవతరం


శాస్త్రీయ దృక్పథానికి భిన్నమైన ఆలోచనా ధోరణే అసలైన ట్రెండుగా చెలామణి అవుతున్న పరిస్థితి నేడు కనిపిస్తోంది. 'మార్కెట్‌ సంస్కృతి' తీసుకొస్తున్న నయా పోకడల మోజుతో, కెరీరిస్టు ధోరణితో యువతలో ప్రశ్నించే తత్వం, ఆత్మస్థయిర్యం, సామాజిక స్పృహ కనుమరుగవుతున్నాయి. చదువులో, మీడియాలో, ఆయా రంగాల్లో ఎక్కువగా ఫోకస్‌ అవుతున్న పెట్టుబడిదారి కట్టు కథనాల ప్రభావానికి టీనేజర్లు ఆకర్షితులవుతున్నారు. అదే అసలైన లైఫ్‌ స్టయిల్‌ అన్న భ్రమలకు లోనవుతున్నారు.
కెరీరిజం భ్రమల్లో, నయా పోకడల ఆకర్షణలో యువతలో అసలైన సామర్థ్యం కనుమరుగవుతోంది. మీడియా కూడా అతికొద్ది మందికి ఉపయోగపడే వాటినే ఎక్కువగా ఫోకస్‌ చేస్తోంది. మెజార్టీ యువతకు ఉపయోగపడే విషయాలను విస్మరిస్తోంది. 'వేణు చదువులో ధిట్ట. ఎప్పుడూ ఫస్టు క్లాసులో పాసయ్యేవాడు. కానీ డిగ్రీ దాకా చదివి ఆపేశాడు. ఫలితంగా టీచర్‌ కావాలన్న కల నెరవేరనే లేదు' ఎందుకని అడిగితే 'బి.ఇ.డి. చేసేందుకు రెండు లక్షలు కట్టలేక' అని బదులిచ్చాడు. రెండు లక్షలు పెద్ద విషయమేం కాదని కొందరు భావించొచ్చు. కానీ రెండువేలు కట్టేందుకు నానా అవస్థలు పడేవారే ఎక్కువ శాతం వున్నారు. అదే ప్రభుత్వ బి.ఇ.డి. కళాశాలల్లో ఫ్రీ అడ్మిషన్‌ వుండి వుంటే... 'వేణు మాత్రమే కాదు. అలాంటి ఇంకెందరికలో సాకారమౌతుంది. కానీ అలా చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. కొంతమందికి ఖరీదుతో కూడుకున్న ఉన్నతమైన చదువులు చదివేందుకూ, ఆ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు కార్పొరేటు సంస్థల ద్వారానో, బ్యాంకుల ద్వారానో లోన్లో, రాయితీలో కల్పిస్తుంది. ఇక్కడ ఉన్నత వర్గాల కొమ్ము కాస్తుంది.

చదువు 'కొంటూ' ఉన్నత స్థితికి ఎదిగే పరిస్థితి పేద, మధ్య తరగతి యువతలో ఉండట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గనుక పరిశీలిస్తే కనీసం పదోతరగతి వరకు చదివేందుకే అష్టకష్టాలు పడాల్సిన దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారి శాతం ఎక్కువే. వలసెళ్లిన తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కాయిన్‌ బాక్సులో వేసేందుకు రెండు ఒక్కరూపాయి బిళ్లలకోసం ఇబ్బందిపడే యువతీ యువకులు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ మారుమూల గిరిజన తండాకెళ్లినా, గూడేనికెళ్లినా, గ్రామాల్లోని దళిత వాడల్లోకెళ్లినా కన్పిస్తారు. ఇలాంటి వారి బతుకుల్లో వెలుగు పూలు పూయించే ఆర్థిక విధానాలూ, ప్రభుత్వ పాలసీలూ ఉండవు. ఉన్నా అవి ఏ కొద్దిమందికో మాత్రమే ఉపయోగ పడుతుంటాయి. దీనివెనుకనున్న మూల కారణాలు వెలికి తీసే ప్రయత్నం కూడా చేయని కొన్ని ప్రసార సాధనాలు అతికొద్ది మంది ధనిక వర్గాల జీవన పరిస్థితులను ఆకాశానికెత్తేస్తుంటాయి. అవి వాస్తవాలుగా నమ్మించేందుకు, యువతను భ్రమల్లో ముంచేందుకు ప్రయత్నిస్తుంటాయి.

