Some Quotes
Thursday, September 16, 2010
సెప్టెంబరు17 చరిత్రకు వక్రభాష్యాలు
జమిందారీ దోపిడీకి, వెట్టిచాకిరీకి, నైజాం నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటమే హిందూ, ముస్లిం పేదలను ఐక్యంగా నడిపింది. కులమత భేదాలకు అతీతంగా పోరాట యోధులు రక్తతర్పణ చేశారు. ఇప్పుడు సమస్య విలీనమా, లేక విమోచనా అన్నది కాదు. నాటి పోరాట కర్తవ్యాలు ఇంకా పూర్తి కాలేదు. చర్చ జరగవల్సిందీ, ఉద్యమించవలసిందీ వాటి గురించే. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సందర్భంగా గతాన్ని స్మరించుకునేది ఇందుకోసమే.
సెప్టెంబర్ 17 మరోసారి చర్చనీయాంశమైంది. విలీనమా? విమోచనా? విద్రోహమా? అంటూ కొన్ని రాజకీయ పార్టీలు కూడా చర్చోపచర్చలు చేస్తున్నాయి. అందరూ తెలంగాణా గురించే మాట్లాడుతున్నారు. ఏ తెలంగాణ గురించి అన్నదే అసలు సమస్య. ఈ చర్చోపచర్చల్లో, అసలైన సమస్యలు మరుగున పడుతున్నాయి. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుల పాత్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదం గురించి ఎవరికి తోచిన రాతలు వారు రాస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్రం గురించి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. వేరు తెలంగాణ గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కాని వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యం, దాని పునాదులు, తీరుతెన్నులు వేరు. వీరతెలంగాణ పోరాటాన్ని, వేరు తెలంగాణ చర్చను, కలగాపులగం చేయటం సమంజసం కాదు. చరిత్రను చరిత్రగా చూడాలి.
వీర తెలంగాణ విప్లవ పోరాటం చారిత్రాత్మకమైనది. మధ్య యుగాల నాటి అణచివేతపై ప్రజా తిరుగుబాటు. దేశంలోనే అతిపెద్దదైన హైదరాబాద్ సంస్థానంలో దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, జమిందార్ల నిరంకుశ ఫ్యూడల్ దోపిడీకి హద్దుల్లేవు. ముందు జమిందార్లు, జాగీర్దార్ల భూముల్లో దున్నిన తరువాతనే రైతాంగం తమ భూమి దున్నుకోవాలి. చేతివృత్తిదార్లు తమ ఉత్పత్తులను వీరికి ఉచితంగా కట్టబెట్టాలి. వీరి కుటుంబాలలో ఉత్సవాల సందర్భంగా గొర్రెలు, మేకలు, కోళ్ళు ఉచితంగా ముట్టజెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తుకు అదనం. జమిందార్ల బిడ్డలను అత్తవారింటికి పంపేటపుడు, వారికి తోడు అత్తవారింట చాకిరి చేయడానికి దళిత బాలికలను పంపించేవారు. జమిందార్లు, అధికారుల ఇండ్లలోనూ, కార్యాలయాల్లోనూ వెట్టిచాకిరీకి, గ్రామంలో కుటుంబానికి ఒకరు చొప్పున పంపాలి. ఈ ఫ్యూడల్ దోపిడీికి, వెట్టిచాకిరీకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉప్పొంగిన తిరుగుబాటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.
ఈ పోరాటంలో తొలి అమరుడు బందగీ. ఆయనను 1941 జూలై 17న భూస్వామ్య గూండాలు హత్యచేశారు. సంఘం కార్యకర్త (ఆంధ్రమహాసభను సంఘం అని పిలిచేవారు) ఐలమ్మ భూమిమీద పంటను కాజేయడానికి వచ్చిన దేశ్‌ముఖ్‌ల గూండాలను రైతాంగం తరిమికొట్టింది. ఐలమ్మ పంటకు రక్షణ కల్పించింది. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేని దేశ్‌ముఖ్‌ల గూండాలు 1946 జూలై 4న దొడ్డి కొమరయ్యను పొట్టన పెట్టుకున్నారు. దానితో అగ్గి రగిలింది. క్రమంగా తిరుగుబాటు సాయుధ రూపం దాల్చింది.
