Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Wednesday, July 3, 2013

గోదారిలో 'తేల్‌' పడింది

కొందరు ఏం మాట్లాడినా సంచలనమే, ఏమన్నా జోకే! కార్మిక నాయకుడు, మంచి మనిషి అంజయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దినపత్రికల వాళ్లకు రోజుకో ఆహ్లాదకర విషయం అందుబాటులో ఉండేది. ఆయన ఏ మాట మాట్లాడినా అందులో ఓ తమాషాని వెదుక్కునేవారు.
ఒకసారి ఆయన 'గోదారిలో తేల్‌ పడింది' అన్నారు. కొందరికి ఏమీ అర్థం కాలేదు. గోదావరిలో తేలు పడితే ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేయాలా? అనుకున్నారు. కొందరు ఆయన పెంచుకున్న తేలు పడిందేమోనని అనుకుని ఉండవచ్చు కూడా. అయినా తాను పెంచుకునే తేలును గోదావరి దాకా ఎందుకు తీసుకుపోయినట్టు?
తీరా చూస్తే గోదావరిలో చమురు పడిందని తెలిసింది. 'తేల్‌' అంటే ఉర్దూలో నూనె కదా అని తరువాత అనుకున్నారు. అంతా నవ్వుకున్నారు హాయిగా. రెండు భాషలు కలిపి మాట్లాడితే ఇదే ప్రమాదం. ఆయన ఏది చేసినా అంతే. ఇంకోసారి అమెరికా పర్యటన అనంతరం హైదరాబాదుకొచ్చి 'అమెరికా ఎంతగానో అభివృద్ధి చెందింది. అక్కడ రైతులు కూడా 'ఇంగ్లీష'్‌ మాట్లాడుతున్నారు' అని ఆయన చెప్పినట్టు రాశారు. ఏమైనా ఆ డైలాగుకు కొద్దిసేపు నవ్వుకోవచ్చు. సెల్లు ఫోనులున్న ఈ రోజుల్లో గనుక ఆయన ఉండి ఉంటే మన ఎస్సెమ్మెస్సు జోకులన్నీ ఆయన మీదే ఉండేవేమో?
తరువాత అన్న రామారావు గారు కొన్ని సంవత్సరాలు అందర్నీ అలరించారు. ఇక వారి గురించి కూడా చెప్పుకుంటూ పోతే కథానాయకి 'తేలు'కు కోపమొచ్చి మనల్ని కుట్టవచ్చు!
అందుకే తేలు విషయానికొద్దాం. తేలంటే అందరికీ భయమే. పట్టణాలు, నగరాల్లో నివసించేవారికి అవి పరిచయం లేదు కాని పల్లెల్లో అవి మామూలే. ఎర్ర తేలనీ, నల్ల తేలనీ అవి కుట్టినప్పుడు వాటి తీవ్రత అక్కడివారే చెప్పాలి. 'అసలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే నాకు తేళ్లూ, జెర్రులూ వళ్లంతా పాకినట్లుంది' అనేవారూ ఉన్నారు. ఎండ్రకాయలు, రొయ్యలు ఇలా ఆ తెగకు చెందిన వాటి రూపమే అలా ఉంటుంది. వాటి కాళ్లు, కొండ్లు భయపెడతాయి. వాటి బంధువులే అయినా ఎండ్రకాయలు, రొయ్యలను మాత్రం బాగా తింటారు అది వేరే విషయం.
తేలంటే 'నిస్సిం ఎజికిల్‌' రాసిన 'తేలు కుట్టిన రాత్రి' అన్న ఆంగ్ల పద్యం గుర్తొస్తుంది. అందులో ఓ తల్లికి తేలు కుట్టడం, భూత వైద్యుడొచ్చి ఏవేవో మంత్రాలు చెప్పటం, ఇంకా ఇతర మూఢాచారాలు బాగా కనిపిస్తాయి. ఎవరో పసరు పూస్తారు. అయినా ఉపశమనము ఉండదు. ఇదంతా పూర్వ జన్మలో చేసుకున్న పాప ఫలమని ఒకరు చెబుతారు. రాత్రంతా నిద్రలేని ఆమెకు సూర్యోదయాన నొప్పి కొద్దిగా తగ్గుతుంది. ఇక గండం గడచినట్టే. ఆ తల్లి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. తనకు తగ్గినందుకు కాదు, తన పిల్లల్ని కుట్టకుండా తేలు తనని కుట్టినందుకు! పిల్లలపై తల్లి ప్రేమ అటువంటిది. స్వార్థరహితం.
