తెలుగు మాట్లాడే ప్రజల చరిత్రను గమనిస్తే ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు మత సామరస్యంతో ప్రాంతాలకు అతీతంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రజలందరూ తమ శక్తియుక్తులన్నిటినీ సమకూర్చడం వల్లనే సాంస్కృతిక, వాస్తుపరమైన, కళాపరమైన అభివృద్ధి కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర అభివృద్ధి గతంలో ఫ్యూడల్ పాలక వర్గాలకూ నేడు భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాల కూటమికీ మాత్రమే పరిమితమైంది. దోపిడీ పీడనల పట్ల ప్రజల్లో చైతన్యం పెరగుతున్న కొద్దీ వారు పాలక వర్గాల ప్రయోజనాలతో బహిరంగంగా ఘర్షణ పడుతున్నారు. సామాజాన్ని నిర్మించడానికి శ్రామిక ప్రజలు ఒళ్లుగుల్ల చేసుకుంటుంటే పాలక వర్గాలు తమ ప్రయోజనాలు రక్షించుకోడానికి సమాజాన్ని ముక్కలు చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో రాష్ట్ర విభజన/సమైక్యత మీద ప్రస్తుతం జరుగుతున్న చర్చలు అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. తెలుగు మాట్లాడే ప్రజల చరిత్రకు సంబంధిం చిన విషయం వీటిలో ఒకటి. రాష్ట్ర చరిత్రను గమనిస్తే ఆంధ్ర రాష్ట్రానికి తొలుత ఈనాటి భౌగోళిక స్వరూపం లేదన్న మాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుత మూడు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు మాట్లాడే ప్రజలను అనేక మంది పాలకులు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఒకే గొడుగు కిందకు తెచ్చారన్న మాట కూడా అంతే వాస్తవం. తెలుగు నేలకు చెందిన ప్రజలు సామరస్యంతో నివసిస్తూ దాని సాంస్కృ తిక, ఆర్థిక, కళాపరమైన పురోగతికి దోహద పడ్డారు.
1
మొట్టమొదటిసారిగా ఆంధ్రుల గురించి క్రీ.పూ.800 సంవత్సరం ఐతరేయ బ్రాహ్మణ గ్రంథంలో పేర్కొనబడింది. అందులో వారి ప్రాంతాన్ని దక్షిణాపథంగా పేర్కొన్నారు. ఆంధ్రులు తనచే పాలించబడుతున్న వారని 13వ శతాబ్దపు అశోకుని శిలాశాసనంలో పేర్కొనబడింది. మౌర్యుల తరువాత శాతవా హనులు ఆంధ్రదేశాన్నీ, దక్కన్ పీఠభూమిలోని కొంత ప్రాంతాన్నీ 400 సంవత్సరాలు (క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి క్రీ.శ. రెండో శతాబ్ది వరకూ) పాలించారు. తూర్పు చాళుక్యులు నేడు ఆంధ్ర ప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలనూ ఒకచోట చేర్చి రాజకీయ స్థిరత్వాన్ని సమకూ ర్చారు. 7వ, 14వ శతాబ్ద కాలంలో దేశీయ తెలుగు భాషా పద్ధతి సాహితీ మాద్యమంగా ఆవిర్భవించింది. భారతదేశ సంస్కృతిలో తెలుగుకు ఒక ప్రత్యేకస్థానం ఏర్పడింది.
12వ, 13వ శతాబ్దంలో మొత్తం తెలుగు నేలను (త్రిలింగ దేశం అనేవారు) పాలించిన కాకతీయుల పాలన తెలుగువారి సమిష్టి కృష్టి, కలిమికి మచ్చుతునక. కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన కళలు, వాస్తు శిల్పకళ, సంస్కృతి, భాష, సాహిత్యంలో మూడు ప్రాంతా ల తెలుగువారి భాగస్వామ్యం ఉంది. కాకతీ యుల తరువాత తెలుగుప్రాంతం కృష్ణదేవ రాయల విజయనగర సామ్రాజ్యంలో ఐక్య మైంది. అనంతరం 500 ఏళ్లపాటు తెలుగు వారు విజయనగర, బ్రాహ్మణి, కుతుబ్‌షాహి రాజుల చేత పాలించబడ్డారు. ఈ కాలంలో దక్షిణ-పడమర ప్రాంతాలైన తుంగభద్ర ఒడ్డున ఉన్న ప్రాంతాల నుండి తెలంగాణా, కోస్తాంధ్ర, రాయలసీమ, తాంజోర్, మధురై వరకు ఈ రాజ్యాలకింద ఏకీకృతమైనాయి.