1928లోనే మాడపాటి హనుమంతరావు నాయకత్వంలో ఆంధ్రమహాసభ ప్రారంభమైంది. 1934లో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రలో ఆవిర్భవించింది. 1940 నాటికే నైజాంలో ఆంధ్రమహాసభను సమైక్య ప్రజాసంస్థగా, నైజాం వ్యతిరేక ప్రజాశక్తుల వేదికగా కమ్యూనిస్టు పార్టీ రూపొందించింది. ఫ్యూడల్ వ్యతిరేక, నైజాం వ్యతిరేక పోరాటం నడిపింది కమ్యూనిస్టు పార్టీ. జమిందార్ల దౌర్జన్యాలు, నైజాం సైన్యాల అణచివేత, రజాకార్ల (వాలంటీర్ల పేరుతో ఏర్పడిన నిజాం ప్రైవేటు సైన్యం) దాడులను ఎదిరించి సాగిన సుదీర్ఘ పోరాటమది. ఈ క్రమంలోనే 1946లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం పుచ్చలపల్లి సుందరయ్య పిలుపునిచ్చారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం ప్రకటించినప్పటికీి, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి నిరాకరించింది. నైజాం సర్కారుకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం కొనసాగింది.
స్వాతంత్య్రోద్యమకాలంలో, హైదరాబాద్ వంటి సంస్థానాలకు వ్యతిరేకంగా పోరాటానికి కాంగ్రెస్ సిద్ధపడలేదు. స్వాతంత్య్రానంతరం కూడా నైజాంతో సహా సంస్థానాధీóశులతో రాజీకే సిద్ధపడింది. నైజాం సర్కారు స్వతంత్ర రాజ్యంగా కొనసాగడానికి కేంద్ర కాంగ్రెసు ప్రభుత్వం అంగీకరించింది. కమ్యూనిస్టుపార్టీ నేతృతంలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం మాత్రం అసఫ్‌జాహీ వంశపు మధ్యయుగాల నాటి రాచరిక పాలన పునాదులను కుదిపేసింది. నైజాం సర్కారు కూలిపోవడం తథ్యం అని తేెలిపోయింది. అదే జరిగితే ఈ ప్రాంతమంతా కమ్యూనిస్టుల అధిపత్యం కిందకు వస్తుంది. అది గమనించిన నెహ్రూ ప్రభుత్వం, గోల్కొండ ఖిల్లా పునాదులు కదులుతున్న సమయంలో, 1948 సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలను రంగంలోకి దించింది. అందుకే నాలుగు రోజులు తిరగకుండానే, ఏ ప్రతిఘటన లేకుండానే సెప్టెంబర్ 17న నైజాం సర్కార్ లొంగిపోయింది.
నిజాం లొంగిపోయిన మరుక్షణం, ఆ ప్రజాకంటకుడైన రాజునే రాజ ప్రముఖ్‌గా నెహ్రూ ప్రభుత్వం నియమించిన విషయం మరువలేం. ఏడాదికి 50లక్షలు నష్ట పరిహారంగానూ, మరో 50లక్షల రూపాయలు రాజ భరణాలుగానూ ముట్టజెప్పింది. గ్రామాల నుండి పారిపోయిన జమిందార్లు, జాగీర్దార్లు, షేర్వాణీలు విడిచి ఖద్దరు బట్టలు, తెల్ల టోపీిలతో మళ్లీ గ్రామాలకు చేరుకోడానికి, పేదల అధీóనంలో ఉన్న భూములను తిరిగి స్వాధీóనం చేసుకునేందుకు నెహ్రూ సైన్యాలు అండగా నిలిచాయి. ప్రతిఘటించిన రైతాంగం పైన భయంకరంగా దాడులు చేశాయి. ఈ పరిస్థితులలో సుదీర్ఘపోరాటంలో సాధించుకున్న భూములు, ఇతర హక్కుల పరిరక్షణ కోసం కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో రైతాంగం సాయుధ పోరాటం కొనసాగించక తప్పలేదు. 1951 అక్టోబర్ 21 వరకు ఈ పోరాటం సాగింది.
భూమి కోసం, భుక్తికోసం సాగిన ఈ పోరాటంలో 6వేల మంది ప్రాణాలొడ్డారు. 10వేల మంది కమ్యూనిస్టులు, ప్రజాపోరాటయోధులు మూడు, నాలుగు సంవత్సరాల పాటు నిర్బంధ శిబిరాలలో, జైళ్ళలో మగ్గవలసి వచ్చింది. 50వేల మంది పోలీస్ క్యాంప్‌లలోనూ, మిలటరి క్యాంప్‌లలోనూ వారాలు, నెలలతరబడి చిత్రహింసలకు గురయ్యారు. గ్రామాల్లో లక్షలాది ప్రజల మీద దాడులు చేశారు. ఆస్తులు లూటీ చేశారు. మహిళలను మానభంగాలకు, అవమానాలకు గురిచేశారు. నెహ్రూ సైన్యాలు రాక ముందు 1,500 మంది మరణిస్తే, అవి చేరిన తరువాత మరో 2,500 మంది ప్రత్యక్షంగా వారి తుపాకులకు బలయ్యారు. మరో 2వేల మంది కాన్‌సన్‌ట్రేషన్ క్యాంప్‌లలో తనువు చాలించారంటే, నెహ్రూ సైన్యాలు ఎవరిమీద యుద్ధానికి వచ్చాయో అర్థ్ధం చేసుకోవచ్చు. కాశ్మీర్ సంస్థానం విలీనం సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో కేంద్రం ఎంత ఖర్చు చేసిందో, ఇక్కడ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచడానికి కూడా అంత ఖర్చు చేసింది.