ఇప్పుడో గోదావరి, కృష్ణా బేసిన్‌లో 'తేలే' కాదు, సహజ వాయువూ పడింది. మనల్ని తల్లిలా కాపాడవలసిన మన ప్రభుత్వాలు వాటిని తీసుకుపోయి బాగా చమురు దాహమున్న వ్యాపార స్తులకిస్తున్నాయి. అది ఎంత తాగినా తీరని దాహం. తాగే కొద్దీ పెరుగుతుంది. ఏమంటే రకరకాల లెక్కలు చూపిస్తున్నారు. ఇదేమని అడిగే దిక్కే లేదు. ఉన్న దిక్కు కొందరు నిలదీసినా లోపల అందరూ మిలాఖతు. కాబట్టి అక్కడ బలం చాలటం లేదు.
పెరట్లో పండిన కూరగాయలు ఉచితంగా దొరుకుతాయి కదా! మన దగ్గర దొరికితే ధర తగ్గుతుందని మనమ నుకుంటే పిచ్చోళ్లమే! అలా తగ్గదు. మీకు బొత్తిగా వ్యాపార సూత్రాలు తెలియవంటారు. జీవితంలో మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉందంటారు. మీరు ఎప్పుడు బాగుపడతారంటారు. ఇలా ఉంటే 'దేశమేగతి బాగు పడునోరు' అంటారు. 'అలా కావాలంటే ముందు మేము బాగు పడవలెనోరు' అని సూచన కూడా వస్తుంది.
సహజ వాయువును మింగే పెద్ద అనకొండ పడిందక్కడ. అది దాన్నంతా మింగి తిరిగి మనకే అమ్ముతుందట. అదీ సంగతి! ప్రభుత్వమే ఆ పని చేస్తే పోలా? అమ్మో అంత పెట్టుబడి కావద్దూ? ఇక్కడ పెట్టుబడి కంటే పుట్టుబడి ముఖ్యం. అందుకే వాటి జోలికి పోదు ప్రభుత్వం.
ఆ అనకొండను ఒకాయన ఆడిస్తుంటాడు. అది తల ఊపుతూ ఉంటుంది. ఇదంతా చూసే వాళ్లకు కనిపించే దృశ్యం. కానీ జరిగేది ఇంకొకటి. అనకొండ తన తలను ఊపిన విధంగానే ఈ పెద్ద మనిషి స్వరం వాయిస్తున్నట్టు నటిస్తాడు.
గోదావరిలో తేలుకిచ్చిన ఆర్భాటం ఈ అనకొండ విషయంలో కొందరివ్వటం లేదెందుకని మీకు అనుమానం రావచ్చు. తేలు చిన్నది కాబట్టి భయపడి ఉండరు. అనకొండ ఎంతో పెద్దది కదా అందుకే జంకుతున్నారు.
ఈ నవయుగ అనకొండకు నదులే కాదు, సముద్రాలు కావాలి. అప్పుడది అందులో ఉన్న చేపలు, తిమింగలాలు, సొర చేపలు ఇలా వానపాముల వరకూ అన్నింటినీ తినేస్తుంది. తినటమే కాదు దానికి జీర్ణశక్తి అధికం. అలా బలాన్నంతా విషం రూపంలో నింపుకుని ఇతర జీవాల్ని చంపేస్తుందది.
'కష్టాల్ని మనందరం పంచుకుందాం, లాభాల్ని మాత్రం మేం నంజుకుంటాం' ఇది అనకొండ సూత్రం. అది బలిసి బలిసి కాళీయునిలా తయారవుతుంది. దాన్ని మధనం చేయడానికి ఒక్క కృష్ణుడు సరిపోడు. ప్రజలందరూ రావాలి. అది మాత్రం తప్పదు. దాని పడగపై బాది విషాన్నంతా కక్కించే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆ విషంలోనే దాన్ని పెంచి పోషించినవారూ కొట్టుకుపోతారు. అప్పుడు వారికి ఏ 'ఆధారమూ' ఉండదు!
అప్పుడు గోదావరిలోని 'తేల్‌' చవగ్గా దొరుకుతుంది.

Article By : జంధ్యాల రఘుబాబు from prajasakti