కుతుబ్‌షాహీ వంశపాలన స్థాపకుడైన కులీ కుతుబ్‌షా 1518లో స్వాతంత్య్రాన్ని ప్రకటించు కుని మచిలీపట్నం వరకూ ఉన్న తెలుగు ప్రజలను పాలించాడు. హైదరాబాద్ నగరాన్ని క్రీ.శ.1590-91 కాలంలో మహమ్మద్ కులీ నిర్మించాడు. హైదరాబాద్ నిర్మాణానికి డెక్కన్ ప్రజలందరినుండీ- ఉత్తర కర్నాటక నుండి మరట్వాడానుండి, ఆంధ్ర, తెంగాణా, రాయల సీమలనుండి - ప్రజల వద్ద పన్నులు వసూలుచేసి డబ్బు సమకూర్చారు.
2
14వ, 18వ శతాబ్ద కాలంలో తెలుగువారి చరిత్రమీద విస్తరిస్తున్న హిందూ మతం, సంస్కృతి ప్రభావంతో బాటు ఇస్లామిక్ సంస్కృతి ప్రభావం నిర్ణయాత్మకంగా పడింది. మొట్టమొదటిసారిగా తెలుగుభాష, సంస్కృతిపై డెక్కనీ, ఉర్దు, పర్షి యన్ సాంప్రదాయాల ప్రభావం పడింది.
ఈ కాలమంతా మతసామరస్యానికి ఉదాహరణగా నిలిచింది. సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి ముస్లింల రాక ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు రాజధాని మార్చాలన్న మొహ మ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన వల్ల ఢిల్లీనుండీ, ఉత్తరాది నుండీ అనేకమంది ప్రజలు దౌలతా బాద్‌కు తరలివెళ్లారు. వీరు ఈ ప్రాంతాల్లో ఢిల్లీ సంస్థలతో పోలిక గల అనే సంస్థలు నిర్మించారు. దీంతో డెక్కన్ చరిత్రలో ఒక కొత్త సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర ప్రాంరంభమైంది.
డెక్కన్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కఫూర్ విధ్వంసం సృష్టించిన తరువాత, బహ్మనీ, మొగల్, అసఫ్‌జాల ఏడు శతాబ్దాల సుదీర్ఘ పాలన తరువాత కూడా డెక్కన్‌లోని హిందూ ప్రాచీన కట్టడాలు చెక్కుచెదరలేదు. ఈ కాలంలో మత ఘర్షణలు జరగలేదు. రెండు మతాలకు సంబంధించినవారు పరస్పర గౌర వంతో మెలిగేవారు. ఒకరి ప్రభావం మరొకరిపై పడడమే కాదు అవి కింది స్థాయివరకు పోనిచ్చారు. ఈ ధోరణి వల్ల ఈ ప్రాంతంలో మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. శత్రువులైన బహ్మనీలు, విజయనగర సామ్రాజ్య పాలకులు యుద్ధాలు చేసినా వారి పోరు రాజకీయాలకే పరిమితమైంది. మతఘర్షణలకు వారి మధ్య తావులేదు. ఇద్దరి సామ్రాజ్యాలలో హిందు వులు, ముస్లింలు కీలకమైన బాధ్యతలు నిర్వ హించేవారు. రాజకీయాలు ఇద్దరి సంస్థానా లలో మతాలకు అతీతంగా ఉండేవి.
హిందువుల పండగలైన హోలీ, ఉగాది, దీపావళి, సంక్రాంతి, బసంతిల్లో ముస్లింలు పాల్గొనేవారు. మహ్మద్ కులీ పండగలపై తనకున్న మమకారాన్ని అనేక పద్యాల్లో వ్యక్తపరిచాడు. హిందువులు కూడా ముస్లింల పండగలలో ముఖ్యంగా సుఫీ విశ్వాసాలకు దగ్గరగా ఉన్న వాటిలో పాల్గొనేవారు. ఈ విషయంలో 'అషుర్ఖానా' (ప్రవక్త మనవడి యుద్ధసాధనాలు దాచి ఉంచే ప్రదేశం) ముఖ్య పాత్ర నిర్వహించింది. కుతుబ్ షాహి సామ్రా జ్యంలోని ప్రతి గ్రామంలోనూ 'పీర్లు' పేరుతో దాని నమూనా ఉండేది.