ఈ సాయుధ రైతాంగ పోరాటంలో 10వేల మంది గ్రామదళ సభ్యులు, 2వేల మంది గెరిల్లాదళ సభ్యులతో కూడిన ప్రజాసైన్యం పాల్గొన్నది. 16వేల చ.మైళ్ళ భూభాగంలో ప్రజారాజ్యం స్థాపించింది. 10 లక్షల ఎకరాల భూమి పంచింది. 3వేలగ్రామ రాజ్యాలను ఏర్పాటుచేసింది. బేదఖళ్లు నిలిచిపోయాయి. వెట్టిచాకిరి రద్దు చేశారు. వడ్డీ భారాల నుంచి పేద రైతులకు విముక్తి కల్పించారు. వ్యవసాయ కార్మికుల కనీస వేతనాలు అమలు జరిపారు. ప్రజాకంటక అటవీ అధికారులను తరిమివేసి గిరిజనులను కాపాడారు. ఈ పోరాటంలో పురుషులతో సమానంగా, మహిళలు తమ ప్రాణాలొడ్డి పోరాడారు. ఈ క్రమంలోనే మహిళలకు పురుషులతో సమాన హక్కులు గ్యారెంటీ చేయబడ్డాయి. కుల,మత భేదాలను మరిచి పేదలంతా సమైక్యంగా అగ్రకుల భూస్వాముల దురహంకారంపై తిరగబడ్డారు. గ్రామరాజ్యాల్లో అందరూ సమానంగా గుర్తింపు పొందారు. ఈ పోరాట ఫలితంగానే భూమి సమస్య దేశ ఎజెండా మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా భూసంస్కరణల చట్టం, కౌల్దారి రక్షణచట్టం చేయవలసి వచ్చింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కూడా ఈ పోరాటం మార్గం సుగమం చేసింది.
హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావటంతో, మరాఠీ మాట్లాడే ఐదు జిల్లాలు మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే 3జిల్లాలు కర్ణాటకలోను విలీనం చేశారు. దీనితో మద్రాసు నుండి ఆంధ్రప్రాంతాన్ని వేరు చేయాలన్న ఉద్యమం ఊపందుకున్నది. పొట్టి శ్రీరాములు మరణానంతరం ఆంధ్రరాష్ట్రం అవతరించింది. 1892లో పుట్టిన ఆర్యసమాజ్ కానీ, 1927లో పుట్టిన ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ కాని, హిందూ-ముస్లిం సామాన్య ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి ప్రయత్నించాయి. హుమ్నాబాద్, గుల్బర్గా, ఉద్గిర్, ధూల్‌పేట వంటి ప్రాంతాల్లో మత ఘర్షణలను రెచ్చగొట్టారు. జమిందారీ దోపిడీకి, వెట్టిచాకిరీకి, నైజాం నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటమే హిందూ, ముస్లిం పేదలను ఐక్యంగా నడిపింది.
కులమత భేదాలకు అతీతంగా పోరాట యోధులు రక్తతర్పణ చేశారు. ఇప్పుడు సమస్య విలీనమా, లేక విమోచనా అన్నది కాదు. నాటి పోరాట కర్తవ్యాలు ఇంకా పూర్తి కాలేదు. చర్చ జరగవల్సిందీ, ఉద్యమించవలసిందీ వాటి గురించే. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సందర్భంగా గతాన్ని స్మరించుకునేది ఇందుకోసమే. సెప్టెంబర్ 17 విలీనం నిజమే, విమోచనా నిజమే. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయినది ఒక చారిత్రక వాస్తవం. నైజాం రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలో అడుగుపెట్టిందీ నిజమే. ముస్లిం రాజు నుండి హిందువులకు విమోచన కలిగించినట్లు చిత్రీకరిస్తూ మతం రంగు పులిమే వారు కొందరైతే, ప్రత్యేక తెలంగాణా వాదానికి ముడిపెట్టే వారు మరికొందరు. ఈ రెండు వాదనలు చరిత్రకు వక్ర భాష్యాలే.
