ఒకానొక అడవి. ఆవు, పులి కథలోనిదే.
ఒక పులి, అదీ ఆ కథలో ఉన్న పులి వంటిదే. ఒక ఆవు, అదీ ఆ ... పులి వేటకని బయలుదేరింది. ఒక ఆవు కనిపించింది. ఎగిరి దాన్ని తినబోయింది. ఇంతలో ఆవు తనను తినవద్దని వేడుకుంది. 'ఇంటివద్ద నా చిన్న కొడుకు పాల కోసం చూస్తుంటాడు, వాడికి పాలిచ్చి, ఓ సారి ముద్దాడి బంధువులకు అప్పగించి వస్తాను' అని వేడుకుంది.
పులి మొదట ఒప్పుకోలేదు. 'నీవు తిరిగి వస్తావని నమ్మకమేంటి. నన్ను నేనే నమ్మను, నిన్నెలా నమ్మాలి' అని అడిగింది.
'నేను అసత్యాలు చెప్పను, చెప్పిన మాట తప్పను. నన్ను నమ్ము లేదా ఇప్పుడే తినేసేరు' అంది ఆవు.
అనుమానంతోనే పులి ఒప్పుకుంది. ఆవు వెళ్లిపోయింది. గోవు రాకపోతే అదే అదనుగా తీసుకుని తనకు ఇష్టమైనన్ని ఆవుల్ని తినవచ్చని లోపల అనుకుంది. చెప్పిన మాట ప్రకారం ఆవు తిరిగి వచ్చేసింది.
పులి కళ్లలో గ్లిసరిన్ వేసుకున్నట్టు కన్నీళ్లు కారాయి. 'నీవు మాట ప్రకారం వచ్చావు. నా మనసు కరిగించావు. నిన్ను వదిలేస్తున్నాను. వెళ్లు, నీ కొడుకుతో హాయిగా ఉండు' అని వెనక్కు పంపింది.
కథ అక్కడితో ఆగిపోతే ఇప్పటి వరకూ చదివిన దాంట్లో కొత్తేమీ లేదు. ఆపై సాగే కథలోనే కొత్తదనం.
మరుసటి రోజు పులి అడవిలోని జంతువులన్నింటినీ సమావేశపరిచింది. క్రితం రోజు జరిగిన 'ఆవు- పులి' కథ వివరించింది.
'నిన్నటి నుంచీ నా మనసు మారిపోయింది. ఒక ఆవు నన్ను మార్చివేసింది. నాకు వైరాగ్యమొచ్చేసింది. ఇక ఆవులను గానీ, ఇతర జంతువులను గానీ చంపి తినే గుణం నాలో నశించింది. అలాగని తినకుండా బతకలేను. అందుకే నేను చనిపో వాలనుకున్నాను. ఈరోజు రాత్రి కనిపించే ఆ కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసు కుంటాను. ఎవ్వరూ నన్ను ఆపటానికి ప్రయత్నిం చవద్దు'. 'నేను చనిపోయాక నా కథ పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా పెడతారు' అని మరొక్కసారి కళ్లనిండా నీరు తెప్పించింది.
జంతువులన్నీ తమ కళ్లలో కూడా నీరు తుడుచుకున్నాయి, రాకున్నా!
ఇక తమకు ప్రాణ భయం లేదని జింకలు, ఆవులు, మేకలు, ఇతర శాఖాహార జంతువులు ఆనందపడితే, అడవిలోని జంతువులన్నీ తమకేనని నక్క, తోడేలు, హైనా లాంటి జంతువులు మహదానందపడ్డాయి.
ఇంతలో ఓ ముదుసలి భల్లూకం ముందుకొచ్చి 'ఆత్మహత్య మహా పాపం, అందుకే నీవు మాంసాహారం మానేసి దుంపలు, గడ్డి లాంటి శాఖాహారం తిని జీవితం చాలించు' అని సలహా ఇచ్చింది.
ఈ సలహా నచ్చి జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి.
పులికి మహదానందంగా ఉంది. తనకు ఇంతలా ప్రచారం వస్తుందని ఊహించనే లేదు. 'ఇదే అదనుగా రాజుగా ఉన్న సింహాన్ని తొలగించి నేను రాజునై పోవచ్చు. తరువాత మళ్లీ మాంసాహారం మొదలెట్టవచ్చు' అనుకుంది లోలోపల.
తనకు శాఖాహారం సేకరించటం తెలియదు కాబట్టి రోజూ ఏదైనా ఒక జంతువు శాఖాహారాన్ని తీసుకురావలసిందిగా జంతువుల్ని కోరింది. జంతువులు కూడా సరేనన్నాయి.
చెప్పిన మాట ప్రకారమే చేశాయి. ప్రతి దినమూ పులికి శాఖాహారాన్ని తీసుకుపోయి ఇవ్వసాగాయి. కొత్తగా శాఖాహారాన్ని తింటున్న పులి బాగా నున్నగా తయారయింది. జంతువులకు శాఖాహారాన్ని తినమని ఎప్పుడూ చెప్పే సత్యజీవి 'చూశారా మాంసాహారం మానేస్తే ఎన్ని లాభాలో' అని తన ప్రచారం ఎక్కువ చేసింది.
కొన్ని రోజులకు అడవిలోని జంతువులు తగ్గినట్టు కనిపించింది. ఎవరికి వారు తమ జాతిని లెక్కపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. తమాషాగా శాఖాహారం తీసుకెళ్లిన జంతువులే మాయమైనట్టు జంతువుల సర్వేలో తేలింది. చూస్తే పులి మాంసాహారిగా ఉన్నప్పుడే తమకు నష్టం తక్కువగా ఉందని తేల్చేశాయి.
తమను ఈ విధంగా మోసం చేసిన పులిని మట్టుబెట్టాలని జంతువుల సమావేశం నిర్ణయించింది. అలాగే చేశాయి కూడా ...
తమ 'ఆవు- పులి' కథను ఈ విధంగా మార్చిన పులికి పట్టిన గతిని చూసి ఆవు నవ్వుకుంది, లోలోపల ...
అధికారం కోసం పులి 'గడ్డి' కరవచ్చేమో కానీ 'ఆహారంగా' మాత్రం తినదు. మాంసమే కావాలి!
** Article by -- జంధ్యాల రఘుబాబు
From prajasakti news paper