ముస్లిం పండితులు, సుఫీలు, కవులు, సుల్తాన్‌లు, డెక్కనీని తమ భాషగా మార్చు కున్నారు.. వారు మాట్లాడే భాషలోని అనేక పదాలు రకరకాల ప్రాంతాల భాషల నుంచి సేకరించినవి. కుతుబ్‌షాహీ హిందువులకు, ముస్లింలకు మధ్య ఉన్నత పదవుల్లో తేడా చూపలేదు. తమ సంస్థానంలో జరిగే తగాదాల పరిష్కారానికి ఆయా మత సంబంధిత నియ మాలు తెలియజేయడానికి సుఫీలు, ఖాజీలు, హిందు పండితులను పిలిచేవారు. కుతుబ్‌షాహీ సామ్రాజ్యంలో హిందువులు పూర్తి రక్షణనూ, స్వేచ్ఛనూ ఆస్వాదించేవారు. గోల్కొండ సామ్రా జ్యంలో ఇస్లాంలోకి బలవంతపు మార్పిడి జరిగిన దాఖలాలు లేవు. ఆనాడు సమాజంలో మతసహనం, విశాల దృక్పథం, మానవతా వాదం ఇమిడివుండేవి. ముస్లింలు, హిందువులు ఒకరి సంస్కృతీ, సాంప్రదాయాల ను మరొకరు ఇచ్చిపుచ్చుకునేవారు. ఆనాటి సాహిత్యం, శిల్పకళ, పండగలు రెండు మతాల మేలికలయి కను చాటిచెపుతాయి.
ప్రొఫెసర్ పనికర్ దీనిగురించి ఇలా చెప్పారు: ''బ్రిటిష్ వారు రాకముందు భారత్‌లో అన్ని సంస్కృతుల మేలుకలయిక జరిగింది. ఆ నాడు దేశంలో మతసామరస్యం ఒక్కటి మాత్రమే ఉన్నంత మాత్రాన ఈ క్రమం జరిగేది కాదు. ఒక మతం నుండి మరో మతం ఇచ్చి పుచ్చుకోవడం జరిగిందంటే ఒకరి మతం పట్ల మరొకరికి గౌరవం, అభిమానం ఉన్నాయన్న మాట. ఇటువంటి ధోరణి వల్లనే గత 2000 సంవత్సరాల కాలంలో మన దేశంలో ఒక సంస్కృతి మరో సంస్కృతిలోకి చొచ్చుకుపోవడం జరిగింది''
3
1724 తరువాత డెక్కన్ పీఠభూమి చరిత్ర.. ఇంగ్లాండ్, ఫ్రాన్సులకు చెందిన ఈస్ట్ ఇండికా కంపెనీల వ్యాపార, వలసవాద ప్రయో జనాలచేతా, అసఫ్‌జాహీ నిజామ్స్, మరాఠా పీష్వాస్, కర్నాటక రాజుల రాజకీయ యుద్ధా లచేతా లిఖించబడింది. డెక్కన్ భూమిని 1724 నుంచి సెప్టెంబరు 1948 వరకూ అసఫ్‌జాహీ నిజామ్స్ పాలించారు.
1768 -1801 మధ్య కాలంలో నిజాం తను చేసిన అప్పుకు గాను ఆంధ్ర, రాజలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. 1768లో ఉత్తర సర్కారు జిల్లాను బ్రిటిష్ వారికి బదిలీ చేశాడు. 1788లో గుంటూరు సర్కా రును అప్పగించాడు. 1800లో ఒక ఒప్పందం కింద నిజాం రాయలసీమ జిల్లాలు, బళ్లారి (ప్రస్తుతం కర్నాటకలో ఉన్నది)పై హక్కులను బ్రిటిష్‌వారికి దారాదత్తం చేశాడు. అయితే ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాలుగా ఉన్న నాటి నెల్లూరు ప్రాంతాన్నీ, చిత్తూరు జిల్లాలోని కొంత ప్రాంతాన్నీ 1781లో బ్రిటిష్ వారు ఆర్కాట్ నవాబు నుండి స్వాధీనం చేసుకున్నారు. దాంతో 1801 నాటికి తెలుగు మాట్లాడే ప్రజలు రెండు ప్రాంతాలుగా విడిపోయారు. అందులో ఒకటైన తెలంగాణా నిజాం ఫ్యూడల్ వంశపారంపర్య పాలన కిందకు పోయింది. రెండోదైన ఆంధ్రగా పిలవబడే ప్రాంతం బ్రిటిష్ పాలనలోని మద్రాసు ప్రెసిడెన్సీ కిందకు పోయింది. అందువల్ల మొత్తం 2000 సంవత్సరాల తెలుగు ప్రజల చరిత్రలో 1801 నుండి 1947 మధ్య కాలంలో మాత్రమే వారు రెండు విభిన్న రాజకీయ, ఆర్థిక వ్యవస్థలుగల ప్రభుత్వాల కింద చీలి ఉన్నారు. ఈ 150 సంవత్సరాల కాలంలోనే నిజాం పాలనకింద రెండు మతాల ప్రజల మనసుల్లో అనుమాన బీజాలు నాటుకున్నాయి. ఇవి వారి మధ్య ఐక్యతకు ప్రమాదంగా పరిణమించాయి.