నూటికి 90 శాతం యువతరం లైఫ్‌ స్టయిల్‌ను ప్రతిబింబించే బతుకు చిత్రం ఎక్కడా కనిపించదుగానీ ఏ కొద్దిమందో అనుభవిస్తున్న భోగ భాగ్యాల గురించి మాత్రం అద్భుతంగా ఫోకస్‌ చేస్తుంటారు. 'పబ్‌ కల్చర్‌ గురించీ, కొత్తకొత్త ఫ్యాషన్‌ల గురించీ 'బైక్‌ రేస్‌' గురించీ, పెద్దపెద్ద బిజినెస్‌ చదువుల గురించీ పత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కవరేజీ చూస్తే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని యువతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాస్తవానికి ఒక్క గంటకు తక్కువలో తక్కువ ఐదారువేలు ఖర్చుపెట్టి పబ్బుల్లో ఎంజారు చేసే స్థోమత ఎంతమంది యువతకుంటుంది? లక్షల్లో అడ్మిషన్‌ ఫీజలు చెల్లించి చదువు'కొనే' పరిస్థితి ఎందరికుంటుంది? రకరకాల బైకులు కొనే స్థోమత, రేసింగ్‌లో పాల్గొనే ఆసక్తి ఎవరికుంటుంది? వేలల్లో ఖరీదు చేసే ఫేస్‌ క్రీములు ఏ మధ్య తరగతి యువత కొనగలదు? బిల్‌గేట్స్‌లాగో, టాటాబిర్లాలాగో గొప్పవాళ్లు కావాలన్న కలలు కనాలని చెప్పే మాటలు ఎవరికి ఉపయోగపడతాయి? అంటే... సమాజంలోని కొంతమంది ధనికవర్గాలు అనుసరిస్తున్న పోకడలనే ఈతరం యువత మొగ్గుచూపుతున్న ట్రెండుగా ప్రచారం కల్పిస్తోంది పెట్టుబడిదారీ మీడియా. కానీ అత్యధిక శాతం వున్న పేద, మధ్య తరగతి యువత జీవన చిత్రాన్ని ప్రతిబింబించేది, ప్రతిభను వెలికి తీసేది, ఏదీ ప్రచారానికి నోచుకోవట్లేదు. కార్పొరేట్‌ ప్రతిభ ధాటికి సామాన్య యువత ప్రజ్ఞ పనికి రాకుండా పోతోంది. కారణం.... పెట్టుబడుల కట్టుకథల భావనలు యువత మెదళ్లను రకరకాలుగా ప్రభావితం చేస్తున్నాయి. పత్రికల ద్వారా, సినిమాల ద్వారా, ప్రకటనల ద్వారా, ఇంటర్నెట్‌ ద్వారా ఇవి విస్తరిస్తున్నాయి.

నేడు చాలా సంస్థలు, కంపెనీలు తాము మెరిట్‌ ప్రకారమే అవకాశాలు కల్పిస్తామంటున్నాయి. ప్రతిభకు, అర్హతలకు, కమ్యూనికేషన్‌ స్కిల్సుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇంతకీ మెరిట్‌ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? సాధిస్తే వస్తుందా? అలా అయితే అందరూ ఎందుకు సాధించట్లేదు? ఇక్కడా ఓ కారణం ఉండే ఉంటుందన్న అనుమానం అక్కర్లేదు. కచ్చితంగా వుంటుంది. నేడు మెరిట్‌గా చెలామణి అవుతున్న వారంతా అవి సాధించడానికి కావలసిన ఆర్థిక పరిస్థితులూ, ప్రోత్సాహం, ఇతర కారణాలు అనుకూలించిన వారే ఎక్కువశాతం ఉంటున్నారు. అంటే... అనుకూల వాతావరణం వుంటే మెరిట్‌ ఎవరైనా సాధిస్తారు. కానీ నేడా పరిస్థితి ఉన్నవారు సమాజంలోని నాన్‌మెజార్టీ ధనికవర్గమే కాబట్టి మెరిట్‌ క్రెడిట్‌ అంతా వారికే దక్కుతోంది. అలాంటప్పుడు మెరిట్‌ ప్రకారం కొలువులన్నప్పుడు అవి ఏ వర్గ యువతకు దక్కుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఇలాంటి అంతరాలు సమసిపోవాలంటే అందరికీ మెరిట్‌ సాధించే ఆర్థిక స్థోమత చేకూర్చగల ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇప్పుడున్నవన్నీ అవి కావుకదా! అందుకే మెరిట్‌ వెనుక ఉన్న వాస్తవ ప్రతిభ తొక్కివేయబడుతోంది.

నేడు కెరీర్‌కు అత్యంత ప్రాధాన్యతే కాదు, ప్రచారమూ అలాగే లభిస్తోంది. అది వ్యక్తి ఉన్నతికీ, సమాజానికీ ఉపయోపడేదైనంత వరకు ఇబ్బంది లేదు. కానీ దాని పేరుతో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వ్యాపారమయమౌతున్నాయి. చివరికీ కెరీరిజం మోజులో వాస్తవానికి దూరంగా, సామాజిక స్పృహలేని వారిగా యువతరం తయారవుతోంది. ఉన్నతమైన కెరీర్‌ ప్రారంభించాలనుకుంటే అందుకు సంబంధించిన కోర్సులు చదవాలి. అవి చదవాలంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలి. అనుకూలించినా అవకాశం దక్కాలి. అంటే... లక్షలతో ముడిపడి ఉన్నప్పుడు? కనీసం మూడుపూటలా తిండికిలేని కుటుంబం నుంచి వచ్చిన యువతీ యువకులు తమ కలను ఎలా సాకారం చేసుకోగలరు? ఐఐఎం, ఐటిఐ, ఇంజనీరింగ్‌, యానిమేషన్‌ లాంటి కెరీర్లో ఎలా ప్రవేశించగలరు? ఇవన్నీ కార్పొరేట్‌ సంస్థ చేతుల్లో ఉన్నప్పుడు సామాన్య యువత ఎలా చదువు 'కొనగలదు' అదే ప్రభుత్వాధీనంలో ఉంటేనో, ప్రభుత్వ సహకారం ఉంటేనో, ప్రజలందరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధానాలు అమలైతేనో సామాన్యులు కూడా తమ లక్ష్యం నెరవేర్చుకోగలరు. కానీ ఇక్కడ ఒక పథకం ప్రకారమే కొద్దిమందికి ఉపయోగపడే పాలసీలే మన పాలకులు ప్రవేశపెడుతున్నప్పుడు ఉన్నతమైన కెరీర్‌ అనేది సామాన్య యువత రంగుల కలగానే మిగులుతోంది.

