దాదాపు నాలుగు వందల సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాపితంగా పలువురు సంపాదకులు, యజమానులు సమకూర్చిన పత్రికల విశ్వసనీయతను నలభై సంవత్సరాల కాలంలో తలెత్తుకోలేనంతగా దెబ్బతీసిన దుష్టశక్తి రూపర్ట్ మర్డోక్. ఎక్కడ తిరిగితే నాకేం నా దొడ్లో ఈనటం ముఖ్యం అని తలచే బాపతు మర్డోక్. ఏం చేస్తారో నాకనవసరం సంచలనాత్మక వార్తలతో నా పత్రికలు, టీవీ ఛానళ్లు లాభాలు సంపాదించాలి, ప్రపంచమంతటా నా సామ్రాజ్యం విస్తరించాలని ఆదేశించిన తరువాత జర్నలిస్టులు,ప్రచారం కోసం తహతహలాడే అధికార రాజకీయ నాయకులు, అయితే నాకేంటి అనే పోలీసు అక్రమార్కులు కలిసి విలువల వలువలను విప్పేశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు మర్డోక్‌గేట్ అక్రమాలు ఐరోపా, అమెరికా ఖండాలను గత రెండు వారాలుగా అనేక మలుపులు తిప్పుతున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు గలవారి వ్యక్తిగత అంశాల వంటి వాటితో ప్రారంభించి చివరకు ఉగ్రవాదుల దాడులు, ఇతర సందర్భాల్లో మరణించిన వారిని కూడా వదల కుండా వేలాది కుటుంబాల దైన్య స్థితిని కూడా సొమ్ము చేసుకొనే హీన స్థాయికి మర్డోక్ కంపెనీలు దిగజారాయి. తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటన్‌లో అపహరణకు గురై హత్యగావించబడిన 13 సంవత్సరాల బాలిక ఉదంతం ఇప్పుడు మర్డోక్ మెడకు చుట్టుకుంది. ఆమె చివరి సారిగా పంపిన వాయిస్ మెయిల్, ఈ మెయిల్స్‌ను ఆమె బాక్సునుంచి న్యూస్ ఆఫ్ ది వరల్డ్ అనే మర్డోక్ పత్రికకు చెందిన జర్నలిస్టులు తొలగించారు. దాంతో ఆమె కనిపించకుండా పోయిందని అందరూ అనుకునేట్లు చేశారు. ఇది వెల్లడి కావటంతో దాదాపు నాలుగువేల మంది ప్రముఖుల ఫోన్లు, ఇమెయిల్స్‌ను అక్రమంగా వినటం, సమాచారాన్ని తస్కరించడం వంటివి చేశారని వార్తలు వస్తున్నాయి. తొలుత తమ సిబ్బంది అంతా పత్తిత్తులే అని బుకాయించిన మర్డోక్ అక్రమాల తీవ్రతను తగ్గించేందుకు చివరకు న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికను మూసివేసి అక్రమాలను సహించేది లేదన్నట్లుగా ఫోజు పెట్టాడు. చివరకు సీసాలో బంధించిన దుష్టశ క్తి తన విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లుగా కుంభకోణం తీవ్రత వెల్లడి కావటంతో తమ వారు చేసిన తప్పుడు పనుల తీవ్రత తనకు తెలియదని అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తన పత్రికల్లో పేజీల పేజీల ప్రకటనలు జారీ చేశాడు.
లేబర్ పార్టీ మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ కూడా మర్డోక్ ఫోన్ ట్యాపింగ్‌కు బలయ్యాడు. తనను పదవి నుంచి తప్పించటానికి పేరు మోసిన క్రిమినల్స్‌ను వినియోగించి సండే టైమ్స్ పత్రిక తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించిందని స్వయంగా చెప్పాడు. తమకు అవసరమైన సమాచారం ఇవ్వని వారికి లంచం ఇవ్వటం,లొంగనివారిని బ్లాక్ మెయిల్, వేధించటం, ఇలాంటి అక్రమాలకు పోలీసులకు లంచాలిచ్చి వారి నుంచి సమాచారం, సహకారం పొందటం మర్డోక్ నిత్య వ్యవహార శైలి. అక్రమాలకు పాల్పడేవారి సమాచారం సేకరించటంతో పాటు అలాంటి పనులకు అసలు వారినే ఉపయోగించుకోవటంలో కూడా ఘనుడు మర్డోక్. ఈ క్రమంలో అలాంటి అక్రమార్కులకు జర్నలిస్టుల ముద్రవేసి వారిని తన పత్రికల కాలమిస్టులుగా నియమించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సకల అవాంఛనీయ కార్యకలాపాలను నడిపించిన రెబెకా బ్రూక్స్ అనే మహిళా ఎడిటర్, అమెరికా నుంచి వెలువడే వాల్‌స్ట్రీట్ జర్నల్ ముద్రాపకుడు లెస్ హింటన్ శుక్రవారం నాడు రాజీనామా చేసి ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. మర్డోక్‌గేట్ వార్తలతో స్టాక్ మార్కెట్‌లో మర్డోక్ సంస్థల వాటాల రేట్లు పతనం కావటంతో మీడియా సామ్రాజ్యంలో ఏడుశాతం వాటా కలిగిన సౌదీ రాజ కుటుంబీకుడు ఒకరు రెబెకాను తొలగించాలని వత్తిడి చేసిన తరువాతే ఆమె రాజీనామా చేశారు. అమెకంటే ముందు సంపాదకుడిగా ఉన్న హింటన్ కూడా అనివార్యంగా అదేదారి పట్టాడు. ఈ వరుసలో వారికి సహకరించిన స్కాట్లండ్ యార్డ్ పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురు, మర్డోక్ కుమారులు, చివరకు మర్డోక్‌కూడా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మర్డోక్ పత్రికల జర్నలిస్టులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అందుకు అవసరమైన సొమ్మును కూడా తానే మంజూరు చేశానని అయితే వాటి తీవ్రత తనకు తెలియదని మర్డోక్ కొడుకు బుకాయిస్తున్నాడు. తన మీడియా ద్వారా ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాల్లోని రెండు పార్టీల వ్యవస్థల్లో అధికార ప్రతిపక్షం రెండింటినీ మర్డోక్ ప్రభావితం చేస్తున్నాడు. ఎవరు గెలిచినా వారివెనుక చేరటం తన సంపదను పెంచుకోవటం అతగాడి స్వభావం. మూడు దేశాల్లోనూ మీడియాపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నందున ఆయా పార్టీల వారు మర్డోక్ మద్దతు కోసం నానా గడ్డీ కరుస్తారు. అందువల్లనే సాక్షాత్తూ బ్రిటన్ ప్రధాని కామెరాన్ మర్డోక్ ఫోన్‌ట్యాపింగ్ అక్రమాలపై పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశించినా, అమెరికా ఎఫ్‌బిఐని రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించినా మర్డోక్ మాఫియాకు ఎలాంటి ఆటంకం ఉండదని అనేక మంది చెబుతున్నారు. దానికి నిదర్శనమా అన్నట్లు న్యూస్‌ఆఫ్ ది వరల్డ్ అక్రమాల వివరాలున్న కంప్యూటర్లను ఇంతవరకు లండన్ పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఈలోగా వాటిలోని సమాచారాన్ని, ఇతర ఫైళ్లను ధ్వంసం చేసేందుకు మర్డోక్ యంత్రాంగానికి వ్యవధి ఇచ్చారన్నది స్పష్టం. మూల విరాట్టులను వదలి ఉత్సవిగ్రహాలను పట్టుకున్నట్లుగా సూత్రధారుల జోలికెళ్లకుండా పాత్రధారులుగా బయటపడిన వారిని ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు.
స్టార్ టీవీతో ప్రారంభమైన మర్డోక్ సామ్రాజ్యం మింట్ వంటి ఆంగ్ల పత్రికతో మన దేశంలో కూడా విస్తరించటం ప్రారంభమైన విషయం అంతగా తెలియదు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా కాపీ కొట్టటంలో తిరుగులేని సామర్ధ్యం ఉన్న కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు మన దేశంలో, రాష్ట్రంలో మర్డోక్ మాఫియా జర్నలిజాన్ని అమలు చేయటం అనేక ఉదంతాలలో గమనించవచ్చు. తమకు అనుకూలమైన వారికి బాకాలూదటం, లేనివారిని విస్మరించటం చూస్తున్నాము. ఇలాంటి శక్తులను ఒక కంట కనిపెట్టి అప్రమత్తం కాకపోతే లాభాలే ధ్యేయంగా ఈ రంగంలోకి ప్రవేశించిన వారు తెల్లవారేసరికి మరో మర్డోక్‌గా మారేందుకు మాఫియా జర్నలిజాన్ని మరింతగా విస్తరిస్తారని, మన ప్రజాస్వామ్య, పౌరహక్కులకు, సామాజిక వ్యవస్థకు ముప్పు తెస్తారని గ్రహించటం అవసరం.
Editorial From : prajasakti
No comments:
Post a Comment