అఫ్జల్ ఉద్ దావ్లా పరిపాలనా కాలంలో 1857 పరిణామాల (మొదటి స్వాతంత్య్ర సంగ్రామం) వల్ల కొంతవరకు హిందూ ముస్లింల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సాలార్ జంగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ సామరస్య విధానం కొనసాగింది. దీని గురించి క్లాడె కాంప్ బెల్ తను రాసిన ''నిజాం పాలిత ప్రాంతాల తీరు'' అన్న గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు: ''హైదరాబాద్ సంస్థానంలో వివిధ మతాల మధ్య కనిపిస్తున్నంతటి సామరస్యం భాతర దేశంలోని మరే హిందూ, మహమ్మదీయ పాలకుని కిందా కనిపించడం లేదు.'' ఆ విధం గా ఈ కాలంలో మత సామరస్య విధానం కొనసాగింది. కాని మీర్ మహమ్మద్ ఆలి ఖాన్ హయాం వచ్చేసరికి ఈ విధానం నుండి క్రమంతా పక్కకు మరలడం ప్రారంభమైంది.
మీర్ మహమహమ్మద్ ఆలీ ఖాన్ హయాంలో ఎందుకిలా జరిగిందో తెలుసు కోవాలంటే ఈ కాలంలో మొత్తం దేశవ్యా పితంగా మారిన పరిణామాలను గురించి మనం తెలుసుకోవలసి ఉంటుంది. 1857 సంగ్రామం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడ టంలో హిందూ-ముస్లిం ఐక్యత యొక్క ఆవశ్యకతను గురించి భారత ప్రజలకు నేర్పి నట్లే వారి ఐక్యతను చెడగొట్టకపోతే వచ్చే నష్టాన్ని గురించికూడా బ్రిటిష్ వాడికి తెలియజెప్పింది. దాంతో అప్పటినుండి బ్రిటిష్ వాడు భారత ప్రజలను మతాలవారీగా విడగొట్టి ఉంచడానికి ఒక పద్దతి ప్రకారం మత రాజకీయాలను ముందుకు తెచ్చాడు. వలస వాతం సృష్టించిన వాస్తవ పరిస్థితలు అంటే ఆర్థికంగా అభివృద్ధి లేమి, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మార్పులూ మతతత్వం పెరుగుదలకు పునాదిని ఏర్పరిచాయి.
హిందూమత పునరుద్ధరణ వాదం ప్రాచీన చరిత్రను ఆకాశానికెత్తడం ప్రారంభించింది. అదే సమయంలో మధ్య యుగాల కాలంలో జరిగిన అభివృద్ధిని చిన్నదిగా చేసి చూపింది. వీరు క్రమంగా మతపునరుద్ధరణ వాదం హద్దులూ, మతంలోపల అంతర్గత సమీకరణల హద్దులూ దాటి ముస్లింలను శత్రువులుగా చూపెట్టే స్పష్ట మైన మతతత్వ మార్గాన్ని పట్టారు. ఆ విధంగా క్రమంగా గతంలోని 'పరస్పర గౌరవం', 'అభి మానం' అనే సంస్కృతి నుండి రెండు మతాలూ పరస్పరం అనుమానంతో చూసుకునే స్థితికి వెళ్లాయి. వలసవాద పాలకులు రెండు మతాల మధ్య ఏర్పడిన ఈ మతభావనలను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. వారు రెండు మతాల్లోని భయాలను ఎగదోసి వేర్పాటు వాద భావనలు పెంచారు.
ఈ పూర్వరంగంలో 1892లో హైదరా బాద్‌లో ఆర్యసమాజం ఏర్పడింది. 1895లో మొట్టమొదటి సారిగా గణేష్ ఉత్సవాలను బహిరంగ ప్రదేశంలో నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవం పెరుగుతున్న జాతీయ భావాల నుండి పుట్టుకొచ్చిందే అయినప్పటికీ హైదరా బాద్‌లో అది ఆర్యసమాజ్, దాని కార్యకలా పాలతో ముడి వేసుకుంది. హిందూ పండుగల పైన ముఖ్యంగా హిందూ, ముస్లిం పండుగలు ఒకేమారు వచ్చే సందర్భంలో ప్రభుత్వం కొన్ని నిషేధాలు పెట్టింది. దాంతో సంస్థానంలోని హిందువుల్లో అసంతృప్తీ, అస్థిరతా భావం ఏర్పడింది. ఈ నిషేధాలు ఘర్షణలను నివారిం చాల్సింది పోయి కొత్త ఘర్షణలకు కారణ మయ్యాయి. 1765 నుంబీ బ్రిటీష్ ప్రభుత్వ మిత్రునిగా ఉంటూ వచ్చిన నిజాం ప్రభుత్వం తమ పాలనలో ప్రజలకు మతస్వేచ్ఛను కలగజేస్తే స్వాతంత్య్ర పోరాటానికి దారితీస్తుం దని భయపడింది. అప్పటినుండి అది హిందు వుల ఉత్సవాలపై నిషేధాలు విధించడం, ముస్లిం మత మజ్లీస్-ఇట్టిహద్-ఉల్-ముస్లిమీన్‌ను సమర్థించడం ప్రారంభించింది.
ఆర్యసమాజ్ ఈ పరిస్థితిని ఉపయోగించు కుంది. తన కార్యక్రమాలను ఉధృతం చేసి, తీవ్రమైన ప్రచారానికి పూనుకుంది. మరోవైపు మజ్లిస్, ముస్లింల సంఖ్యను పెంచడానికి మతమార్పిడి ప్రారంభించింది. ఇవి ఇరుమతాల మధ్య అనుమానాలు, అపోహలు మరింత పెరగడానికి దారితీశాయి. ఆ విధంగా మత ఘర్షణలు పెరగడానికి కావలసిన బీజాలన్నీ నాటబడ్డాయి. 1930లో డెక్కన్ ప్రాంతంలోనూ, 1938లో హైదరాబాద్‌లోనూ మొదటి మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ తరువాత కాలంలో రాష్ట్రచరిత్ర అనేక రక్తపుటలతో నిండింది.
4
నిజాం హయాంలో రాష్ట్ర సామాజిక, ఆర్థిక జీవనం ఫ్యూడల్ దోపిడీకి, గ్రామాల్లో వెట్టి విధానం వల్ల ప్రభావితమైంది. మొత్తం పట్టణ ప్రాంతాలన్నీ కలుపుకుంటే 500 ఫ్యాక్టరీలుండేవి. ఈ పట్టణాల్లో ప్రజల ఆదా యల మధ్య అంతరం అత్యధికంగా ఉండేది. ప్రభుత్వంలోని అత్యున్నతాధికారి జీతం సంవత్స రానికి 5 కోట్ల రూపాయలు. కాగా కార్మికుల సంత్సర ఆదాయం కేవలం రూ.144 నుంచి రూ.720 వరకూ ఉండేది.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని కప్పి పుచ్చడంలో భాగంగా ముస్లిం మద్దతు పొందేం దుకు మజ్లిస్, నిజాం సహకారంతో ''ముస్లింలు పాలక వర్గం'' అన్న ప్రచారాన్ని అందుకున్నది. దాంతో పెరుగుతున్న హిందూ మధ్యతరగతి, వ్యాపార వేత్తలు, మేధావులు ఈ ప్రచారానికి ఎదురుతిరగడం ఆరంభించారు. దాంతో ఆర్య సమాజం ''హిందూ ప్రజలకు'' నాయకునిగా, 'ముస్లిం పాలకులకు'' వ్యతిరేకిగా ఆదరణ సంపాదించింది.
దేశాన్ని మతపరంగా విభజించాలన్న ప్రతి పాదన ప్రభావం కూడా ఈ ప్రాంతం మీద పడింది. ఖాసిం రజ్వీ నాయకత్వంలోని మజ్లిస్ మిలిటెంట్ విభాగమైన రజాకార్లు హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేయడం ప్రారం భించారు. కొన్ని ప్రాంతాల్లో వారు ప్రజలపై హత్యలు, దోపిడీలు చేశారు. బాధితులు హిందువులు కావడం చేత, రజాకార్లు ముస్లిం పాలకుని నాయకత్వంలోని ముస్లిం రాజ్య సిద్ధాంతంతో ప్రభావితమైన ముస్లింలు కావడం చేత హిందువుల్లో భయాందోళనలు మొదల య్యాయి. ఈ పరస్పర అపనమ్మకం తర్వాత కాలంలో భయంకర మతవిధ్వేషాలను సృష్టిం చింది.
భారత జాతీయ కాంగ్రెస్ 1940వ దశకం వరకూ కూడా 'సంస్థానాల్లోని' ప్రజల సమస్య లను పట్టించుకోకపోవడంతో ఆర్యసమాజ్, మజ్లిస్‌లకు పరిస్థితి వదిలివేయబడింది. ఈ ప్రాంతం కమ్యూనిస్టుల ప్రభావం కిందకు వచ్చేవరకు ఈ పరిస్థితి కొనసాగింది. కమ్యూ నిస్టుల రాకతో ఆంధ్ర మహాసభ ప్రజల సమస్య లను తీసుకుని ఒక మిలిటెంట్ సంఘంగా మారింది. ప్రఖ్యాత తెలంగాణా సాయుధ పోరాటాన్ని నడిపింది. ఈ పోరాం ఆర్యసమా జం, మజిలీల విచ్ఛిన్న రాజకీయాలకు పూర్తిగా విరుద్ధమైనది. కమ్యూనిస్టుల నాయకత్వంలో హిందూ, ముస్లిం మతాలకు చెందిన ప్రజలు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటం సందర్భంగా వారు పీడకులది ఏ మతం అన్న విషయాన్ని పట్టించుకోలేదు.
పోలీస్ చర్య తరువాత నిజాం ఓడిపో వడం, ఆయన సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం కొత్త మార్పులు తీసుకు వచ్చింది. అప్పటివరకూ 'మనమంతా పాలక వర్గం' అన్న మజ్లిస్ ప్రచారపు భ్రమల్లో ఉన్న ముస్లింలకు ఒక్కసారిగా ఆ భ్రమాత్మక బుడగ పగిలిపోయినట్లయింది. భ్రమాత్మకమైనదే అయినా 'తమ సామాజిక హౌదా పోయింది' అన్న భావనా, వారి పేదరికం వారిని ఒక్క కుదుపుకు గురిచేసింది. తమ మధ్య రాజీతో అధికారంలోకి వచ్చిన బూర్జువా-భూస్వామ్య వర్గాలు సహజంగానే వారి బాధలు తీర్చడానికి గానీ, వారి భయాలు పోగొట్టడానికి గానీ పూను కోలేదు. అంతటితో ఆగకుండా ఈ ప్రాంతంలో ప్రజాదరణ పొందుతున్న కమ్యూనిస్టులను వారు మతతత్వ శక్తులను ప్రోత్సహించడం ప్రారంభిం చారు. తాత్కాలికంగా వారు కమ్యూనిస్టులను ఓడించి ఉండొచ్చుగాక కాని ఈ ప్రయత్నాలు మతవిధ్వేషాలను మరింత పెంచాయి. ఈ కాలంలో ఆర్యసమాజ్ స్థానాన్ని జనసంఘం ఆక్రమించి, హిందువుల ప్రయోజనాల కాపాడే, మజ్లిస్‌కు వ్యతిరేకంగా నిలబడే శక్తిగా ముందుకు వచ్చింది.
సమాజానికి జరిగే నష్టాన్ని గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ, పాలక వర్గాలూ తమ స్వల్పకాల ప్రయోజనాలకోసం మతఘర్షణలు రెచ్చగొట్లే ఎత్తుగడలను అవలం భించారు. దీని గురించి ప్రొఫెసర్ ఫణిక్కర్ ఇలా రాశారు: ''భారత దేశ రాజకీయాల్లో మతతత్వం అనేది ఒక అంతర్భాగం అయిపో యింది. పాలక వర్గ రాజకీయాలకూ, మత తత్వానికీ మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోకుండా మనం మతతత్వానికి పునాది ఎందుకు పెరుగుతోందో అర్ధం చేసుకోలేం. బూర్జువావర్గ రాజకీయాలు అన్ని సామాజిక విభజనలనూ అందులోనూ అత్యంత ముఖ్యమైన మతాన్ని తన ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటుంది.''
ఒకప్పుడు సహనానికి మారుపేరైన ఆంధ్ర ప్రదేశ్ పాలకవర్గాలు చేపట్టిన ఈ అవకాశవాద రాజకీయాల వల్ల నేడు అహ్మదాబాద్, ముంబై తరువాత మత ఘర్షణల్లో మూడో రాష్ట్రంగా నిలిచింది. మత ఘర్షణలకు కారణాలు ప్రార్థనా స్థలాల ముందు మైకుల మోతగానీ, ఊరేగింపుల మీద వేయడం గానీ, లేక ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేయడంగానీ ఏం జరిగినా వెను వెంటనే మతఘర్షణలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. కారణాలేమైనా ఈ మత ఘర్షణలు రెండు మతాల మధ్య నెలకొన్న లోతైన విభజనకు ప్రతిబింబాలుగా ఉన్నాయి.
5
మన దేశం ఎంచుకున్న ఆర్థిక విధానాలు ఈ గాయాలను మన్పే విధంగా లేవు. పాలక వర్గాలు 'పెట్టుబడి-కేంద్రంగా నడిచే' ఆర్థిక విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఒకచోట జరిగే అభివృద్ధి క్రమంగా అన్ని ప్రాంతాలకు చేరుతుం దనేది వీరి వాదన. కానీ మనకు కనిసిస్తుందల్లా దారిద్య్రం ఎడారిలో ఒక్కడక్కడా ఒయాసిస్సు ల్లాంటి ధనిక ప్రాంతాలు మాత్రమే. ఇటువంటి పరిస్థితి ప్రాంతీయ ధోరణులు పెరగడానికి మంచి క్షేత్రంగా పనికొస్తుంది. సహజంగానే దీనివల్ల ప్రజలు అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దానివల్ల ఆయా ప్రాంతాల జనాభాలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో నివసించే ముస్లిం లు తమ అవకాశాలు మరింత తగ్గిపోతున్నా యనిభయాందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది మతతత్వ శక్తుల పెరుగుదలకు మరింత అవకాశం ఇస్తోంది.
వలస పోవడం ముస్లింల మీద పడుతున్న మరో ప్రభావం. కొంతమంది ముస్లింలు గల్ఫ్‌కు వలసవెళ్లి డబ్బు గడించి వచ్చి హైదరాబాద్‌లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభి స్తున్నారు. ఇప్పటికే నగరంలో వ్యాపారాల్లో పాతుకుపోయినవారు, ముఖ్యంగా హిందూ మతానికి చెందిన వారు వారిని తమకు పోటీ దారులుగా చూస్తున్నారు. తమ వ్యాపారాలను కాపాడుకోడానికి ఈ వ్యాపార వేత్తలు తమతమ మత సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ హైద్రాబాద్ నగరాన్ని అగ్నిగుండంగా మార్చాయి.
ఇలా పాలక వర్గాలూ, వారి ప్రతినిధులైన పార్టీలూ తమ స్వార్ధం కోసం మతాన్ని వాడుకు న్నాయి. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు ప్రమాదం వస్తుందనుకున్న ప్రతిసారీ మతఘర్షణలను రెచ్చగొడుతున్నాయి. అధికార పార్టీ ముఠా కుమ్ములాటలను కూడా మతఘర్ణ ణలతో పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మత ఘర్షణలు ప్రజల మనస్సుల్లో మతవిధ్వేషాలను మరింత లోతుగా పాదుకొల్పు తున్నాయి. మతతత్వం పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన అవ్యవస్థ అనిప్రొఫెసర్ బిపిన్‌చంద్ర చెప్పారు. ఆయితే అది క్రమంగా సమాజంలోని అన్ని వర్గాల్లోకీ ముఖ్యంగా పేదల్లోకి చొచ్చుకు పోతోందని తెలిపారు. ఎందుకంటే వీధుల్లో పోరాటాల్లోకి వచ్చేది పేద ప్రజలే.
ఇప్పటికే మతతత్వంతో నిండిఉన్న పరిస్థి తికి ప్రాంతీయ తత్వం తోడయింది. ఈ రెండూ అసమాన అభివృద్ధి వల్ల తలెత్తినవే. పాలక వర్గాలు ప్రజల మధ్య చీలికలు తెచ్చేందుకు వర్గ అస్థిత్వం మినహా మిగిలిన అన్ని అస్థిత్వాలనూ ఉపయోగించుకుంటున్నాయి. తన ప్రయోజనాలు నెరవేర్చుతా యనుకున్న ప్పుడల్లా అవి మతతత్వం, ప్రాతీయ తత్వం, కులతత్వం వగైరా అన్ని అస్థిత్వాలనూ ఉపయో గించుకుంటాయి. 1960వ దశకం రెండో భాగంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది. ప్రజలు తమ బాధలపట్ల నిరస నలకు దిగారు. ఈ కాలంలోనే మనం మొదటి సారి కాంగ్రసేతర పార్టీలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం చూశాం. ఇదే సమయంలో మహా రాష్ట్రలో శివసేన, అస్సాంలో లచిత్‌సేన ప్రాంతీయతత్వాన్ని అస్త్రాలుగా వాడుకుని పెరగడమూ చూశాం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక తెలంగాణావాదం అప్పుడే మొదలైంది.
సంక్షోభ సమయంలో పాలక వర్గాలు కూడా ఒత్తిడికి గురవుతాయి. దాంతో వాటి ప్రాతినిధ్య పార్టీల్లో అంటే పాలక పార్టీలో పదవులకోసం, అధికారం కోసం, నేతల మార్పిడి కోసం కుమ్ములాటలు ప్రారంభమవు తాయి. ప్రజల్లో వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేయ డం కోసమే గాక తమలోని ముఠా తగాదాలను పరిష్కరించుకోడానికి వేర్పాటు వాదాలను ముందుకు తెచ్చి ప్రోత్సహిస్తాయి. 'లేని శత్రువును ఉన్నట్లు చూపించి' ప్రజలను పక్కదోవ పట్టించడానికి పాలక వర్గాలు ప్రయత్నిస్తాయి. ఇతర కులాలు, మతాలకు చెందిన నీ పొరుగు వాణ్ణి శత్రువుగా చూపించి ప్రజల నిజమైన శత్రువు నుండి దృష్టి మళ్లిస్తాయి. ఈ కాలాన్ని ఉపయోగించుకుని అవి తమను తాము కూడదీసుకుని కొత్త దాడులు ప్రారంభిస్తాయి.
సరిగ్గా ఈ పూర్వరంగంలోనే మన రాష్ట్రం లో నయా-ఉదారవాద విధానాలు అమలు పరచడం ప్రారంభించారు. నయా-ఉదార వాదం అంటే వివిధ రంగాలనుండి ప్రభుత్వం తప్పుకోవడమే కాదు అయా రంగాల్లో ప్రయివేటు రంగాన్ని అనుమతించడం, బాగా లాభాలు గడించేట్లు చూడ్డం. సబ్సిడీలు, సామాజిక కార్యక్రమాలు నిలిపివేయడం, పిఎస్‌యులు మూసివేయడం వంటివి జరుగు తూనే ఉన్నాయి. ఇవన్నీ పేద ప్రజల బాధలు మరింత పెంచాయి. పేద ధనిక తారతమ్యాలు పెంచాయి. సంపద కొద్ది మంది దగ్గర పోగ యింది. బలహీనమైన రాష్ట్రాల్లో చొచ్చుకు పోవడం చాలా సులభమని ద్రవ్య పెట్టుబడికి తెలుసు. అందువల్ల తన ఆర్థిక దోపిడీ ఎజెండాతో బాటు ప్రభుత్వాలకు చెందిన అన్ని రంగాలనూ, ప్రతిఘటనోద్యమాలనూ బలహీన పరచడం వెనుక దానికి తనదైన సామాజిక- రాజకీయ ఎజెండా కూడా ఉంది. ప్రపంచీకరణ కేంద్రీకరణకూ, ఏకసదృశ స్థితికీ దారితీస్తోంది. విపరీతమైన కేంద్రీకరణ ముక్కలవడానికే దారితీస్తుంది అని ప్రొఫెసర్ అనంతమూర్తి చెప్పారు. ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ముక్కలు చెయ్యాలన్న డిమాండ్లు దీనినుండే పుడుతున్నాయి. నయా-ఉదారవాద సిద్థాంతాన్ని అవలంభించే మతతత్వ శక్తులు ప్రాంతీయ వాదాన్ని లేవనెత్తడానికి ఎలాంటి సిగ్గు బిడియం చూపించవు. బిజెపి, జమత్-ఇ-ఉల్లేమా- హింద్..రెండూ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కోరడాన్ని మనం చూస్తాం.
ఈ రోజు ప్రపంచమంతా పాలకవర్గాలు వ్యవస్థాగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి వారు మార్గాన్వేషణ చేస్తున్నారు. ఈ సంక్షోభం నుండి నష్టాలు లేకుండా లేక తక్కువ నష్టాలతో బయటపడేందుకుగాను వారు భారాలను కార్మిక వర్గం మీదా, ఇతర శ్రామిక ప్రజలమీదా నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సరికొత్త దాడులకు ప్రతిఘటనను విచ్ఛిన్నం చేయడానికి వారు ప్రజల్లో మరోసారి ఎటువంటి వేర్పాటు వాద ధోరణులనైనా ప్రోత్సహిస్తారు. ప్రజలు కులం/ఉపకులం మతం, ప్రాంతం/ఉప ప్రాంతం, లింగం, జాతి వగైరా ఎన్ని విధాలుగా చీలిపోతే వారిని అంతగా ఉపయోగించుకో వచ్చునన్న సంగతి వారికి తెలుసు. ఎన్ని ముక్క లైతే వారికి అంత సంతోషం. ఎందుకంటే ఆ మేరకు దోపిడీ దారులకు ప్రతిఘటన తగ్గిపోతుంది.
తెలుగు మాట్లాడే ప్రజల చరిత్రను గమ నిస్తే ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు మత సామరస్యంతో ప్రాంతాలకు అతీతంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడు తుంది. సాంస్కృతికంగా, శిల్పకళాత్మకంగా, రాష్ట్రం కేవలం అందరిసహకారంతోనే సాధ్య పడుతుంది. ప్రజలందరూ తమ శక్తియుక్తు లన్నిటినీ సమకూర్చడం వల్లనే సాంస్కృతిక, వాస్తుపరమైన, కళాపరమైన అభివృద్ధి కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర అభివృద్ధి గతంలో ఫ్యూడల్ పాలక వర్గాలకూ నేడు భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాల కూటమికీ మాత్రమే పరిమితమైంది. దోపిడీ పీడనల పట్ల ప్రజల్లో చైతన్యం పెరగుతున్న కొద్దీ వారు పాలక వర్గాల ప్రయోజనాలతో బహిరంగంగా ఘర్షణ పడుతున్నారు. సామాజాన్ని నిర్మించడానికి శ్రామిక ప్రజలు ఒళ్లుగుల్ల చేసుకుంటుంటే పాలక వర్గాలు తమ ప్రయోజనాలు రక్షించు కోడానికి సమాజాన్ని ముక్కలు చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే ప్రజల ఐక్యత, వర్గ ప్రాతిపదిపై వారి మధ్య ఐక్యత చాలా ముఖ్యం. కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఏకం కావడం ద్వారానే ప్రజలు విజయాలు సాధిస్తారు.
Article From MarxistPaper Written By ArunKumar