అప్పటి ట్రెండునుబట్టి నడ్చుకోవాలి? లేకపోతే అది నామోషీగా ఫీలయ్యే వారెక్కువ. మరి నేటి ట్రెండ్‌ ఏంటి? వాస్తవంగా ఎక్కువమంది అనుసరించేదో, ఎక్కువమంది జీవన పరిస్థితిని ప్రతిబింబించేదో అసలైన ట్రెండ్‌! కానీ మీడియా ప్రచారం పుణ్యమా అని బయట మాత్రం వేరేలా అర్థం చేసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి యువతరం పోకడలను, వారి బతుకు చిత్రాలను పట్టించుకోవట్లేదు. కానీ కొంతమంది ఉన్నత వర్గాలవారు అనుసరించే, అనుకరించే, అనుభవించే జీవన విధానాన్నీ, వినోదాన్నీ అదే సర్వస్వమైనట్లు, అదే అందరికీ శిరోధార్యమైనట్లు, అదే అసలైన ట్రెండ్‌ అయినట్లు ప్రచారం కల్పిస్తోంది. ఫ్యాషన్‌ పోకడలు, పబ్‌కల్చర్‌, వెస్ట్రన్‌ కల్చర్‌, మదర్స్‌డేలు, ఫాదర్స్‌డేలు, బర్త్‌డేలు, ఫ్రెండ్‌షిప్‌డేలు, లవర్స్‌ డేలు, కొద్దిమంది ఉన్నత వర్గాల విలాసవంతమైన జీవన విధానాలు.... ఇవే నేడు ట్రెండుగా చెలామణి అవుతున్నాయి. తాజ్‌, ఒబెరారు రెస్టారెంట్ల యజమానులు కూడా ఒకప్పుడు హోటల్లో పనిచేశారు. ఎంతో కష్టపడి పైకొచ్చారు. (హోటల్లో జీవితాంతం పనిచేసినా' ఒక్క తాజ్‌ హోటల్‌ నిర్మాణానికి కావాల్సిన డబ్బులు కూడబెట్టడం కష్టం) ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తికి సొంత ఇల్లు కూడా లేదు. (చెవిలో పువ్వులు పెట్టడమంటే ఇదే), సోనియాగాంధికీ కారు లేదు. (కొనుక్కునే ఆర్థిక పరిస్థితి లేకనా?) ఇలాంటి విషయాలు కూడా కొన్ని సైకాలజీ గ్రంథాల్లో ప్రస్తావిస్తూ వారి మంచితనాన్ని ఆదర్శంగా తీసుకొమ్మంటారు.

ఒక గొప్ప వ్యాపారవేత్తను ఆదర్శంగా తీసుకొనో, పారిశ్రామికవేత్తను రోల్‌మోడల్‌గా తీసుకొనో, లేకపోతే అమితాబ్‌ బచ్చన్‌ లాంటి వారి విజయాలను వరుసబెట్టి చెబుతూ మీరూ అలా ఎదగండనో చెబుతుంటారు. అలా ఎదిగేందుకు సంకల్పం, కృషి, పట్టుదల, తపన, సాధన, లక్ష్యం ఉండాలని గట్టిగా చెబుతుంటారు. కానీ అలా ఎదగాలంటే అందుకు తగిన పరిస్థితులు ఎందుకు ఉండట్లేదు? ఆర్థిక పరిస్థితులు అందరికీ ఎందుకు అనుకూలించట్లేదు? ఈ వ్యవస్థలో ఉన్న లోపాలేమిటి? అన్న విషయాలు ఎక్కువ శాతం యువత మొగ్గు చూపుతున్న 'కెరీరిస్టు' 'పర్సనల్‌ స్కిల్స్‌, ఇతర సైకాలజీ గ్రంథాల్లో ఉండట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే అవి ఉన్న వ్యవస్థలోనే ఉన్నత స్థితికి ఎదిగేందుకు కావాల్సిన మాటలు చెబుతాయి. (అవి ఆచరణ సాధ్యమో కాదో మాత్రం పట్టించుకోవు) అంతేతప్ప వ్యవస్థలో సమూల మార్పునకు, సమిష్టి తత్వానికి కావలసినదేదీ అందులో ఉండట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి మానసిక దౌర్భల్యుల్ని తయారు చేయడమో, భ్రమలు కలుగ జేయడమో చేస్తున్నాయి. కానీ నయా పోకడల ముసుగులో విస్తరిస్తున్న అంతరాల సమాజాన్నీ, దుర్భర వ్యవస్థనూ మార్చే ఆచరణ సాధ్యమైన చైతన్య స్థాయిని కల్పించట్లేదు. అందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పించే సరైన మార్గం చూపట్లేదు.

** article from prajasakti  prajasakti.com

No comments:

Post a Comment