ఇక విద్రోహ దినం అనటంలో అర్థంలేదు. నిజాం నిరంకుశ రాచరికం కూలిపోవడాన్ని సర్వత్రా హర్షించారు. తర్వాత కాలంలో కొందరు, ఈ సాయుధ పోరాటాన్ని 1951 అక్టోబరు తర్వాత కూడా కొనసాగించి వుండాల్సిందనే వాదనను ముందుకు తెచ్చారు. ఇక్కడి నుండి దేశం మొత్తాన్ని పెట్టుబడిదారీ, భూస్వామ్య పాలన నుండే విముక్తి చేయగలిగివుండే వారమని వీరి వాదన. కానీ వాస్తవ పరిస్థితులు, దేశంలో ప్రజలు అందుకు సిద్ధంగా లేరన్న వాస్తవం వీరికి ఆరు దశాబ్దాలు గడిచినా అర్థ్ధం కాలేదు. 1948లో కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ తీర్మానం, భారతదేశానికింకా స్వాతంత్య్రం రాలేదనే అంచనా ప్రకటించింది. అది కూడా సరైంది కాదని త్వరలోనే తేలిపోయింది. తెలంగాణా ప్రాంతంలో ఒకరిద్దరు నాయకులు, ఆనాటి హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయొద్దని ప్రకటించటంతో, వారి మీద కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర కమిటీి చర్య తీసుకున్నది. ఈ ఘటనలను కూడా, ఇప్పుడు కొందరు వక్రీకరించి తప్పుడు భాష్యం చెబుతున్నారు.
ఈ పోరాటం ఎజెండా పైకి తెచ్చిన భూమి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. కేంద్రం, కౌల్దారి చట్టం గురించి గాని, భూసంస్కరణ చట్టం గురించి గాని ముందుగానే ఊదరగొట్టి భూస్వాములు జాగ్రత్త పడడానికి తోడ్పడింది. కాపాడుకోగలిగినంత భూమిని భూస్వాములు అడ్డదారుల్లో సర్దుకున్న తరువాత కూడా 16,63,881 ఎకరాలు మిగులు భూమి ఉన్నట్లు డిక్లేరేషన్ ఇవ్వక తప్పలేదు. అయినా, నేటికీ అందులో మూడో వంతు కూడా పేదలకు పంచలేదు. ఇది కాక 17,35,000 ఎకరాల సాగుకు లాయకైన పడావు భూమి ఉన్నది. 16,90,000 ఎకరాల పచ్చిక బయళ్ళు, 6,92,500 ఎకరాల ఇతర భూములు కూడా పంచేందుకు అవకాశం ఉన్నదని కూడా తేలింది. ఇది కాక ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య వివాదాల్లో ఉన్న మరో 75 లక్షల ఎకరాల భూమి, మరో 3,75,000 ఎకరాల దేవాదాయ భూమి కూడ పంచేందుకు అవకాశం ఉన్నది. అయినా ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధ్దంగా లేదు. గత ఐదారు సంవత్సరాలలో పంచినట్లు చెప్పుకుంటున్న రాళ్ళురప్పల భూమి లెక్కిస్తే కూడా సుమారు 7లక్షల ఎకరాలకు మించలేదు. అది కూడా కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వమే నియమించిన కోనేరు రంగారావు కమిటీ కూడా రాష్ట్రంలో భూమిలేని పేదలందరికీి భూమి పంచవచ్చునని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీల సంఖ్య 1991లో ఒక కోటి 10లక్షలు ఉండగా, ఇపుడది సుమారు 2కోట్లకు చేరుకున్నది. అటవీ హక్కుల చట్ట ప్రకారం కూడా గిరిజనులకు, తరతరాలుగా సాగుచేసుకుంటున్న నిరుపేదలకు పంచదగిన భూమి 30లక్షల ఎకరాలు ఉన్నది. ఇందులో 80శాతం తెలంగాణలోనే ఉన్నది. ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించింది 3లక్షల ఎకరాలు మాత్రమే. కౌలు సమస్య పరిష్కారం కాలేదు. వీటి పర్యవసానంగానే 2007లో, రాష్ట్రంలో మరోసారి 7మాసాల పాటు మహత్తర భూ పోరాటం సాగింది. ఇప్పటికీ కులవివక్ష అంతం కాలేదు. గిరిజనుల, వెనుకబడిన తరగతుల, మహిళల సామాజిక సమస్యలు పరిష్కారం కాలేదు. మిగిలి ఉన్న ఈ చారిత్రక కర్తవ్యం గురించి చర్చ జరగాలి. ప్రజల్లో చైతన్యం పెంచి, వారిని కర్తవ్యోన్ముఖులను చేయాలి.
Note:Article from prajasakti paper written by Veeraiaha(CPM Party State Scerterail member)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment